Abn logo
Sep 15 2021 @ 01:34AM

వణికిస్తున్న డెంగ్యూ

సీతానగరంలో డెంగ్యూతో మృతి చెందిన దుర్గామోహన్‌

తునిలో బాలిక మృతి

తుని, సెప్టెంబరు 14: పట్టణంలోని గవరపేట ఆదర్శ నగర్‌కు చెందిన అల్లు పావనీదేవి (13) డెంగ్యూతో మృతి చెందింది. ఆమెకు ఈ నెల 8న జ్వరం రావడంతో తుని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి కాకినాడ తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. ఈ ఘటనతో తునిలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పట్టణంలోని ప్రతీ ఇంట్లోనూ ఎవరో ఒకరు జ్వరాలతో భాదపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్తే వైద్యం సక్రమంగా అందుతుందో లేదోననే భయంతో బాధితులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు దొరికిందే అవకాశంగా వేలాది రూపాయలు పిండేస్తున్నారు. అయితే పట్టణంలో పారిశుధ్య లోపం ప్రజల పాలిట శాపంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు కొన్ని పల్లపు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండి దోమలకు ఆవాసాలుగా మారాయి. అంతేకాదు మునిసిపల్‌ అధికారులు పందులను ఎప్పటికప్పుడు పట్టిస్తున్నామని గొప్పలు చెప్పడం తప్ప ఆచరణలో కనిపించట్లేదు. పట్టణంలో ఎక్కడ చూసిన పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. వీధుల్లో చెత్తచెదారాలను సక్రమంగా తొలగించకపోవడం వల్ల పందులు ఆయా ప్రాంతాల్లో స్వైరవిహారం చేస్తున్నాయి. పట్టణ ప్రజలు జ్వరాలతో ఇబ్బందిపడుతున్నా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చెప్పకపోవడం గమనార్హం. మునిసిపల్‌ అధికారులు మెరుగైన పారిశుధ్య చర్యలు చేపట్టి ప్రజలను డెంగ్యూ, మలేరియా, వైరల్‌ జ్వరాల నుంచి కాపాడాలని కోరుతున్నారు.

సీతానగరంలో బాలుడి మృతి 

ఆసుపత్రి యాజమాన్యం వైఖరిపై బంధువుల ధర్నా 

సీతానగరం, సెప్టెంబరు 14: సీతానగరం గ్రామానికి చెందిన పట్టపు దుర్గామోహన్‌ (12) మండలంలోని చినకొండేపూడి వేదాస్‌ ఆసుపత్రిలో డెంగ్యూతో చికిత్స పొందుతూ మంగళ వారం మృతి చెందాడు. డాక్టర్లు సరైన వైద్యం చేయకపోవడంతోనే బాలుడు మృతి చెందాడని బంధువులు, స్థానికులు ప్రశ్నించడంతో అసహనానికి గురైన యాజమాన్యం కేస్‌షీట్‌ చింపి అనుచిత వ్యాఖ్యలు చేసి సవాల్‌ చేయడంతో స్థానికులు ఆగ్రహించారు. ఆసుపత్రిని ముట్టడించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, అనుచిత వ్యాఖ్యలు చేసిన యాజమాన్యం క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. అక్కడ ధర్నా నిర్వహించారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బందోబస్తు నిర్వహించి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. స్థానిక నాయకులు, బాధిత వర్గం, పోలీసులు చర్చలు జరిపారు. అనంతరం ఇరువర్గాలు రాజీపడడం, యాజమాన్యం బహిరంగంగా క్షమాపణ చెప్పడంతో సమస్య పరిష్కారమైంది.

మన్యంలో మరణ మృదంగం

అంతుచిక్కని వ్యాధులతో గిరిజనుల మృత్యువాత 

పోచవరం గ్రామ పంచాయతీ పరిధిలోని రెండు గ్రామాల్లో నెలలో ఏడుగురి మృతి 

పట్టించుకోని వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, మండల అధికారులు 

బిక్కుబిక్కుమంటున్న ప్రజలు

కూనవరం, సెప్టెంబరు 14: మన్యంలో అంతుచిక్కని వ్యాధులతో పేద ప్రజలు మృత్యువాతపడుతున్నారు. నిన్న, మొన్నటి వరకు కరోనా హడలెత్తించగా రెండు నెలలుగా డెంగ్యూ, టైపాయిడ్‌ వంటి వైరల్‌ జ్వరాలు సీజనల్‌ వ్యాధులు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నెల వ్యవధిలో ఒక పంచాయతీ పరిధిలోని పక్క పక్కన ఉన్న రెండు  గ్రామాల్లో ఏడుగురు వ్యక్తులు అనారోగ్య సమస్యలతో మృతి చెందడడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కూనవరం మండలంలోని పోచవరం  పంచాయతీ పరిధిలోని పోలిపాక, పోచవరం కాలనీ గ్రామాల్లో ఈ నెల రోజుల వ్యవధిలో ఏడుగురు మృతి చెందారు. వీంతా డెంగ్యూ, ఇతర విష జ్వరాలతోనే మృతి చెందారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మృతి చెందిన వారిలో డేగల మోహనరావు (47), డేగల వెంకటరావు (80), డేగల వీరాస్వామి (85), సీహెచ్‌సీ జాన్‌రాజు (54), పదముత్యం అశోక్‌ (47), పల్లంటి గోవిందం (85), పల్లంటి సంజీవరావు (55) ఉన్నారు. వీరంతా జ్వరాలతో బాధపడుతూ భద్రాచలం, విజయవాడ తదితరచోట్ల వైద్య సేవలు పొంతుతూ మృతి చెందినట్టు సమాచారం. ఈ పరిణామాలతో అనారోగ్యంతో ఉన్న మరికొందరు తమకు ఏదైనా అవుతుందోనని భయాందోళన చెంతున్నారు. పోలిపాక, పోచవరం కాలనీల్లో జ్వరాలు, ఇతర కారణాలతో ఏడుగురు మృత్యువాత పడినా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గానీ, మండల అధికారులు గానీ తమ గ్రామాలను సందర్శించిన దాఖలాలు లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రతీరోజూ వర్షాలు కురవడంతో పరిసరాలు అపరి శుభ్రంగా మారాయని, బ్లీచింగ్‌ చల్లించే నాఽథుడేలేడని వాపోతు న్నారు. రోడ్లన్నీ బురదమయంగా మారి వ్యాధులు ప్రబలుతున్నా పట్టించుకోవట్లేదన్నారు. దీంతో రోగాల బారిన పడాల్సి వస్తోంద న్నారు. ఈ రెండు గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను, పారిశుధ్య నిర్వహణను మెరుగు పరచాలని పంచాయతీ అధికారులను ప్రజలు కోరుతున్నారు.