మహానగరంలో కారుచీకట్లు!

ABN , First Publish Date - 2020-10-14T09:21:12+05:30 IST

కుండపోతగా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్‌ మహానగరంలో కారు చీకట్లు కమ్ముకున్నాయి. సగం నగరం అంధకారంలో మునిగిపోయింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో..

మహానగరంలో కారుచీకట్లు!

 హైదరాబాద్‌లోని సగం ప్రాంతాల్లో అంధకారం

హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): కుండపోతగా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్‌ మహానగరంలో కారు చీకట్లు కమ్ముకున్నాయి. సగం నగరం అంధకారంలో మునిగిపోయింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 800 ఫీడర్లు ఉండగా దాదాపు 400 ఫీడర్లలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పదుల సంఖ్యలో కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్తు సరఫరాలో తీవ్ర అంతరాయం కలిగింది. మంగళవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి విద్యుత్తు లైన్లపై పడ్డాయి.


గాలులు లేకపోవడంతో పెద్దగా నష్టం జరగలేదు. ప్రతిచోటా గంటల కొద్దీ సరఫరా నిలిచిపోయింది. కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తుండడం, వర్షం తగ్గకపోవడంతో విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించడానికి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బేగంపేట, మధురానగర్‌, ఎస్‌ఆర్‌నగర్‌, బంజారాహిల్స్‌, తిరుమలగిరి, అడ్డగుట్ట, కుషారుగూడ, ఖైరతాబాద్‌, బర్కత్‌పురా, మెట్టుగూడ, మోతీనగర్‌, అస్మాన్‌గఢ్‌, ఎల్బీనగర్‌, బోయిన్‌పల్లి, మచ్చబొల్లారం, కుందన్‌బాగ్‌తో పాటు గ్రేటర్‌ పరిధిలోని చాలాచోట్ల విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. నిమ్స్‌, కందికల్‌ గేట్‌, బంజారాకాలనీ, పెద్ద అంబర్‌పేట్‌, కొత్తపేట, రంగారెడ్డి కోర్టులు, హనుమాన్‌నగర్‌, హయత్‌నగర్‌, తట్టిఅన్నారం తదితర సబ్‌స్టేషన్లలోకి నీరు చేరడంతో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. ముందు జాగ్రత్త చర్యగా దాదాపు 100కు పైగా ఫీడర్లను షట్‌డౌన్‌ చేశారు. పరిస్థితులు కుదుటపడిన వెంటనే వీటిని ఛార్జ్‌ చేసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.


కుప్పకూలిన విద్యుత్‌ డిమాండ్‌: 

భారీ వర్షాలతో విద్యుత్‌ డిమాండ్‌ కుప్పకూలింది. గతేడాది ఇదే రోజు (ఈ నెల 13న రాత్రి 9:15 గంటలకు) 6807 మెగావాట్లుగా ఉండగా.. మంగళవారం 3635 మెగావాట్లకు పడిపోయింది. రాత్రి 10:58 గంటల సమయంలో ఏకంగా 2974 మెగావాట్లకు డిమాండ్‌ పడిపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చాకా ఇంత తక్కువ డిమాండ్‌ నమోదు కావడం ఇదే ప్రథమం. దాంతో గ్రిడ్‌ కుప్పకూలకుండా విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను బ్యాక్‌డౌన్‌ చేసి, సరఫరాను మెరుగుపరిచారు. ముంబై తరహాలో గ్రిడ్‌ కుప్పకూలకుండా చూసేందుకు జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఎస్‌ఎల్‌డీసీ (స్టేట్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌) అధికారులను అప్రమత్తం చేశారు.

Updated Date - 2020-10-14T09:21:12+05:30 IST