డేంజర్‌ బెల్స్‌

ABN , First Publish Date - 2022-01-21T06:03:45+05:30 IST

జిల్లాలో కరోనా డేంజర్‌ బెల్‌ మోగిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య వేలల్లోకి చేరింది. గతంతో పోల్చితే కాస్త భిన్నంగా, అత్యంత వేగంగా వైరస్‌ వ్యాప్తి చెందుతుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.

డేంజర్‌ బెల్స్‌

జిల్లాలో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు 

గురువారం అత్యధికంగా 2,117 నమోదు

పాజిటివిటీ రేటు 45.83ు 

11 వేలకు చేరిన యాక్టివ్‌ కేసుల సంఖ్య 

మరో ముగ్గురి ప్రాణాలను బలిగొన్న మహమ్మారి

ఒమైక్రాన్‌గా నిపుణుల అనుమానం?

నమూనాల ఫలితాలను వెల్లడించని వైద్య శాఖ 

వ్యాక్సిన్‌ తీసుకున్న వారికీ సోకుతున్న వైరస్‌ 


విశాఖపట్నం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): 

జిల్లాలో కరోనా డేంజర్‌ బెల్‌ మోగిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య వేలల్లోకి చేరింది. గతంతో పోల్చితే కాస్త భిన్నంగా, అత్యంత వేగంగా వైరస్‌ వ్యాప్తి చెందుతుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. మొదటి, సెకండ్‌ వేవ్‌లో డెల్టా, డెల్టా ప్లస్‌ వేరియంట్‌లు వ్యాప్తి చెందినప్పటికీ ఈ స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదుకాలేదు. మూడో వేవ్‌లో కొవిడ్‌ ఇంతటి విస్తృతికి కొత్తగా వచ్చిన వేరియంట్‌ (ఒమైక్రాన్‌) కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒమైక్రాన్‌ మాత్రమే అత్యంతవేగంగా వ్యాప్తి చెందే గుణాన్ని కలిగి వుందని జిల్లాలోని ఓ సీనియర్‌ వైద్యాధికారి పేర్కొనడం దీనికి బలాన్నిస్తోంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నప్పటికీ అది ఏ వేరియంట్‌ అనే విషయాన్ని ఇప్పటివరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు ధ్రువీకరించడం లేదు. వైరస్‌ వేరియంట్లను నిర్ధారించే జీన్‌ సీక్వెన్సింగ్‌ కోసం హైదరాబాద్‌లోని సీసీఎంబీ ల్యాబ్‌కు కొన్ని నమూనాలు పంపించినప్పటికీ, అక్కడి నుంచి వచ్చిన ఫలితాలను ఇప్పటికీ వెల్లడించలేదు. దీంతో జిల్లాలో వ్యాప్తి చెందుతున్న వైరస్‌ ఒమైక్రాన్‌ వేరియంట్‌గానే నిపుణులు పేర్కొంటున్నారు.


వ్యాక్సిన్‌ వేసుకున్నా...వైరస్‌

జిల్లాలో వైరస్‌ బారినపడుతున్న వారిలో 40 నుంచి 50 శాతం మంది రెండు డోస్‌లు వ్యాక్సిన్‌ తీసుకున్న వారే కావడం   గమనార్హం. కాగా వీరిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించడం, వేగంగా కోలుకోవడం కాస్త ఊరటనిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.  


స్వీయ రక్షణ విస్మరించడమే కారణం 

జిల్లాలో కొవిడ్‌ విజృంభణకు ప్రజల వ్యవహార శైలే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. గతంలో వైరస్‌ తీవ్రత ఎక్కువైన సందర్భంలో ప్రజలు కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించేవారని, ప్రభుత్వం కూడా కఠిన ఆంఽక్షలు అమలు చేయడంతో వ్యాప్తిని నియంత్రించగలిగే అవకాశం లభించిందన్నారు. థర్డ్‌ వేవ్‌ ప్రారంభమై 20 రోజులు దాటుతున్నా ప్రభుత్వం ఎటువంటి గట్టి చర్యలకు ఉపక్రమించకపోవడం, అదే సమయంలో ప్రజలు కొవిడ్‌ నిబంధనలు విస్మరించడం వైరస్‌ విజృంభణకు కారణమంటున్నారు. ఒకపక్క రోజు వారీ పాజిటివ్‌ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తున్నా ప్రజలు భౌతికదూరం పాటించడం, మాస్క్‌ ధరించడం, శానిటైజర్‌ వినియోగం వంటి వాటిని పట్టించుకోవడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే కేసులు మరింత ఎక్కువ నమోదయ్యే ప్రమాదముందంటున్నారు. 


థర్డ్‌ వేవ్‌లోనే అత్యధికం

గత నెలాఖరున జిల్లాలో కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ ప్రారంభమయింది. అప్పటి నుంచి కేసులు నమోదవుతున్నప్పటికీ, ఈ సీజన్‌లోనే అత్యధికంగా గురువారం 4,619 మందికి పరీక్షలు నిర్వహించగా 2,117 మంది (45.83 పాజిటివిటీ రేటు)కి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,71,650కు చేరింది. చికిత్స పొంది గురువారం 163 మంది డిశ్చార్జ్‌ కావడంతో రికవరీల సంఖ్య 1,59,442కు చేరింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రులు, హోమ్‌ ఐసోలేషన్‌లో 11,085 మంది ఉన్నారు. గురువారం వైరస్‌ సోకిన వారిలో 35 మంది కేజీహెచ్‌లో చేరారు. ప్రస్తుతం సీఎస్‌ఆర్‌ బ్లాక్‌లో 210 మందికి కొవిడ్‌ చికిత్స అందిస్తున్నారు.


మరో మూడు మరణాలు

జిల్లాలో కేసుల సంఖ్యకు అనుగుణంగానే మరణాలూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్‌కు చికిత్స తీసుకుంటూ గురువారం ముగ్గురు మృతిచెందడంతో మొత్తం మరణాలు 1,120కు చేరాయి. థర్డ్‌వేవ్‌లో ఇలా ఒకేరోజు ముగ్గురు మృత్యువాత పడడం ఆందోళన కలిగించే అంశమేనని వైద్యులు పేర్కొంటున్నారు. వైరస్‌ విజృంభిస్తున్న నేపఽథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా వుండాలని సూచిస్తున్నారు. 

Updated Date - 2022-01-21T06:03:45+05:30 IST