డేంజర్‌ స్పాట్స్‌

ABN , First Publish Date - 2022-01-20T04:25:05+05:30 IST

నాగార్జునసాగర్‌ ప్రధాన రహదారిపై

డేంజర్‌ స్పాట్స్‌
అండర్‌ పాస్‌ నిర్మించాల్సిన ఉప్పరిగూడ క్రాసింగ్‌

  • ప్రమాదకరంగా ఉప్పరిగూడ క్రాస్‌ రోడ్డు
  • తరచూ ప్రమాదాలు
  • అండర్‌పాస్‌ నిర్మాణం కోసం ప్రతిపాదనలు


ఇబ్రహీంపట్నం: నాగార్జునసాగర్‌ ప్రధాన రహదారిపై డేంజర్‌ స్పాట్‌లు గుర్తించినప్పటికీ అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదు. ఇబ్రహీంపట్నం పెద్దచెరువు- కొనకట్ట -ఉప్పరిగూడ క్రాస్‌ రోడ్డు, ఇబ్రహీంపట్నం చౌరస్తా, ఎలిమినేడు క్రాస్‌ రోడ్డు, గున్‌గల్‌, ఆగాపల్లి క్రాస్‌రోడ్లు అత్యంత ప్రమాకరంగా ఉన్నాయి. ఈ క్రాస్‌రోడ్ల వద్ద ఎలాంటి భద్రత చర్యలు చేపట్టకపోవడంతో హైదరాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారిని వాహనాలు దాటే సమయంలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కాగా ఉప్పరిగూడ క్రాసింగ్‌ వద్ద అండర్‌పాస్‌ నిర్మాణం కోసం ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు పంపి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకున్న వారేలేరు. ఈ క్రాసింగ్‌ వద్ద వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది. కొన్నేళ్లుగా ఇక్కడ అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. గతంలో ఈ ప్రాంతంలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు.


ఏ దారి ఎటుపోతుందో తెలియదు?

ఇదే ప్రధాన రహదారిపై ఇబ్రహీంపట్నం చౌరస్తా వద్ద ఏ దారి ఎటుపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. చౌరస్తా నుంచి ఓ దారి నాగార్జునసాగర్‌- హైదరాబాద్‌ వైపు, మరొకటి ఇబ్రహీంపట్నం టౌన్‌లోకి వెళ్తుంది. ఇక్కడే మంచాల రోడ్డువైపు వాహనాలు క్రాస్‌ అవుతాయి. అయితే ఇక్కడ ఎలాంటి సూచిక బోర్డులు లేకపోవడంతో ఏ దారి ఎటు పోతుందో తెలియక వాహనదారులు తికమక పడుతున్నారు. అదేవిధంగా ఎలిమినేడు క్రాస్‌ రోడ్డు వద్ద ప్రధానరహదారిని క్రాస్‌ చేయాలంటే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ రోడ్డు డౌన్‌గా ఉండడంతో వాహనాలు వేగంగా రావడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.


వెంటనే అండర్‌పాస్‌ నిర్మించాలి

ఉప్పరిగూడ క్రాస్‌ రోడ్డు వద్ద వెంటనే అండర్‌పాస్‌ నిర్మాణం చేయాలి. ఈ క్రాసింగ్‌ అత్యంత ప్రమాదకరంగా ఉండడంతో వాహనాలను రోడ్డు దాటించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తుంది. అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. 

-  ఆర్‌.శంకర్‌నాయక్‌, ఇబ్రహీంపట్నం 


డేంజర్‌ స్పాట్ల వద్ద పనులు చేపడుతాం

నాగార్జునసాగర్‌ ప్రధాన రహదారిపై బొంగులూరు ఔటర్‌ రింగురోడ్డు మొదలు మాల్‌ వరకు డేంజర్‌ స్పాట్‌లను గుర్తించాం. డిజిటల్‌ సర్వే కూడా చేశాం. ఎక్కడ ఏ నిర్మాణం చేయాలనేది స్కెచ్‌ వేశాం. పలుచోట్ల జీబ్రా లైన్లు ఏర్పాటు చేశాం. సైన్‌ బోర్డుల ఏర్పాటు చేయనున్నాం. ఇబ్రహీంపట్నం చౌరస్తా వద్ద నిర్మాణంపై త్వరలోనే చర్యలు తీసుకుంటాం.

- వేణుగోపాల్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ డీఈ 


సారూ.. బీటీగా మార్చరూ..!

యాచారం : మండలపరిధిలోని నల్లవెల్లి నుంచి మంతన్‌గౌరెల్లి వరకు నాలుగు కిలోమీటర్ల మేర ఉన్న రోడ్డు అస్తవ్యస్తంగా తయారైంది. ఈ రోడ్డు పాడై ఏళ్లు గడుస్తున్నా మరమ్మతుకు నోచుకోవడం లేదు.ఈరోడ్డును 1993లో పనికి ఆహారం పథకం కింద మట్టిరోడ్డు వేశారు. 1995లో మూడున్నర లక్షల రూపాయల నిధులు వెచ్చించి కంకర రోడ్డుగా మార్చారు. అయితే భారీ వర్షాలు కురిస్తే ఈ దారి వెంట నడవలేక తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నామని రైతులు చెబుతున్నారు. ఈ దారిని బీటీ రోడ్డుగా మార్చాలని ఆర్‌అండ్‌బీ అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. నల్లవెల్లి నుంచి మంతన్‌గౌరెల్లి గ్రామానికి వెళ్లాలంటే ఈ దారి నుంచి వెళ్తారు. ఈ దారి వేయకముందు 3కిలోమీటర్లు మాల్‌ వరకు నడిచి వెళ్లి.. అక్కడి నుంచి మంతన్‌గౌరెల్లికి చేరుకునేవారు. ఈ రోడ్డు వేయడం వల్ల నల్లవెల్లి, మంతన్‌గౌరెల్లి గ్రామాల వారికి దూర భారం తగ్గింది. అలాంటి ఈ రోడ్డును బీటీగా మర్చకుండా వదిలేశారు. ప్రస్తుతం ఈ దారి కంకర తేలి ప్రమాదకరంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నల్లవెల్లి, మంతన్‌గౌరెల్లి రోడ్డును బీటీగా మార్చాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


ప్రమాదకరంగా మలుపులు

ఆమనగల్లు : ఆమనగల్లు- మాడ్గుల రోడ్డులో జంగారెడ్డిపల్లి వద్ద మూలమలుపు ప్రమాదభరితంగా మారింది. చెరువు వద్ద ఏ మాత్రం ఆదమరిచినా ప్రమాదమే. ఇటీవల ఈ రోడ్డును డబుల్‌రోడ్డుగా విస్తరించినా మూల మలుపు వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. ఈరోడ్డుపై రెండు మూడు చోట్ల మలుపులు ఉండడం వల్ల కొన్నిసార్లు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. దీంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రాంతంలోనే మూడేళ్ల క్రితం ఓ ఏఎ్‌సఐ చనిపోయాడు. ఒక వైపు చెరువు, మరో వైపు గుట్ట ఉండడం వల్ల రోడ్డు ప్రమాదకరంగా ఉంది. రాళ్ళను తొలగించి రోడ్డును నేరుగా చేసి సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.



Updated Date - 2022-01-20T04:25:05+05:30 IST