దండగ మారి సబ్సిడీ

ABN , First Publish Date - 2021-08-22T05:27:30+05:30 IST

రాష్ట్రప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలను రాయితీపై ఆర్‌బీకేల ద్వారా అందిస్తున్నామని ప్రకటించినప్పటికీ, ఆచరణలో మాత్రం సక్రమంగా అమలు కావడం లేదు. రాయితీపై ఆర్‌బీకేల్లో ఇచ్చే ధర కన్నా.. బయట మార్కెట్‌లో తక్కువకు విత్తనాలు దొరుకుతున్నాయి. దీంతో ఆర్బీకేల్లో విత్తనాలు కొనేందుకు రైతులు ఆసక్తిచూపడం లేదు. జిల్లాకు తొలివిడతగా కేవలం 4 వేల క్వింటాళ్ల మినుములను రాయితీపై అందించగా, 20శాతం విత్తనాలను కూడా రైతులు నమోదు చేసుకోలేదు. రాయితీపై అపరాల విత్తనాలను ప్రభుత్వం ఏటా పంపిణీ చేయడం అనవాయితీ. ఆయా విత్తనాలపై 30శాతం రాయితీ ఇస్తుంది.

దండగ మారి సబ్సిడీ
రైతుభరోసా కేంద్రంలో వివరాలు పరిశీలిస్తున్న రైతులు (ఫైల్‌)

ఆర్బీకేల కన్నా బయటే తక్కువ

ప్రహసనంగా రాయితీ విత్తన పంపిణీ

కోట్లు వృథా చేసినా రైతుకు ప్రయోజనం శూన్యం

పైగా నాణ్యత పరిశీలించలేని పరిస్థితి

మార్కెట్‌ ధరకన్నా అధిక ధరకు విత్తనాలు

తీసుకునేందుకు ఆసక్తి చూపని రైతులు

కందుకూరు, ఆగస్టు 21:

సబ్సిడీ విత్తన పంపిణీ కార్యక్రమం శుద్ధ దండగలా మారింది. రైతు పథకాలపై ప్రభుత్వ నిర్లప్త ధోరణి పదర్శిస్తోంది. ఇందుకు తాజాగా పంపిణీ చేస్తున్న మినుము, కంది విత్తనాల నిదర్శనం. విత్తన ధరలు రైతులకు చుక్కలు చూపెడుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ విత్తనాల కన్నా బయట మార్కెట్‌లోనే తక్కువకు వస్తున్నాయి. దీంతో రైతులు విత్తనాల కొనుగోలుకు ముందుకు రావడం లేదు. దానికితోడు విత్తనాలు నాసిరకంగా ఉండటం కూడా ఒక కారణం. పైపెచ్చు ఆర్బీకేల ద్వారా అందుబాటులో సబ్సిడీ విత్తనాలు అంటూ ఆర్భాటం చేసిన ప్రభుత్వం ముందుగా ఎన్ని విత్తనాలు కావాలో నమోదు చేసుకుని ఆ మొత్తాని చెల్లిస్తే తర్వాత తెప్పించి ఇస్తున్నారు. ఇది రైతులకు తలనొప్పిగా మారింది. విత్తనం ఎలా ఉన్నా తప్పక తీసుకోవాల్సి వస్తోంది. పైగా బయట కన్నా ధర అధికం. దీంతో అసలు సబ్సిడీ ఎవరికి ఇస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 రాష్ట్రప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలను రాయితీపై ఆర్‌బీకేల ద్వారా అందిస్తున్నామని ప్రకటించినప్పటికీ, ఆచరణలో మాత్రం సక్రమంగా అమలు కావడం లేదు. రాయితీపై ఆర్‌బీకేల్లో ఇచ్చే ధర కన్నా.. బయట మార్కెట్‌లో తక్కువకు విత్తనాలు దొరుకుతున్నాయి. దీంతో ఆర్బీకేల్లో విత్తనాలు కొనేందుకు రైతులు ఆసక్తిచూపడం లేదు. జిల్లాకు తొలివిడతగా కేవలం 4 వేల క్వింటాళ్ల మినుములను రాయితీపై అందించగా, 20శాతం విత్తనాలను కూడా రైతులు నమోదు చేసుకోలేదు. రాయితీపై అపరాల విత్తనాలను ప్రభుత్వం ఏటా పంపిణీ చేయడం అనవాయితీ. ఆయా విత్తనాలపై 30శాతం రాయితీ ఇస్తుంది. అయితే ఈ ఏడాది రాయితీపై ఇచ్చే విత్తనాల ధర కూడా బయట మార్కెట్‌ ధర కంటే ఎక్కువగా ఉంది. దీంతో రాయితీ సొమ్ము కోట్లలో పక్కదారి పట్టినా రైతుకు మాత్రం ఫలితం చేరలేదు.

