నయా దండుపాళ్యం!

ABN , First Publish Date - 2021-06-25T06:16:13+05:30 IST

ఆనవాళ్లు లేకుండా..

నయా దండుపాళ్యం!

ముక్కు, నోరు మూసి  ఒంటరి వృద్ధుల హత్య, దోపీడీ

ఒంటరిగా ఉన్న వృద్ధులే టార్గెట్‌

జిల్లాలో ఐదు ఘటనల్లో ఆరుగురి హత్య

ఐదుగురి యువ ముఠా అరెస్టు 

40 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం

వేలిముద్రలతో దురాగతాలు వెలుగులోకి..


యువకులు, యువతులు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడతారు. యువతులు ఇళ్లలో పని మనుషులుగా చేరి ఎక్కడేమి ఉన్నాయి? ఎవరెవరుంటున్నారో గమనిస్తారు. రాత్రికిరాత్రి ఇంట్లో ఉన్న అందరినీ చంపేసి సర్వం దోచుకుంటారు. యువకులు పక్కాగా రెక్కీ నిర్వహించి ఇంట్లోకి చొరబడి భార్యాభర్తలిద్దరినీ చంపేస్తారు. మహిళలు అందంగా ఉంటే అత్యాచారం చేసి, ప్రాణం తీసేస్తారు.

- దండుపాళ్యం చిత్రంలో ఓ గ్యాంగ్‌ చేసే అకృత్యాలివి. 


రెండు తలుపులు ఉన్న ఇళ్లను ఎంచుకుంటారు. ఒంటరిగా ఉన్న వృద్ధుల ను టార్గెట్‌ చేసుకుంటారు. కూరగాయలు అమ్ముకుంటూ వెళ్లి ఇళ్ల వద్ద రెక్కీ నిర్వహిస్తారు. అర్ధరాత్రి 1 - 2 గంటల మధ్య తలుపులను బలంగా తోస్తారు. గడియ ఊడిపోగానే లోపలకు ప్రవేశిస్తారు. ఒకడు నిద్రలో ఉన్న వారి గుండెలపై కూర్చుంటాడు. మరొకడు దిండు, తలగడతో ఊపిరాడకుండా ముక్కు, నోరు మూసేస్తాడు. మిగిలినవాళ్లు కాళ్లు, చేతులు కదలకుండా పట్టుకుంటారు. రక్తం రాకుండా నరకం చూపించి ప్రాణం తీసేసి ఇంట్లో దోపిడీ చేస్తారు. 

- తాజాగా వెలుగుచూసి పెనమలూరు గ్యాంగ్‌ ఘాతుకాలివి.


విజయవాడ: జిల్లాలో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ఆనవాళ్లు లేకుండా హత్యలు చేసి, ఒంటిపై  బంగారు ఆభరణాలు దోచుకున్న ముఠాను పెనమలూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి 40 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐదు ఘటనల్లో ఆరుగురిని ఊపిరాడనివ్వకుండా చేసి చంపేశారు. ఆ వివరాలు విజయవాడ పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు, డీసీపీలు హర్షవర్థన్‌రాజు, విక్రాంత్‌పాటిల్‌, ఏసీపీలు శ్రీనివాసరెడ్డి, కొల్లి శ్రీనివాస్‌, పెనమలూరు ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణతో కలిసి పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో మీడియాకు వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 


పెనమలూరు మండలం పోరంకి గ్రామానికి చెందిన వేల్పూరి ప్రభుకుమార్‌ ఆటోడ్రైవర్‌. అదే గ్రామానికి చెందిన సుంకర గోపిరాజు ఆటోపై కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. తాడిగడప కార్మికనగర్‌ కట్టకు చెందిన పొనమాల చక్రవర్తి అలియాస్‌ చక్రి, మోరం నాగ దుర్గారావు అలియాస్‌ చంటి ఆటోడ్రైవర్లుగా పనిచేస్తున్నారు. కామయ్యతోపు గ్రామానికి చెందిన మద్ది ఫణీంద్రకుమార్‌ పెయింటర్‌. ఆటోస్టాండ్‌ల వద్ద ఏర్పడిన పరిచయంతో ఐదుగురు గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. అంతా 20 - 22 ఏళ్ల మధ్య వయస్కులు. వారిలో గోపిరాజు పాలిటెక్నిక్‌ విద్యను మధ్యలో వదిలేశాడు. మిగిలిన వాళ్లంతా ఎనిమిది, తొమ్మిది తరగతుల వరకు చదివి విద్యకు ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు. 


తొలి హత్య ఇలా.. 

