డేంజర్‌ బెల్స్‌!

ABN , First Publish Date - 2021-08-20T06:10:21+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ కన్నెర్ర చేస్తోంది. తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది.

డేంజర్‌ బెల్స్‌!

మళ్లీ పెరుగుతున్న కొవిడ్‌  కేసులు 

చాపకింద నీరులా వైరస్‌ వ్యాప్తి

అధికార లెక్కల్లోకి రాని బాధితులు

రిమ్స్‌లోనే రోజుకు 50మంది చేరిక

కొవిడ్‌ కమ్మేస్తోంది. చాపకింద నీరులా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. పల్లెలన్నీ కరోనాతో వణికిపోతున్నాయి. వారంరోజులుగా జిల్లాలోకరోనా కేసుల సంఖ్య వందలోపు మాత్రమే నమోదవుతున్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తుండగా, అనధికారంగా అందుకు ఐదారింతలు అధికంగానే కేసులు వస్తున్నాయి. నాలుగైదు రోజుల నుంచి ఒంగోలు రిమ్స్‌కు వచ్చే బాధితులు పెరుగుతున్నారు. నిత్యం 50మందికి తగ్గకుండా చేరుతున్నారు. ప్రత్యేకించి కొత్తగా కొవిడ్‌ వచ్చినవారే కాకుండా మొదటి వేవ్‌లో వైరస్‌ సోకిన వారు తిరిగి కరోనా బారిన పడుతున్నారు.  సెకండ్‌ వేవ్‌ నుంచి కోలుకుని ఇంటికెళ్లిన వారు సైతం పోస్ట్‌ కొవిడ్‌తో మళ్లీ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే ఒంగోలులోని రెండు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో పడకలన్నీ ఫుల్‌ అయిపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. మరోవైపు రిమ్స్‌లోనూ రోజురోజుకు బాధితుల సంఖ్య పెరగడంతోపాటు, స్పెషల్‌ వార్డులన్నీ ఫుల్‌ కావడం కలవరపాటుకు గురి చేస్తోంది.

ఒంగోలు (కార్పొరేషన్‌), ఆగస్టు 19 : జిల్లాలో కొవిడ్‌ కన్నెర్ర చేస్తోంది. తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. మొదటి వేవ్‌ ముగిసిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో అంతకు రెట్టింపుగా సెకండ్‌ వేవ్‌ అందరినీ కలవరపాటుకు గురిచేసిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ వైరస్‌ ప్రబలుతోంది. ప్రత్యేకించి గత కొద్దికాలంగా బాధితుల సంఖ్య తగ్గిందని అందరూ భావించారు. కొవిడ్‌ నిబంధనలు తొలగించారు. లాక్‌డౌన్‌ ఎత్తివేశారు. థియేటర్లు తెరుచుకున్నాయి. బడులు, గుడులు మొదలయ్యాయి. అయితే వైరస్‌ ప్రభావం మాత్రం కొనసాగుతూనే ఉంది. అధికారికంగా ప్రకటించే కేసుల సంఖ్య తక్కువగా కనిపిస్తున్నా అనధికారికంగా భారీగా వస్తున్నట్లు సమాచారం. ఎక్కువగా బాధితులు హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. 


నిర్లక్ష్యమే కొంపముంచుతుంది

ఇటీవల వాతావరణ పరిస్థితులు, కురుస్తున్న వర్షాల కారణంగా సీజనల్‌ వ్యాధులు పెరుగుతున్నాయి. జలుబు, జ్వరాలు రావడంతో ప్రజలు సాధారణ జ్వరమని భావించడమే వైరస్‌ తీవ్రతకు కారణమని వైద్యులు వెల్లడిస్తున్నారు. కొందరు సాధారణ వైద్యం పొంది పరిస్థితి చేయి దాటాక కొవిడ్‌ ఆసుపత్రులకు వస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. మరోవైపు ఇటీవల కాలంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష కేంద్రాలు తగ్గాయి. వ్యాక్సినేషన్‌ సెంటర్లలోకొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం వెళ్లిన వారికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నప్పటికీ ఫలితాలు వెల్లడించడంలో జాప్యం జరుగుతోంది. కొవిడ్‌ వచ్చిందా? లేదా అనే సమాచారం మొబైల్‌ ఫోన్లకు రాకపోవడంతో వైరస్‌ మరింత విస్తరిస్తోంది. ముఖ్యంగా కొద్దిపాటి లక్షణాలు కలిగిన వారు కొందరు ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటుండగా, అవి అధికారిక లెక్కలోకి రాకపోవడం కూడా కారణంగా కనిపిస్తోంది. 


