Abn logo
Jul 4 2021 @ 12:26PM

ఎన్‌ఐఏ కస్టడీలో దర్బంగా నిందితులను ఏం ప్రశ్నించారు?

  • తర్వలో నగరానికి తీసుకొచ్చే అవకాశం 
  • ఇక్కడ ఎవరెవరిని కలిశారని ఆరా

హైదరాబాద్‌ సిటీ : దర్భంగా పార్సిల్‌ బాంబు కేసులో అరెస్ట్‌ అయిన నిందితులను కస్టడీలోకి తీసుకున్న ఎన్‌ఐఏ శనివారం పాట్నాలోని ఏటీఎస్‌ కార్యాలయంలో అధికారులు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో అరెస్టు అయిన ఇమ్రాన్‌ మాలిక్‌, నాసిర్‌ఖాన్‌ సోదరులతోపాటు హాజీసలీమ్‌, కఫీల్‌లకు తొలుత వైద్య పరీక్షలు చేయించిన తర్వాత కార్యాలయానికి తీసుకొచ్చారు. శనివారం ఉదయం హాజీ సలీమ్‌ కాస్త అనారోగ్యానికి గురి కాగా, కాసేపు పాట్నాలోని ఐజీఎంఎస్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. గంట తర్వాత ఆయనను ఏటీఎస్‌ కార్యాలయానికి తరలించారు. నలుగురిని వేర్వేరుగా ప్రశ్నించారు. మధ్యాహ్నం తర్వాత ఒకే గదిలో నలుగురిని ఎదురెదురుగా కూర్చోబెట్టి, ప్రశ్నించినట్లు సమాచారం. తొలి రోజు కస్టడీ ముగిసిన తర్వాత తిరిగి పాట్నా సెంట్రల్‌ జైలుకు పంపించారు. 


ఏం ప్రశ్నించారు? 

రైలులో బాంబు పెట్టాలని ఆదేశించింది ఎవరూ, బాంబు తయారీ శిక్షణ ఎక్కడ.. ఎలా పొందారు అనే విషయాలను మాలిక్‌ సోదరులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కేవలం నాలుగు అంగుళాల చిన్న సీసాలో శక్తివంతమైన బాంబు తయారీ ఎలా సాధ్యమైంది, అందు లో కలిపిన రసాయనాలు ఏమిటీ అన్న విషయాలను ఆరా తీసినట్లు తెలుస్తోంది. బాంబు తయారీలో హాజీ సలీం, ఇక్బాల్‌ ఖాన్‌ పాత్రలపై కూడా ఆరా తీశారు.  పాకిస్థాన్‌లో లష్కరే తోయిబాలో కీల క బాధ్యతలు వహిస్తున్న ఇక్బాల్‌ ఖాన్‌తో సంప్రదింపులు ఎలా జరిగాయి? అతనితో మాట్లాడినప్పుడు వాడిన భాష, కోడ్‌ గురించి ప్రశ్నిం చారు. కోడ్‌లో మాట్లాడటంతో పాటు యూట్యూబ్‌ నుం చే బాంబుల తయారీ శిక్షణ పొంది ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

నగరానికి నిందితులు? 

నగరంలోని మల్లేపల్లిలో మాలిక్‌ సోదరులను అరెస్ట్‌ చేసిన ఎన్‌ఐఏ అధికారులు కస్టడీ సమయంలోనే వారిని నగరానికి తీసుకొచ్చే అవకాశముందని సమాచారం. అరెస్ట్‌, బాంబు తయారీ విధానాన్ని రీ కన్‌స్ట్రక్షన్‌ చేయించనున్నట్లు తెలుస్తోంది. వీరి సమాచారం మేరకు హాజీ సలీమ్‌, కఫీల్‌లను అరెస్టు చేసినట్లే, మరికొన్ని అరె్‌స్టలు తప్పకపోవచ్చునని అధికారులు చెబుతున్నారు. ఈ ఏ డాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లోనే హాజీ సలీంను మాలి క్‌ సోదరులు కలిశారనే సమాచారంతో, నగరంలో వీరు ఇంకా ఎవరెవరిని కలిశారు. కుట్రలో ఇంకెవరి పాత్రైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. 


మోస్ట్‌ వాంటెడ్‌ ఇక్బాల్‌

పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్న ఇక్బాల్‌ ఖాన్‌ అలియాస్‌ కానా ఇక్బాల్‌ బాంబు పేలుడుకు స్కెచ్‌ వేసినట్లు తెలుస్తోంది. ఇక్బాల్‌ ఖాన్‌, సలీం ఇందుకోసం భారీ ఎత్తున డబ్బు సేకరించినట్లు సమాచారం. ఇక్బాల్‌ ఖాన్‌ అలియాస్‌ కానా ఇక్బాల్‌ అమాయకులకు భారీగా డబ్బు ఆఫర్‌ చేసి తీవ్రవాద కార్యకలాపాల వైపు మళ్లిస్తాడని సమాచారం. పాక్‌ నిఘా సంస్థ ఐఎ్‌సఐ కోసం పని చేస్తున్నాడనే ఆరోపణలున్న ఇక్బాల్‌ భారత దర్యా ప్తు సంస్థతోపాటు పలు జాతీయ ఏజెన్సీలకు మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్నాడు.


నా కుమారులు ఏ తప్పు చేయలేదు : మూసాఖాన్‌

మాలిక్‌ బ్రదర్స్‌ తండ్రి మూసాఖాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంకోసం రక్తం ధారపోసిన తాను, దేశద్రోహాన్ని భరించలేనన్నారు. తన కుమారులు దేశానికి హాని తలపెట్టే పనికి పూనుకుంటే వారిని కాల్చి చంపేయాలని చెప్పారు. తన కుమా రులు ఉగ్రవాదులు కారని, వారు ఎలాంటి తప్పు చేయలేదని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాయస్తవాడలో పెళ్లి సామగ్రి విక్రయించే వ్యాపారం చేసే మాలిక్‌, ఇమ్రాన్‌ కుటుంబానికి అండగా నిలిచే వారని మూసా వెల్లడించారు. దీని వెనక కుట్ర దాగి ఉందని, దర్యాప్తులో వాస్తవాలు వెల్లడవుతాయని ఆయన అన్నారు.

హైదరాబాద్మరిన్ని...