ఈ పురస్కారం... మృదంగానికి పట్టాభిషేకం

ABN , First Publish Date - 2021-01-27T06:36:31+05:30 IST

తండ్రి చేతుల్లోంచీ ధ్వనించే మృదంగనాదం చిన్ననాడే ఆమెను ఆకర్షించింది. పురుషులకే పరిమితమైన మృదంగం ఎనిమిదేళ్ళ వయసులో ఆమె చేతిలో ఒదిగింది. సుస్వరాలు పలికించింది.

ఈ పురస్కారం... మృదంగానికి పట్టాభిషేకం

తండ్రి చేతుల్లోంచీ ధ్వనించే మృదంగనాదం చిన్ననాడే ఆమెను ఆకర్షించింది.

పురుషులకే పరిమితమైన మృదంగం ఎనిమిదేళ్ళ వయసులో ఆమె చేతిలో ఒదిగింది. సుస్వరాలు పలికించింది.

ప్రపంచంలోనే తొలి మృదంగ వాద్య కళాకారిణిగా గుర్తింపు పొందడం ఒక ఘనతైతే... 

అరవయ్యేళ్ళుగా తన సంగీత ప్రస్థానాన్ని 

నిరంతరాయంగా కొనసాగించడం మరో ఘనత.

ఈ ఏడాది ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపికైన 

తెలుగు మహిళ, మృదంగవాద్య మహారాణి 

దండమూడి సుమతి రామ్మోహనరావు తన గురించీ, 

సంగీతం గురించీ నవ్యతో పంచుకున్న సంగతులు...


‘‘ముందుగా ‘పద్మశ్రీ’ అవార్డుతో నన్ను సత్కరించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ గౌరవానికి కారకులైన నా తల్లిదండ్రులకూ, నా గురువు, భర్త దండమూడి రామ్మోహనరావుకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను. వారి ఆశీస్సులే నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఈ పురస్కారం అరవయ్యేళ్ళ నా ఏళ్ల కృషికి, సంగీత తపస్సుకు ప్రతిఫలమని నేను అనుకోవడం లేదు. మృదంగ వాయిద్యానికి జరుగుతున్న పట్టాభిషేకంగా భావిస్తున్నాను. 


అదే నా ప్రపంచమైపోయింది...

నా తండ్రి ప్రముఖ మృదంగ విద్వాంసుడు. ఆయన మృదంగ వాద్య విన్యాసాలు ఇల్లంతా ప్రతిధ్వనించేవి. అలా చిన్ననాటి నుంచీ ఆ వాయిద్యం నన్ను అమితంగా ఆకర్షించింది. నా ఆసక్తిని నాన్న గమనించారు. నాకు ఎనిమిదేళ్ళ వయసున్నప్పుడు మృదంగం నేర్పడం ప్రారంభించారు. మహిళలకు మృదంగం నేర్పడం సరైనదా? కాదా? అనే ఆలోచన అప్పట్లో ఆయన చెయ్యలేదు. అంత ఆలోచించే వయసు నాకూ లేదు. తన దగ్గర ఉన్న సంగీత కళను వారసురాలుగా నాకు అందించాలనే తపనతో ఆయన నాకు మృదంగ శిక్షణ ఇచ్చారు. సాధన చేస్తున్న కొద్దీ మృదంగం నుంచీ వచ్చే అద్భుతమైన ధ్వనులు నా ఆసక్తిని మరింత పెంచాయి. నాన్న దగ్గర కొంతకాలం శిక్షణ పొందిన తరువాత దండమూడి రామ్మోహనరావు గారి దగ్గర శిష్యరికం చేశాను. ఆ వాయిద్యం గొప్పతనం ఏమిటో అపుఁడే నాకు తెలిసింది. అప్పటి నుంచీ అదే నా ప్రపంచమైపోయింది. పదేళ్ళ వయసులోనే తొలి కచ్చేరీ చేశాను. ఎందరో ప్రముఖుల ప్రశంసలు లభించాయి. విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాలలో మృదంగం నేర్చుకున్న నేను తరువాత అదే కళాశాలలో లెక్చరర్‌గానూ, ప్రిన్సిపాల్‌గానూ పని చేశాను. 


నా ఆనందానికి అవధులు లేవు...

నా ఆరుపదుల సంగీత ప్రయాణంలో నా గురువు, భర్త అయిన దండమూడి రామ్మోహనరావుతో కలిసి మృదంగ కచేరి నిర్వహించడం నా జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చిన సందర్భం. అలాగే హైదరాబాద్‌ నగరం నాలుగు వందల ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో... ప్రముఖ సంగీత విద్యాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, భీమ్‌సేన్‌ జోషీతో కలిసి జుగల్‌ బందీ చేసిన సందర్భంలో నా ఆనందానికి అవధులు లేవు. నాకు మృదంగంలో గురువులు దండమూడి రామ్మోహనరావు, శ్రీమహదేవు రాధాకృష్ణంరాజు, సంగీతంలో మంగళంపల్లి బాలమురళీ కృష్ణ అంటే ఎంతో ఇష్టం. వారు నేను అమితంగా అభిమానించే కళాకారులు.