అదుపుతప్పుతున్న పరిస్థితి

ప్రభుత్వం ప్రతిరోజూ ప్రకటిస్తున్న వివరాల ప్రకారం జిల్లాలో వందలోపు పాజిటివ్‌ కేసులు మాత్రమే  కనిపిస్తున్నాయి. వాస్తవ పరిస్థితుల్లో రోజుకు కనీసం మూడు నుంచి 400మంది ప్రతిరోజూ కొవిడ్‌ బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నిబంధనలు పూర్తిస్థాయిలో పాటించనందున వైరస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తుందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. మొత్తంగా పరిస్థితి మరొసారి అదుపుతప్పుతోంది. వైద్యశాఖ నుంచి పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతోపాటు, ఇటు కార్పొరేషన్‌, పోలీసు యంత్రాంగం నుంచి కొవిడ్‌ నిబంధనలను గాలికి వదిలేయడంతో బాధితుల సంఖ్య పెరుగుతుందన్న అభిప్రాయం  ప్రజల్లో వ్యక్తమవుతోంది. కర్ఫ్యూ ఎత్తివేయడంతో జనాలు యథేచ్ఛగా రోడ్లపై సంచరించడం, కార్యాలయాలు, వ్యాపార  సంస్థల్లోనూ కనీస నిబంధనలు లేకపోవడం పూర్తిగా వైరస్‌ భయం పోయిందన్నట్లు పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం వైరస్‌ కట్టడికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


పెరుగుతున్న ఊపిరి సమస్య 

కొవిడ్‌ బాధితులను ఊపిరి సమస్య వెంటాడుతోంది. గతంలోకొవిడ్‌ వచ్చి కోలుకున్న వారు పోస్ట్‌ కొవిడ్‌ బాధితులుగా తిరిగి ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా శ్వాస సంబంధ సమస్యలు ఎక్కువగా ఉంటున్నట్లు బాధితులు వాపోతున్నారు. రోగనిరోధక శక్తి పెరిగినప్పటికీ ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుందని, వాపోతున్నారు. మరోవైపు కొత్త కేసులు కూడా అధికంగానే నమోదవుతున్నాయి. మొదటి వేవ్‌తో పోల్చుకుంటే సెకండ్‌ వేవ్‌ లక్షణాలు వేరుగా ఉన్నట్లు చెబుతున్నారు. తీవ్ర జ్వరం కనిపించకపోయినా, కాస్తంత ఒళ్ళు నొప్పులు, జలుబు ఉన్నా  పాజిటివ్‌గా గుర్తించాల్సిన అవసరం కూడా ఉందంటున్నారు. అంతేకాకుండా మరోవైపు జిల్లాలో వైరస్‌ అదుపులోకి వచ్చిందనేలా అటు వైద్యశాఖ అధికారులు నిర్ధారణ పరీక్షలు చేసిన వారిలో అధిక శాతం మందికి నెగిటివ్‌గా చూపించడం కేసుల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. కొవిడ్‌ వైరస్‌ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నా, పరీక్ష ఫలితాలు నెగిటివ్‌ రావడం మరింత అనుమానాలకు తావిస్తుంది. 


రిమ్స్‌లో మందులకు ఇబ్బంది లేదు

నెల క్రితం వరకు కొవిడ్‌ బాధితులతో కిటకిటలాడిన రిమ్స్‌ వైద్యశాలలో గత పది, పదిహేను రోజుల క్రితం పడకలన్నీ ఖాళీ అయ్యాయి. బాధితుల సంఖ్య తగ్గడంతో మంత్రి బాలినేని ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొవిడ్‌ కేర్‌సెంటర్‌ను తొలగించారు. వైరస్‌ అదుపులోకి వచ్చిందని అందరూ భావించి ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మరోసారి కేసులు సంఖ్య పెరగడంతో అటు రిమ్స్‌ వైద్యులు అప్రమత్తమయ్యారు. దీంతో అవసరమైన మందులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంతోపాటు, ఆక్సిజన్‌ ఇతర, మందులను ముందస్తు జాగ్రత్తతో సిద్ధం చేసుకున్నారు.  


107 కొవిడ్‌ పాజిటివ్‌లు

మూడు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు

జిల్లాలో గురువారం కొత్తగా 107 కొవిడ్‌ పాజిటివ్‌లు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య  1,32,284 మందికి చేరింది. వీరిలో 1,30,047 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1208 యాక్టివ్‌ కేసులు ఉండగా, ఇప్పటి వరకూ 1029 మంది మరణించారు.   గురువారం మరో మూడు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో బాధితుల సంఖ్య 262కు చేరుకోగా, ఇప్పటి వరకూ ఫంగస్‌తో 16 మంది మరణించారు. 170 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 27 మంది బాధితులు రిమ్స్‌లోనూ, మిగిలిన వారు వివిధ ప్రైవేటు వైద్యశాలల్లోనూ చికిత్స పొందుతున్నారు. 


Updated Date - 2021-08-20T06:10:21+05:30 IST