దర్జాగా దందా

ABN , First Publish Date - 2021-12-02T06:55:26+05:30 IST

జిల్లా సరిహద్దుల్లో ప్రవహిస్తున్న పెన్‌గంగా నదిలో అక్రమార్కులు ఇసుకను తోడేస్తూ అమ్మేసుకుంటున్నారు. ఈయేడు సమృద్ధిగా వర్షాలు కురవడంతో పుష్కలంగా పెన్‌గంగా నదిలో ఇసుక మేటలు అందుబాటులో ఉ న్నాయి. మార్కెట్‌లో ఇసుకకు భారీ డిమాండ్‌ ఉండడంతో కొందరు అక్రమార్కులు నది నుంచి ఇసుకను తరలిస్తూ అక్రమ సంపాదనకు ఎగబడుతున్నారు. పెన్‌గంగా పరివాహక

దర్జాగా దందా
బేలలో పెన్‌గంగా నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారిలా..

పెనుగంగా తీరాన ఇసుక తోడేళ్లు 

జిల్లాలో నిత్యం యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

అడ్డూఅదుపు లేని ఇసుక మాఫియా ఆగడాలు

వేలం పాటలకు సిద్ధమవుతున్న గ్రామాభివృద్ధి కమిటీలు

సరిహద్దు మండలాల్లో అధికార పార్టీ నేతల పెత్తనం

కార్యాలయాలకే పరిమితమవుతున్న మైనింగ్‌, రెవెన్యూ శాఖ అధికారులు

చోద్యం చూస్తున్న జిల్లా అధికార యంత్రాంగం

ఆదిలాబాద్‌, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): జిల్లా సరిహద్దుల్లో ప్రవహిస్తున్న పెన్‌గంగా నదిలో అక్రమార్కులు ఇసుకను తోడేస్తూ అమ్మేసుకుంటున్నారు. ఈయేడు సమృద్ధిగా వర్షాలు కురవడంతో పుష్కలంగా పెన్‌గంగా నదిలో ఇసుక మేటలు అందుబాటులో ఉ న్నాయి. మార్కెట్‌లో ఇసుకకు భారీ డిమాండ్‌ ఉండడంతో కొందరు అక్రమార్కులు నది నుంచి ఇసుకను తరలిస్తూ అక్రమ సంపాదనకు ఎగబడుతున్నారు. పెన్‌గంగా పరివాహక ప్రాంతంలోని పలువాగుల్లో ఇసుక రవాణాకు ప్రత్యేకమైన రోడ్డు మార్గాలను వేసుకుంటు రవాణా చేస్తున్నారు. అడపాదడపగా అధికారులు దాడులు చేస్తున్నా.. రాజకీయ పరపతి, ఆర్థిక పలుకుబడితో అధికారులు అటువైపు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. పోలీసులు వాహన తనిఖీల్లో అప్పుడప్పుడు వాహనాలను సీజ్‌ చేస్తూ జరిమానా విధిస్తున్నా.. ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇంత జరుగుతున్నా.. మైనింగ్‌, రెవెన్యూ శాఖాధికారులు కార్యాలయాలకే పరిమితమవుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. సరిపడ సిబ్బంది లేరన్న సాకుతో మైనింగ్‌ శాఖ చేతులేత్తేయడంతో రెవెన్యూ అధికారులు కూడా అటు వై పు కన్నెత్తి చూడడం లేదు. ఇలా శాఖల మధ్య సమన్వయం కొరవడడంతో యేటా కోట్ల రూపాయల విలువ చేసే ఇసుక నిలువలు కనిపించకుండానే పోతున్నాయి. ఇప్పటికే పలుమార్లు అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం పలుమార్లు ఆదేశించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం జిల్లా యంత్రాంగం తేలికగానే తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఫ సరిహద్దు గ్రామాల్లో అనాధికార దోపిడీ

