దండిగా రాబడి

ABN , First Publish Date - 2021-12-01T05:15:47+05:30 IST

రాష్ట్రంలో కొత్త మద్యం విధానం బుధవారం నుంచి అమల్లోకి వస్తోంది. వికారాబాద్‌ జిల్లాలో 59 మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ, లైసెన్స్‌ మంజూరుకు ప్రభుత్వానికి రూ.83.68కోట్ల ఆదాయం వచ్చింది. ఇక నెలనెలా జరిగే అమ్మకాలపై రూ.50కోట్ల నుంచి రూ.55కోట్లు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

దండిగా రాబడి

  • నేటి నుంచి నయా లిక్కర్‌ పాలసీ 
  • మద్యం లైసెన్స్‌లతో రూ.83.68కోట్ల ఆదాయం 
  • దరఖాస్తులతో రూ.18.48కోట్లు 
  • రెండేళ్ల లైసెన్సు ఫీజుకు రూ.65.2కోట్లు
  • మద్యం అమ్మకాలపై ఆదాయం అదనం
  • కొత్త మద్యం దుకాణాలు నేటి నుంచి ప్రారంభం

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి): జిల్లాలో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చింది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అనుమతించిన 59 దుకాణాల్లో బుధవారం నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభించనున్నారు. వైన్స్‌కు కొత్తగా లైసెన్స్‌ పొందినవారు మద్యం వ్యాపారాన్ని నేటినుంచి మొదలు పెడుతున్నారు. చాలా వరకు పాత దుకాణాల్లోనే కొత్త అనుమతులతో దుకాణాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకున్నారు. మద్యం దుకాణ ప్రారంభానికి ప్రక్రియ పూర్తిచేసుకున్న వ్యాపారులు బుధవారం నుంచి అమ్మకాలు చేపడతారు. జిల్లాలో 59 మద్యం దుకాణాల లైసెన్స్‌కు 924 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.2లక్షల ఫీజు వసూలు చేశారు. కలెక్టర్‌ నిఖిల సమక్షంలో నిర్వహించిన డ్రాలో ఎంపికైన వారికి మద్యం దుకాణాలు ఏర్పాటుకు లైసెన్స్‌ ఇచ్చారు. తాండూరు సర్కిల్‌లో 18, వికారాబాద్‌లో 15, పరిగి 12, కొడంగల్‌ 8, మోమిన్‌పేట్‌ సర్కిల్‌లో 6 చొప్పున మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. కొత్త దుకాణాల లైసెన్స్‌ 2021, డిసెంబరు ఒకటో తేదీ నుంచి 2023 నవంబరు 30వ తేదీ వరకు ఉంటుంది. ఈసారి ఎస్సీ, ఎస్టీ, గౌడ కుల సామాజికవర్గాలకు మద్యం దుకాణాల లైసెన్స్‌లో రిజర్వేషన్‌ కల్పించారు. మొత్తం 59 దుకాణాల్లో ఎస్టీలకు 2, ఎస్సీలకు 9, గౌడ్స్‌కు 6 దుకాణాలు కేటాయించారు.


  • ఫీజుల రూపేణా రూ.83.68కోట్ల ఆదాయం

కొత్త మద్యం విధానం ద్వారా జిల్లా ఎక్సైజ్‌ శాఖకు రూ.83.68 కోట్ల ఆదాయం సమకూరబోతోంది. దరఖాస్తుల రూపంలో రూ.18.48కోట్లు రాగా.. లైసెన్స్‌ కింద ఈ రెండేళ్లలో రూ.65.2 కోట్లు వస్తుంది. 59 మద్యం దుకాణాలకు లైసెన్స్‌ ఫీజు కింద ఏటా రూ.32.6కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. జిల్లాలో అమ్మకాల పరంగా రూ.50లక్షల పరిధిలోకి వచ్చే మొదటి స్లాబ్‌ లో 14 దుకాణాలు, రూ.55లక్షల పరిధిలోకి వచ్చే రెండో స్లాబ్‌లోకి వచ్చే 28దుకాణాలు, రూ.60లక్షల పరిధి మూడో స్లాబ్‌లో 17 దుకాణాలున్నాయి. ఈ దుకాణాల లెసెన్స్‌ కింద ఏటా రూ.32.6కోట్లు ప్రభుత్వానికి రానుంది. రెండేళ్లలో రూ.65.2 కోట్ల ఆదాయం ఎక్సైజ్‌ ఖజానాకు జమైతుంది. గత రెండేళ్లలో మద్యం దుకాణాల లైసెన్స్‌కింద ప్రభుత్వానికి రూ.51.4కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి గతంకంటే రూ.13.8కోట్ల ఆదాయం ఎక్కువ రానుంది. రెండేళ్ల కిందట దరఖాస్తులకు రూ.13.66 కోట్లు రాగా. ఈసారి రూ.18.48కోట్లు వచ్చింది. ఫీజుల రూపంలోనే గత మద్యం పాలసీ ఆదాయంతో పోలిస్తే రానున్న రెండేళ్లలో రాబడి రూ.18.55కోట్లు ఎక్కువ సమకూరనుండడం విశేషం. 


  • నెలకు రూ.55కోట్లకు పెరగనున్న విక్రయాలు?

ఇదిలా ఉంటే, మద్యం దుకాణాల సంఖ్య పెరగడంతో విక్రయాలు కూడా పెరుగుతాయని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో 46 దుకాణాలు ఉన్నప్పుడు నెలకు రూ.40కోట్ల నుంచి రూ.45కోట్ల విలువైన మద్యం అమ్మకాలు కొనసాగేవి. ఈసారి దుకాణాలు 59కి పెంపుతో మద్యం అమ్మకాలు పెరిగి నెలకు రూ.50కోట్ల నుంచి రూ.55 కోట్ల మధ్య వ్యాపారం జరగొచ్చని అంచనా వేస్తున్నారు. కొత్త ఎక్సైజ్‌ పాలసీలో మద్యం వ్యాపారులకు ఇచ్చిన సడలింపులు ప్రోత్సాహకరంగా ఉండడంతో మద్యం అమ్మకాలు ఊపందుకుం టాయని అధికారులు భావిస్తున్నారు. కొత్త దుకాణాల్లోకి బుధవారం మధ్యాహ్నంలోగా మద్యం నిల్వలు చేరుకోనున్నాయి. ఈ మేరకు దుకాణదారులు కొత్త వ్యాపారంలో నిమగ్నమయ్యారు.

Updated Date - 2021-12-01T05:15:47+05:30 IST