మినుము, కంది విత్తనాలు తీసుకునేందుకు విముఖత 

ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు విస్తారంగా మినుము, కంది పంటలను సాగు చేస్తారు. ఆయా పంటలకు కందులు కిలో రూ. 105గా ధర నిర్ణయించి అందులో 30శాతం రాయితీగా రూ.31.50 పోను రూ.73.50 రైతులు చెల్లించి విత్తనాలు పొందాలని నిర్దేశించారు. అలాగే మినుములకు కిలో రూ.115.10 అసలు ధరగా నిర్ణయించి అందులో 30శాతం సబ్సిడీ రూ.34.53 పోను రైతులు రూ.80.57 చెల్లించాలని నిర్ణయించారు. బహిరంగ మార్కెట్లో వాస్తవ ధర రైతు చెల్లించాల్సిన మొత్తం కన్నా తక్కువ ఉంది. మినుములు కిలో రూ.60కి అమ్ముతుండగా విత్తనాల కోసం శుద్ధిచేసిన మినుములను కిలో రూ.70కి రైతుల వద్దే దొరుకుతున్నాయి. కొందరు వ్యాపారులు కూడా ఇదే ధరకు విక్రయిస్తున్నారు. అలాగే కందులు బహిరంగ మార్కెట్లో కిలో రూ.55 పలుకుతుండగా పంటకు విత్తనాల కోసం రూ.65కువిక్రయిస్తున్నారు. అయితే ప్రభుత్వం 30శాతం రాయితీ ఇస్తున్నా.., ఆ విత్తనాలు తీసుకోవాలంటే అంతకన్నా అదనం చెల్లించాల్సి వస్తోంది. దీంతో అసలు సబ్సిడీ ఎవరికి ఇస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ముందు నగదు కడితే..

మరోవైపు రాయితీ విత్తనాలు కావాల్సిన రైతులు ముందుగా ఆర్బీకేలలో నగదు చెల్లించాలి. ఆ తర్వాత విత్తనాలు తెప్పించి రైతులకు ఇస్తారు. ఈ ప్రక్రియపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో విత్తనాలు వచ్చాక రైతులు అవసరమైన రైతులు వ్యవసాయ శాఖ వద్ద పర్మిట్లు రాయించుకొనే వారు. అనంతరం నేరుగా డబ్బు చెల్లించి విత్తనం తీసుకెళ్లేవారు. ఆ విధానం వల్ల విత్తనాల నాణ ్యతలో ఏదైనా లోపం ఉంటే విత్తనం తీసుకోకుండా ఉండే వెసులుబాటు రైతులకు ఉంది. ప్రస్తుతం అలాకాకుండా ముందు డబ్బు చెల్లిస్తే ఆ తర్వాత విత్తనాలు తెప్పించి ఇస్తున్నారు. ఈ విధానంలో ఆ విత్తనం ఎలా ఉన్నా కిమ్మనకుండా తీసుకెళ్లక తప్పని పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. దీంతో రాయితీ విత్తనాల్లో పుచ్చుగింజలు, చచ్చుగింజలు అధికంగా ఉంటూ తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు ఆర్‌బీకేల వద్ద కాకుండా ప్రైవేటు వ్యాపారుల వద్దే విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు.

ధర ఎందుకు పెరిగినట్టో..

రైతులకు రాయితీపై ఫౌండేషన్‌ సీడ్‌ సరఫరా చేస్తే ఉత్పత్తి వ్యయం పెరిగిందని అధిక ధరకు కొనుగోలు చేయవచ్చు. అయితే ఆర్‌బీకేల్లో ఇచ్చే మినుములు, కందులు, శనగలు, పెసలు తదితర పంటలను సాధారణ విత్తనాలనే సరఫరా చేస్తున్నారు. రైతుల వద్దే కొనుగోలు చేసి శుద్ధి చేసి రైతులకు విత్తనాలుగా అందిస్తారు. ఇలా ప్రాస్రెస్‌ చేయడానికి కిలోకు గరిష్ఠంగా రూ.10 కన్నా ఎక్కువ ఖర్చు కాదు. అయితే ప్రభుత్వం సరఫరా చేస్తున్న విత్తనాలు 30శాతం రాయితీ పోయిన తర్వాత కూడా మార్కెట్‌ ధరకన్నా రూ.20 అదనంగా ఉంటోంది. దీంతో రాయితీ పేరుతో రూ.కోట్ల ప్రజాధనం వృథా అయినప్పటికీ, రైతులకు ఫలితం దక్కడం లేదు.


కిలోకు సబ్సిడీపోను రూ.81 చెల్లించాలట

ప్రస్తుతం మినుములు క్వింటా రూ.6వేలు మాత్రమే ధర ఉంది. గత సంవత్సరం మినుము పండించిన రైతుల వద్ద మేలురకం విత్తనాలు కిలో రూ.70కే దొరుకుతున్నాయి. కానీ ఆర్బీకేలలో సబ్సిడీ పోను కూడా రూ.81 చెల్లించాలట. అందుకే నేను సాగు చేయదలచిన 20 ఎకరాలకు పామూరు ప్రాంతంలోని రైతుల వద్ద విత్తనాలు తెచ్చుకున్నాను. 

-కిలారి రామారావు, ఆర్‌ఆర్‌పాలెం

 

ధర ఎక్కువ, నాణ ్యత లేదు 

ఆర్బీకేల ద్వారా సబ్సిడీ విత్తన కార్యక్రమం దండగ అనిపిస్తోంది. బహిరంగ మార్కెట్లో విత్తనాల వాస్తవ ధరకన్నా సబ్సిడీ విత్తనాలకు రైతు వాటాగా చెల్లించాల్సిన మొత్తమే ఎక్కువగా ఉంటోంది. దానికి తోడు ముందుగా బుక్‌ చేసుకుంటే ఆ తర్వాత పది నుంచి 20 రోజుల్లోగా విత్తనాలు తెప్పిస్తామని చెబుతున్నారు. ముందుగా డబ్బు కట్టేస్తే తీరా విత్తనాలు వచ్చాక అవి చచ్చులు, పుచ్చులు అయితే మేము చేయగలిగింది ఏమీ లేదు. అందుకే రైతులు, ప్రైవేటు వ్యాపారుల వద్ద విత్తనం నాణ ్యత చూసి కొనుక్కుంటున్నాము.

- వి.హనుమంతరావు, మినుము రైతు, వలేటివారిపాలెం 


Updated Date - 2021-08-22T05:27:30+05:30 IST