పెన్‌గంగా నది సరిహద్దుల్లో ఉన్న గ్రామాలు ఇష్టారాజ్యంగా వేలం పాటలు నిర్వహిస్తూ అనాధికార దోపిడీకి తెరలేపుతున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. ప్రధానంగా ఆదిలాబాద్‌తో పాటు జైనథ్‌, బేల, ఇచ్చోడ, ఉట్నూర్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో అనధికారికంగా ఇసుక టెండర్లు నిర్వహిస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నట్లు వినిపిస్తోంది. కొన్ని చోట్ల అయితే రూ.5లక్షల ఉంచి రూ.25లక్షల వరకు టెండర్లను దక్కించుకుంటున్నారంటే, ఈ వ్యాపారం ఏ స్థాయిలో నడుస్తుందో ఇట్టే స్పష్టమవుతుంది. గ్రామాభివృద్ధి పేరిట టెండర్లు నిర్వహిస్తున్నామని చెబుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొడుతున్నారు. టెండర్లు దక్కించుకున్న వ్యాపారులు జిల్లా కేంద్రానికి ఇసుకను తరలిస్తూ ట్రాక్టర్‌ ఇసుకను రూ.3 వేల నుంచి రూ.5వేల వరకు అమ్మేసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని పంజాబ్‌చౌక్‌, రిమ్స్‌ ఆసుపత్రి, తిర్పెల్లి వద్ద ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. అయినా రెవెన్యూ అధికారులకు పట్టింపే లేకుండా పోతోంది. అడపాదడపగా ఇసుక వాహనాలు, డంపుల ను సీజ్‌ చేస్తున్న సంబంధిత అధికారులు,  వాటిని పూర్తిస్థాయిలో కట్టడి చేయలేక పోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అధికారులపై రాజకీయ నేతల ఒత్తిళ్లు పెరిగి పోవడంతోనే పట్టింపు లేకుండానే పోతుందన్న ఆరోపణలూ లేకపోలేదు.

ఫ అంతా వారి కనుసన్నల్లోనే..

పెన్‌గంగా నదీ పరివాహక ప్రాంత మండలాలైన తలమడుగు, తాంసి, బీంపూర్‌, జైనథ్‌, బేల మండలాల్లో ఇసుక దందా అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు తెలుస్తుంది. కొందరు నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తెరవెనుకుండి మరీ ఈ తతంగాన్ని నడుపుతున్నట్లు తెలుస్తుంది. కొందరైతే సర్పంచ్‌, ఎంపీటీసీలుగా గెలుస్తూ ఇసుక దందానే ప్రధాన ఆదాయ మార్గంగా మార్చుకుంటున్నారు. అక్ర మంగా సంపాదించిన డబ్బుతో మళ్లీ ఎన్నికల్లో గెలుపొందుతూ చక్రం తిప్పుతున్నారు. మండలస్థాయి అధికారులపై ఒత్తిళ్లు చేస్తూ ఇసుక అక్రమ రవాణాకు అడ్డురాకుండా జాగ్రత్త పడుతున్నారు. కాదు కూడదంటే బదిలీ వేటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు తహసీల్దార్లు, ఎస్సైలపై ఇసుక మాఫియా బదిలీ వేటు వేయించిన దాఖలాలు ఉన్నాయి. ప్రధానంగా జైనథ్‌ మండలం డొలారా, పెండల్‌వాడ, కౌఠ గ్రామాలతో పాటు బేల మండలం కాంగాన్‌పూర్‌, సాంగిడి, కొగ్దూరు గ్రామాలలో ఇసుక అక్రమ రవాణా భారీగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. గ్రామస్థాయి నేతల నుంచి జిల్లాస్థాయి నేతల వరకు ఈ దందాతో సంబంధం ఉండడతో చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకడుగు వేయాల్సి వస్తుంది. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా.. కట్టడి చేయాల్సిన అధికారులే కళ్లు మూసుకోవడంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. ఇసుక వాహనాలను పట్టుకుని తరలించే లోపే మండల, జిల్లా స్థాయి నేతల నుంచి ఒత్తిళ్లు రావడంతో వదిలేయాల్సి వస్తుందని పలువురు అధికారులు బహిరంగంగానే పేర్కొంటున్నారు. రాజకీయ నేతల పెత్తనంతో ఏమీ చేయలేక పోతున్నామని కొందరు అధికారులు వాపోవడం కొసమెరుపు..!!

రెవెన్యూ అధికారులే కట్టడి చేయాలి

: రవిశంకర్‌, జిల్లా మైనింగ్‌ అధికారి, ఆదిలాబాద్‌

జిల్లాలో అధికారికంగా ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేసేందుకు అవకాశం లేదు. పెన్‌గంగా, ఇతర నదులు, చెరువులు ఇసుక తవ్వకాలను చేపట్టరాదు. మండల స్థాయిలో పని చేస్తున్న రెవెన్యూ అఽదికారులే అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది. ఇప్పటికే తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశాం. ప్రభుత్వం నుంచి రీచ్‌లను ఏర్పాటు చేయాలని ఎలాంటి ఆదేశాలు లేవు. అక్రమ ఇసుక తవ్వకాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాం. 

Updated Date - 2021-12-02T06:55:26+05:30 IST