ఈ ఐదుగురు కలిసి వేగంగా డబ్బు సంపాదనకు నేరాలు చేయాలని నిర్ణయించుకున్నారు. గత ఏడాది అక్టోబర్‌ నెలలో పోరంకి గ్రామం విష్ణుపురం కాలనీలో ఒంటరిగా ఉంటున్న నళిని (58)ని టార్గెట్‌ చేసుకున్నారు. రెక్కీ నిర్వహించి అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించి తలుపులను మధ్య భాగం వద్ద అంతా కలిసి గట్టిగా తోసి లోపలికి వెళ్లారు. మంచంపై ఒంటరిగా నిద్రపోతున్న నళిని గుండెలపై ప్రభుకుమార్‌  బలంగా కూర్చున్నాడు. గోపిరాజు దిండు, దుప్పటితో ముక్కు, నోరు మూసి ఊపిరాడనివ్వకుండా చేశాడు. ఆమె కదలకుండా మిగిలిన ముగ్గురు కాళ్లు, చేతులు పట్టుకున్నారు. నిమిషాల వ్యవధిలోనే నళిని ప్రాణాలు కోల్పోయింది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను లాక్కుని వెళ్లిపోయారు. నళిని కుటుంబీకులు సహజ మరణం అనుకున్నారు. కొవిడ్‌ కారణంగా గంటలోనే అంత్యక్రియలు పూర్తిచేశారు. ఒంటిపై ఆభరణాలు కనిపించకపోవడంలో అనుమానం వచ్చినప్పటికీ ఎవరికో ఇచ్చిందనుకున్నారు. ఈ ఘటనలో ఎలాంటి పోలీసు కేసు నమోదు కాలేదు. ఆ ఇంటి వద్ద ఏం జరుగుతుందన్న విషయాలను తెలుసుకోవడానికి నిందితులు ఆ మర్నాడు వెళ్లారు. అంతా ప్రశాంతంగా ఉండడంతో ఈ తరహా నేరాలే బాగున్నాయనుకున్నారు. నవంబర్‌ నెలలో పోరంకిలో తూముల సెంటర్‌ వద్ద ఉండే సీతా మహాలక్ష్మి(63), ఈ ఏడాది జనవరిలో తాడిగడప కార్మికనగర్‌ కట్ట వద్ద ఉన్న తాళ్లూరు ధనలక్ష్మి(58), జూన్‌ నెలలో పాత పోస్టాఫీసు సమీపాన ఉన్న పాపమ్మ(85)లను హత్య చేశారు. గత ఏడాది డిసెంబర్‌ నెలలో కంచికచర్ల గ్రామంలో నాగేశ్వరరావు, ప్రమీలరాణి దంపతులను హత్య చేశారు. ఇక్కడ భార్యాభర్తలిద్దరూ చనిపోయి ఉండటంతో కుటుంబీకులకు అనుమానం వచ్చింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ ఏడాది మార్చి నెలలో కార్మికనగర్‌లో మల్లేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న ఆభరణాలు, సెల్‌ఫోన్‌ దొంగిలించారు. దీనిపై పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. 


చోరీలపై యూట్యూబ్‌ శిక్షణ 

నిందితుల్లో గోపీరాజు విద్యావంతుడు. ఏటీఎంల్లో చోరీలు ఎలా చేయాలి? అవి ఎలా పనిచేస్తాయి? అనే విషయాలను యూట్యూబ్‌లోని వీడియోల ద్వారా తెలుసుకునేవాడు. ఆ పరిజ్ఞానంతో కొద్దిరోజుల క్రితం ఓ ఏటీఎంలో ఐదుగురు చోరీకి దిగారు. విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ ఐదుగురు నిందితులను చోరీ కేసులో అరెస్టు చేశారు. ఈ నిందితుల వేలి ముద్రలు కంచికచర్లలో దంపతుల హత్యలో సేకరించిన వేలిముద్రలతో సరిపోలాయి. దీంతో హత్యల మిస్టరీ వెలుగులోకొచ్చింది. తమదైన రీతిలో పోలీసులు ప్రశ్నించగా చేయబోయే దోపీడీలనూ నిందితులు వివరించారు. మరికొద్ది రోజుల్లో కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరు, గుంటూరు జిల్లా తెనాలి, మంగళగిరిలలో చంపడానికి 12 మంది జాబితాను సిద్ధం చేసుకున్నట్లు అంగీకరించారు. ఇప్పటికే అక్కడ రెక్కీలు నిర్వహించి ఒక ప్రణాళికను తయారు చేసుకున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉంటే నెల రోజుల్లో ఈ 12 మందిని హత్య చేసేవారు.


40 తులాల ఆభరణాలు స్వాధీనం

నిందితుల నుంచి 40 తులాల బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. అనంతరం వారిని తూర్పుగోదావరి జిల్లా రాజమహేం ద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. 


Updated Date - 2021-06-25T06:16:13+05:30 IST