Abn logo
Sep 22 2021 @ 00:43AM

మరణశయ్యపై మామిడిపాలెం

మామిడిపాలెం గ్రామ సమీపంలోని క్రషర్ల నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళి

కబళిస్తున్న కిడ్నీ సంబంధ వ్యాధులు

ఏటా దాదాపు ఐదుగురు చొప్పున మామిడిపాలెంలో 24 మంది మృతి

గ్రామాన్ని ఆనుకొని క్వారీలు, క్రషర్లు

దుమ్ముతో నిండిన బావులు, తోటలు

కనీస నియంత్రణ చర్యల్లేని దైన్యం

తొలగించాలని గ్రామస్థుల డిమాండ్‌


(తుమ్మపాల/విశాఖపట్నం జిల్లా): అనకాపల్లి మండలంలోని మామిడిపాలెం పచ్చని గ్రామం. పేరుకు తగినట్టే తోటలతో నిండిన ఊరు. అయితే, గ్రామానికి సమీపంలో అక్రమంగా నెలకొల్పిన క్రషన్‌ కిందపడి ఈ పచ్చదనమంతా మాడిపోతోంది. అది వెదజల్లే కాలుష్యం కోరల్లో మామిడిపాలెం చిక్కుకుపోయింది. ఈ ఊరి జనం వరుసగా కిడ్నీ సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు. ఏటా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేసినా.. ఫలితం లేకుండా పోతోందని మామిడిపాలెంవాసులు వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే...


అనకాపల్లి-చోడవరం రోడ్డులో ఉంది మామిడిపాలెం. ఈ గ్రామ జనాభా సుమారు నాలుగు వేలు. అత్యధిక కుటుంబాలకు కూలి పనులే జీవనాధారం. గ్రామానికి చేరువలో రాయి క్వారీలు, క్రషర్లు ఉన్నాయి. వీటి నుంచి నిత్యం దుమ్ము, ధూళి ఎగిసిపడుతోంది. ఇళ్లు, ఖాళీ స్థలాలు, పంట పొలాలు, తోటలు...ఎక్కడ చూసినా తెల్లటి దుమ్ము పేరుకుపోయి కనిపిస్తోంది. నీటి వనరులు కలుషితమవుతున్నాయి. గ్రామంలో ఉన్న మూడు చెరువులూ క్రషర్‌ బుగ్గితో నిండిపోయాయి. సాగు భూములు నిస్సారంగా తయారై పంటలు పండడం లేదు. దీంతో గ్రామస్థులు పలు రకాల వ్యాధుల బారినపడుతున్నారు. 


రక్షణ కరువు

నిబంధనల ప్రకారం దుమ్ము బయటకు రాకుండా క్రషర్ల చుట్టూ 30 అడుగుల ఎత్తున తడిక లేదా పరదా కట్టాలి. దుమ్ము ఎగిసిపడకుండా నిరంతరాయంగా నీళ్లు చల్లే ఏర్పాట్లు చేయాలి. కానీ మామిడిపాలెంలో పెట్టిన క్రషర్లలో ఎటువంటి రక్షణ ఏర్పాట్లూ చేయలేదు. గ్రామంలో ప్రస్తుతం ఏడు క్రషర్లు, ఐదు క్వారీలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని ఎనిమిదేళ్ల క్రితం ఊరికి దూరంగానే ఏర్పాటుచేశారు. నాలుగైదు ఏళ్ల క్రితం ఏర్పాటయినవి మాత్రం గ్రామానికి కేవలం 500 మీటర్ల దూరంలోనే ఉండటం సమస్యకు మూల కారణం. అవి తెచ్చిపెట్టే కాలుష్య సమస్యపై గ్రామస్థులు ఎన్నోసార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. కనీస నిబంధనలు పాటించడం లేదని, క్రషర్ల నుంచి రేయింబవళ్లు దుమ్ము, ధూళి ఎగిసిపడుతున్నాయని ఎంత మొత్తుకున్నా ఆలకించిన నాథుడే లేడు. 

ఏటా ఐదుగురు చొప్పున మృతి..

1. పనగంటి రాముడు (59), 2. కోరుకొండ అర్జున (53), 3. సీహెచ్‌ విష్ణుమూర్తి (52), 4.బొడ్డేడ అప్పారావు (50), 5. పీలా సత్తిబాబు (50), 6.గెంజి చినతల్లి (45), 7. వెంగల పోతురాజు (62), 8.తురసాల నూకాలమ్మ (60), 9. కరణం కొండయ్య (69), 10. కోరుకొండ రాము (48), 11. గొర్ని దేముడు (45), 12. బొడ్డపల్లి అచ్చింనాయుడు (54), 13. కుంచా రామునాయుడు (45), 14. వేపాడ కొట్లు (45), 15. బంధం గంగమ్మ (55), 16. దేవర సింహాచలం (47), 17. పూడి సత్యవతి (60), 18. బోగాది లక్ష్మణమ్మ (60), 19. పీలా వెంకటలక్ష్మి (55), 20. కోరుకొండ అప్పారావు (62), 21. చిన్ని రమణ (50), 22. పూడి కొట్లు (50), 23. గొల్లవిల్లి పైడమ్మ (32), 24. ఐతి అప్పారావు (58)


వైద్యం చేయించుకునే స్థోమత లేదు

క్వారీలు, క్రషర్ల నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళి కారణంగా కిడ్నీ వ్యాధి బారిన పడ్డాను. ముగ్గురు కుమార్తెలకు వివాహాలు చేయాల్సి వచ్చేసరికి వైద్యం చేయించుకొనే స్థోమత లేదు. ఇటీవలే పింఛన్‌కు దరఖాస్తు చేశాను. ఇంకా మంజూరురాలేదు. 

- కొటాడ సాంబమూర్తి, కిడ్నీ వ్యాధి బాధితుడు


లక్షలు పోస్తున్నా తగ్గడం లేదు.. 

నాకు కిడ్నీ వ్యాధి ఉన్నట్టు బయటపడినప్పటి నుంచి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాం. వైద్యం కోసమే రూ.లక్షలు ఖర్చు చేశాం. అయినా వ్యాధి నయమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీనివల్ల చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలతో కుటుంబం పూర్తిగా చితికిపోయింది. ప్రభుత్వం దృష్టి సారించి కాలుష్యం నుంచి మమ్మల్ని బయటపడేయాలి. 

- యు.ఈశ్వరమ్మ, కిడ్నీ వ్యాధి బాధితురాలు


మంచంలో పాతికమంది.. పింఛన్‌ ఇద్దరికే..

మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, శ్వాసకోశ, గుండె సంబంధ సమస్యలతో మామిడిపాలెం గ్రామస్థులు సతమతమవుతున్నారు. వేర్వేరు అనారోగ్యాలతో వందలాదిమంది మంచం పడుతుంటే.. కిడ్నీ సంబంధ వ్యాధులతో ఏటా నలుగురైదుగురు చనిపోతున్నారు. ప్రస్తుతం కిడ్నీ సంబంధ సమస్యలతో 23 మంది బాధపడుతున్నారు. అయితే, కిడ్నీ సంబంధ వ్యాధి బారినపడి డయాలసిస్‌ అవసరమైన వారికి ప్రభుత్వం అందించే రూ.10 వేలు పెన్షన్‌ మాత్రం మామిడిపాలెంలో ఇద్దరికే అందుతుండటం గమనార్హం. ఈ కేటగిరీ కింద మరో 15 మంది వివరాలను అప్‌లోడ్‌ చేశామని, మరికొందరి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని గ్రామ సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ప్రవీణ్‌ తెలిపారు.