కృష్ణ నీళ్లు.. కరెంటు పాలు!

ABN , First Publish Date - 2021-12-08T08:03:44+05:30 IST

‘‘215 టీఎంసీ సామర్థ్యం కలిగిన శ్రీశైలం జలాశయంలో విద్యుదుత్పత్తి వల్ల నీటి నిల్వ 94.910 టీఎంసీలకు పడిపోయింది.

కృష్ణ నీళ్లు.. కరెంటు పాలు!

  • శ్రీశైలంలో జల విద్యుత్‌ ఉత్పాదనపై వివరాలివ్వని రెండు తెలుగు రాష్ట్రాలు
  • శ్రీశైలం, సాగర్‌లో విద్యుదుత్పత్తి నిలిపివేయాలని
  • ఉభయరాష్ట్రాలకూ కేఆర్‌ఎంబీ సభ్యుడి లేఖ
  • అయినా కొనసాగుతూనే ఉన్న విద్యుదుత్పత్తి
  • యాసంగికి నీటి విడుదలపై రేపు కేఆర్‌ఎంబీ భేటీ


నాగర్‌కర్నూల్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ‘‘215 టీఎంసీ సామర్థ్యం కలిగిన శ్రీశైలం జలాశయంలో విద్యుదుత్పత్తి వల్ల నీటి నిల్వ 94.910 టీఎంసీలకు పడిపోయింది. గత నెల 15న శ్రీశైలం గరిష్ఠ నిల్వ సామర్థ్యం 885 అడుగుల్లో 215 టీఎంసీలు ఉంటే.. ఈ నెల 18 నాటికి 856.10 అడుగులకు చేరింది. అంటే నీటి నిల్వ 94.910 టీఎంసీలకు పడిపోయినట్టు. ఇదే తరహాలో కొనసాగితే భవిష్యత్తులో తాగు, సాగునీటి అవసరాలకు కష్టమవుతుంది.. కాబట్టి వెంటనే విద్యుదుత్పత్తిని ఆపేయండి’’..ఈ ఏడాది నవంబరు 18న తెలంగాణ నీటిపారుదల శాఖ, ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సభ్యుడు ఎల్‌బీ మౌంతంగ్‌ రాసిన లేఖల సారాంశమిది! తాగు, సాగునీటి అవసరాలు లేకపోయినా శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో అకారణంగా జలవిద్యుదుత్పత్తి చేయడం వల్ల 55.966 టీఎంసీల జలాలు సముద్రంలో కలిసిపోయాయని ఆయన ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. జల విద్యుదుత్పత్తి ఆపేస్తే భవిష్యత్తులో సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చని పేర్కొన్నారు. ఆయన ఆ లేఖలు రాసి దాదాపు 20 రోజులు గడిచిపోతున్నాయి. యాసంగికి సాగు, తాగునీటి అవసరాలకు సంబంధించి నీటిని విడుదల చేయడానికి గురువారంనాడు (డిసెంబరు 9న) కేఆర్‌ఎంబీ సమావేశం కూడా జరగనుంది. 


యాసంగి మొత్తానికీ నీటిని విడుదల చేసే అంశంపై ముగ్గురు సభ్యుల కమిటీ నిర్ణయం తీసుకొని అమలు చేయాల్సి ఉంది. కానీ.. శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తున్న ఇన్‌ఫ్లో, విద్యుత్‌ ఉత్పాదన ద్వారా దిగువకు వదులుతున్న నీటి గురించి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు గోప్యతను పాటిస్తున్నాయి. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జల విద్యుత్‌  కేంద్రాలలో విద్యుదుత్పత్తి కొనసాగుతూనే ఉంది. కానీ, రెండు రాష్ట్రాలూ ఆ వివరాలేవీ చెప్పట్లేదు. అక్టోబరు, నవంబరులో కురిసిన వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టులో సమృద్ధిగా పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసే అవకాశాలున్నప్పటికీ రెండు రాష్ట్రాలూ పోటీపడి జల విద్యుత్‌ ఉత్పత్తి చేయడంతో నీటి నిల్వలు బాగా తగ్గిపోయాయి. నాలుగు దశాబ్దాల క్రితం జలవిద్యుత్‌ కోసమే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించినప్పటికీ.. కాలక్రమంలో పెరిగిన సాగు అవసరాలకు అనుగుణంగా నీటిని వినియోగించడం మొదలుపెట్టారు.  పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, ముచ్చుమర్రి ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రాకు, మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం ద్వారా పాలమూరు, నల్గొండ జిల్లాలకు కూడా సాగునీరందుతోంది. అయితే, అవసరం లేకపోయినా ఇరు రాష్ట్రాలూ జలవిద్యుదుత్పత్తికి పోటీపడడంతో సాగు అవసరాలకు తగినంత నీరు అందకుండా పోయే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 


సామరస్యంగా పరిష్కరించుకోవడమే మేలు 

కృష్ణా జలాల వినియోగం విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాలూ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడమే మేలు. మిగులు విద్యుత్‌ ఉన్నందున ఆంధ్రా, తెలంగాణ  కృష్ణ  నీళ్లను సాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలి. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమక్షంలో సజావుగా సమస్యను పరిష్కరించుకొని ప్రస్తుతానికి జల విద్యుదుత్పాదనను పక్కకు పెట్టి వ్యవసాయ అవసరాల కోసం నీటిని వినియోగించుకునేలా ప్రణాళికను రూపొందించుకోవాలి.

- రంగారెడ్డి, విశ్రాంత ఇంజనీర్ల సంఘం 

హైదరాబాద్‌ అధ్యక్షుడు

Updated Date - 2021-12-08T08:03:44+05:30 IST