మళ్లీ హైకోర్టుకే!

ABN , First Publish Date - 2021-07-23T08:45:08+05:30 IST

మళ్లీ హైకోర్టుకే!

మళ్లీ హైకోర్టుకే!

దమ్మాలపాటి కేసులో పిటిషన్‌ వెనక్కి

సర్కారు వినతి... సుప్రీంకోర్టు అంగీకారం

నెలలో కేసు తేల్చాలని హైకోర్టుకు సూచన


న్యూఢిల్లీ, జూలై 22 (ఆంధ్రజ్యోతి): అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోళ్లపై మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌తోపాటు మరికొందరిపై నమోదైన కేసులో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఏసీబీ నమోదు చేసిన ఈ కేసులో దర్యాప్తు నిలిపివేయాలని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. స్టే ఎత్తివేయాల్సిందిగా హైకోర్టునే ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. పిటిషన్‌ ఉపసంహరణకు గురువారం జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరితో కూడిన ద్విసభ్య ధర్మాసనం అనుమతించింది. అదే సమయంలో... హైకోర్టులో దమ్మాలపాటి దాఖలు చేసిన సవరణ పిటిషన్‌ను కూడా అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. పిటిషన్‌ ఉపసంహరణకు అనుమతించాలని ప్రభుత్వ న్యాయవాది మహ్‌ఫూజ్‌ నజ్కీ విజ్ఞప్తి చేసినప్పుడు... ‘హైకోర్టులో కౌంటర్‌ ఇంకా వేయలేదా?’ అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. ఇంకా కౌంటర్‌ దాఖలు చేయలేదని, కౌంటర్‌తోపాటు దర్యాప్తుపై స్టేను ఎత్తివేయాలని అప్లికేషన్‌ కూడా దాఖలు చేస్తామని నజ్కీ సమాధానమిచ్చారు. దాదాపు 8 నెలలుగా కేసు పెండింగ్‌లో ఉందని, కాబట్టి త్వరగా తేల్చాలని హైకోర్టుకు సూచించాలని సిద్ధార్థ లూథ్రా విజ్ఞప్తి చేశారు. దీంతో నాలుగు వారాల్లో కేసును తేల్చాలని హైకోర్టుకు ఽధర్మాసనం సూచించింది.  ‘‘హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేస్తామని గత విచారణలో చెప్పారు కదా? ఇంకా ఎందుకు చేయలేదు?’’ అని ధర్మాసనం ప్రశ్నించగా... ఇప్పుడు తాము తెలివివంతులమయ్యాయని (వైజర్‌), కౌంటర్‌ దాఖలు చేస్తామని నజ్కీ అన్నారు. ఈ కేసులో దమ్మాలపాటి తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.

Updated Date - 2021-07-23T08:45:08+05:30 IST