పాఠశాలల్లో డేంజర్‌ బెల్స్‌!

ABN , First Publish Date - 2021-04-13T08:50:20+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం పాఠశాలల్లో కలవరం రేపుతోంది. విద్యార్థుల్లో పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కరోనా బారినపడి ఉపాధ్యాయులు మృత్యువాత పడుతున్నారు.

పాఠశాలల్లో డేంజర్‌ బెల్స్‌!

పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

విద్యార్థులను ఇళ్లకు పంపేస్తున్న వైనం

తాత్కాలిక చర్యలకే స్కూళ్ల మొగ్గు

అమలు కాని కొవిడ్‌ నిబంధనలు 

రాష్ట్రమంతటా స్కూళ్లలో ఇదే పరిస్థితి


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం పాఠశాలల్లో కలవరం రేపుతోంది. విద్యార్థుల్లో పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కరోనా బారినపడి ఉపాధ్యాయులు మృత్యువాత పడుతున్నారు. వైరస్‌ వ్యాప్తి అత్యంత వేగంగా ఉన్నప్పటికీ కొవిడ్‌ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. పాఠశాలల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న దాఖలాలు ఏ మాత్రం కనిపించడం లేదు. పిల్లలు మాస్కులు ధరించకున్నా, భౌతిక దూరం పాటించకున్నా, ఒకే గదిలో 16 మందికిమించి కూర్చున్నా పట్టించుకునే నాథుడే లేని పరిస్థితి నెలకొంది. పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. కరోనా లక్షణాలు కనపించిన విద్యార్థులను ఇళ్లకు పంపించడమో, స్కూలుకు కొద్ది రోజులపాటు సెలవులు ఇచ్చి చేతులు దులుపుకోవడమో చేస్తున్నారు తప్ప శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టడం లేదు.


ప్రభుత్వం నుంచి నిధులు అందకపోవడంతో తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్నట్టు ప్రధానోపాధ్యాయులు చెబుతుండడం గమనార్హం. పాఠశాల విద్యాశాఖ నిబంధనల ప్రకారం పాజిటివ్‌ కేసులు నమోదైన స్కూళ్లకు ఐదు రోజులు సెలవులు ఇస్తున్నారు. కరోనా లక్షణాలైన జ్వరం, ఒళ్లు నెప్పులతో  పాఠశాలలకు రాలేకపోతున్న విద్యార్థులకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడం లేదు. ఫలితంగా ఇష్టం లేకపోయినా కూడా తమ పిల్లలను బడులకు పంపిస్తున్నారు. ఆన్‌లైన్‌ బోధనను అందుబాటులోకి తెచ్చినప్పటికీ పిల్లలు తప్పనిసరిగా స్కూళ్లకు హాజరుకావాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించడంపై తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వస్తోంది. 


ఆచరణలేని మంత్రి మాటలు

విద్యార్థుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని, కొవిడ్‌ టెస్ట్‌ల సంఖ్యను పెంచుతామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ చెప్పినా.. ఇప్పటి వరకు ఆచరణలో అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. పాఠశాలలకు, కళాశాలలకు వచ్చే విద్యార్థులకు వారి ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని భౌతిక దూరం పాటించడం, శానిటైజర్‌ ఉపయోగించడం వంటివి  పాటించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఆదేశఃశాశాలివవాస్తున్నా అమలు కావడం లేదు. 


‘ప్రైవేటు’ మరీ దారుణం!

ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో కొవిడ్‌ నిబంధనల పాటింపుపై పూర్తి నిర్లక్ష్యం కొనసాగుతోంది. కరోనా బారిన పడుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు గోప్యంగా ఉంచుతూ విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయన్న ఆరోపణలున్నాయి.


జిల్లాల్లో పరిస్థితి ఇదీ..

కృష్ణా జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో 20 మంది విద్యార్థులకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో హాస్టల్‌, క్యాంప్‌సను 10 రోజుల పాటు మూసేశారు. 

కరోనా తీవ్రత నేపథ్యంలో నూజివీడు ట్రిపుల్‌ ఐటీకి సెలవులు ప్రకటించారు. 

గుంటూరు జిల్లాలో 10 మంది విద్యార్థులకు పాజిటివ్‌ రావడంతో స్కూలుకు సెలవులు ఇచ్చారు. 

మాస్కులు తప్పనిసరిగా ధరించాలనే నిబంధన ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. 

మధ్యాహ్న భోజనం చేసే సమయంలో విద్యార్థులంతా గుంపులుగా ఒక చోటకు చేరి చుట్టూకూర్చొని తింటున్నారు.   


దేశమంతా ఒకదారి.. మనదోదారి!

విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలు రద్దుచేసి పైతరగతులకు ప్రమోట్‌ చేస్తున్నట్లు ప్రభుత్వాలు ప్రకటించాయి. కానీ, మన రాష్ట్రంలో మాత్రం కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2021-04-13T08:50:20+05:30 IST