బ్రేకుల్లేని కుర్రకారు

ABN , First Publish Date - 2021-09-29T06:23:47+05:30 IST

రహదారులపై కుర్రకారు ఆగడాలకు అవధులు ఉండడం లేదు.

బ్రేకుల్లేని కుర్రకారు

స్పోర్ట్స్‌ బైక్‌లపై ప్రమాదకర విన్యాసాలు

వీడియోలు చిత్రీకరించి వాట్సాప్‌ స్టేటస్‌లు

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలు

ఆ వీడియోలు పాతవి అంటున్న పోలీసులు


రహదారులపై కుర్రకారు ఆగడాలకు అవధులు ఉండడం లేదు. ప్రాణాల మీదకు తెచ్చే విన్యాసాలను చేస్తున్నారు. విశాలమైన రహదారులు కనిపిస్తే యువతలో కొత్తకొత్త కోరికలు పుడుతున్నాయి. తల్లిదండ్రుల ఆర్థిక స్థోమత ఎలా ఉన్నా, ఖరీదైన స్పోర్ట్స్‌ బైక్‌లను కొనుగోలు చేయిస్తున్నారు. స్నేహితులతో కలిసి ట్రాఫిక్‌ లేనప్పుడు రహదారులపై విన్యాసాలు చేస్తున్నారు. 


(ఆంధ్రజ్యోతి - విజయవాడ) : ఒక యువకుడు బైక్‌ను వేగంగా నడుపుతూ, పైకి ఎక్కి నిలబడితే, మరో యువకుడు ఆ దృశ్యాన్ని చిత్రీకరిస్తాడు. ఈ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. తాజాగా సోషల్‌ మీడియాలో ఇద్దరు యువకులు కనకదుర్గ ఫ్లైఓవర్‌పై చేసిన విన్యాసాలు వైరల్‌ అయ్యాయి. వాటిని పరిశీలిస్తే నగరంలో కుర్రకారు ఎలాంటి భయంకరమైన విన్యాసాలు చేస్తున్నారో అర్థమవుతోంది. నగరంలో రాత్రి 11 గంటల తర్వాత కుర్రకారు పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ఖరీదైన బైక్‌లపై పరిమితికి మించిన వేగంతో ప్రయాణిస్తున్నారు. 


వైరల్‌ అయిన వీడియోలు

కనకదుర్గ ఫ్లైఓవర్‌పై సినిమా స్టంట్లు జరుగుతున్నాయా అనే సందేహం తలెత్తుతోంది. దీనికి కారణం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలు. ఇద్దరు యువకులు స్పోర్ట్స్‌ బైక్‌ను వేగంగా నడుపుతూ దానిపై నిలబడి వెళ్తున్నట్టు వీడియోలు సర్క్యులేట్‌ అవుతున్నాయి. ఈ వీడియోల్లో ఒక యువకుడు బైక్‌పై నిలబడి తుపాకీని ఆకాశంలోకి చూపుతున్నట్టు ఉంది. అయితే ఈ వీడియోలు ఇప్పటివి కావని పోలీసులు చెబుతున్నారు. ఫకీర్‌గూడేనికి చెందిన సయ్యద్‌ ఖాజా, మరో నలుగురు యువకులు ఏప్రిల్‌ నెలలో కనకదుర్గ ఫ్లైఓవర్‌పై బైక్‌ విన్యాసాలు చేశారని, అప్పుడే సీసీ కెమెరాల్లో గుర్తించిన ట్రాఫిక్‌ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారని, వారిపై కేసులు నమోదు చేసి, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారని పోలీసులు వివరించారు. 


ఇప్పుడెందుకు బయటకొచ్చాయి?

సయ్యద్‌ ఖాజా స్నేహితులతో కలిసి ఏప్రిల్‌ నెలలో కనకదుర్గ ఫ్లైఓవర్‌ పై విన్యాసాలు చేశాడు. కొద్దిరోజుల క్రితం నగరంలో ఈవిధంగానే విన్యాసాలు చేస్తూ, బైక్‌ పైనుంచి పడి, తీవ్రంగా గాయపడ్డాడు. ఇటీవలే ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నాడు. ఏప్రిల్‌ నెలలో తాను చేసిన బైక్‌ విన్యాసాల వీడియోతోపాటు ప్రస్తుతం తాను ఉన్న పరిస్థితిని ఫొటోలు తీసి వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టాడు. ఫొటోలు కాకుండా బైక్‌పై చేసిన విన్యాసాల వీడియోలు మాత్రమే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయని పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. నిందితులకు రూ.6,470 జరిమానా విధించామన్నారు. 

Updated Date - 2021-09-29T06:23:47+05:30 IST