అదో చేదు జ్ఞాపకం

పురుషాధిక్యత ఎక్కువగా ఉండే సంగీత ప్రపంచంలో నేను ఏనాడూ ఎలాంటి అసమానతలకూ గురి కాలేదు. ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా నన్ను మృదంగ కళాకారిణిగా తీర్చిదిద్దిన ఘనత నా గురువు, భర్త రామ్మోహనరావు గారిదే. ఆయన స్ఫూర్తి, సహకారంతోనే మృదంగ కళాకారిణిగా ఎదగగలిగాను. అలాంటి వ్యక్తి మరణం నాకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. నా జీవితంలో ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొన్న సమయంలోనూ కుంగిపోలేదు కానీ ఆయన చనిపోయిన రోజు జీవితం మసకబారినట్టయిపోయింది.


శాస్త్రీయ సంగీతానికి ముప్పేమీ లేదు...

ఇప్పటి తరంలో శాస్త్రీయ సంగీతవాయిద్యాల పట్ల ఆసక్తి తగ్గిపోతోందన్న వాదనను నేను ఒప్పుకోను. నేను మృదంగం నేర్చుకున్న సమయానికి... మృదంగ కళాకారిణిని నేను మాత్రమే. ఇప్పుడు నా స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు మృదంగ కళాకారిణులుగా రూపొందారు. తమ వారసులకు మృదంగాన్ని నేర్పిస్తున్నారు. అంటే అప్పటి కన్నా ఎక్కువ మంది శాస్త్రీయ సంగీతం పట్ల ఆసక్తి చూపుతున్నట్టే కదా! అప్పట్లో అవకాశాలు లేక చాలా మంది  ఆసక్తి ఉన్నా ముందడుగు వేయలేకపోయేవారు. ఇప్పుడు ఈ రంగంలో అవకాశాలు అపారం. అదే సమయంలో నేర్చుకున్న కళను పదిమందికి తెలియజేసేందుకు ఎన్నో వేదికలు ఉన్నాయి. కళలు అభ్యసించే వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆర్థికంగాను గతంలో కన్నా ఇప్పుడు పరిస్థితి మెరుగ్గా ఉంది. ఉద్యోగాలు కూడా లభిస్తున్నాయి. కావల్సిందల్లా తల్లితండ్రులకు కళల పట్ల అవగాహన, అనురక్తి. వారి ప్రోత్సాహం ఉంటే సంగీతం ఎన్ని తరాలైనా సజీవంగా ప్రవహిస్తూనే ఉంటుంది. అందుకే ఆశావహదృక్పథంతో ఉందాం. శాస్త్రీయ సంగీతా నికి వచ్చిన ముప్పు ఏమీ లేదు. అదొక నిరంతర 

గంగాప్రవాహం.’’ 


నేను మృదంగం నేర్చుకున్న సమయానికి... మృదంగ కళాకారిణిని నేను మాత్రమే. ఇప్పుడు నా స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు మృదంగ కళాకారిణులుగా రూపొందారు. తమ వారసులకు మృదంగాన్ని నేర్పిస్తున్నారు. అంటే అప్పటి కన్నా ఎక్కువ మంది శాస్త్రీయ సంగీతం పట్ల ఆసక్తి చూపుతున్నట్టే కదా!


కఠోర సాధనతో కీర్తిశిఖరాలకు...

సుమతి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో 1950 అక్టోబర్‌ 16న జన్మించారు. ఆమె తండ్రి ప్రముఖ మృదంగ విద్యాంసుడు నిడుమోలు రాఘవయ్య, తల్లి వెంకటరత్నమ్మ. బాల్యం నుంచి మృదంగమే లోకంగా సుమతి సాధన చేస్తూ వచ్చారు.  సోలో మృదంగ ఆర్టిస్టుగా జాతీయ, అంతర్జాతీయ కీర్తిని ఖ్యాతిని చేసుకున్నారు. మద్రాసు మ్యూజిక్‌ అకాడమీ నుంచి  మూడుసార్లు ఉత్తమ మృదంగ వాద్య కళాకారిణిగా అవార్డు పొందారు. ‘మృదంగ శిరోమణి’, ‘మృదంగ మహారాణి’ తదితర బిరుదులు అందుకున్నారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు పొందిన ఏకైక మృదంగ కళాకారిణి సుమతి. 2009లో అప్పటి రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు  అందుకున్నారు. అలాగే భార్యాభర్తలిద్దరూ సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్న చరిత్ర కూడా సుమతి- రామ్మోహనరావు దంపతులదే.  ‘ఉమన్‌ ఆఫ్‌ రిథమ్‌’ పేరుతో మహిళా సంగీత కళాకారులతో కలిసి సుమతి అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఏడు పదుల వయసులోనూ ఉత్సాహంగా ఉండే ఆమె ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ‘లయ వేదిక’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు.  


పునుకొల్లు మృత్యుంజయకుమార్‌, విజయవాడ 

ఫొటోలు: డి. లక్ష్మణ్‌

Updated Date - 2021-01-27T06:36:31+05:30 IST