గరుడవాహనంపై గోవిందుడు

ABN , First Publish Date - 2021-10-12T07:55:18+05:30 IST

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో గరుడవాహనంపై గోవిందుడు కటాక్షించారు. బ్రహ్మోత్సవాల్లో విశిష్టమైన గరుడ వాహనసేవ సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. ఉదయం మోహినీ అవతారంలో దర్శనమిచ్చిన వెంకన్న రాత్రి 7 గంటలకు గరుత్మంతుడిపై కొలువుదీరారు. ఈ సందర్భంగా శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున

గరుడవాహనంపై గోవిందుడు

  • తిరుమల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు దర్శనం 
  • ఉదయం మోహినీ అవతారంలో అభయం..
  • శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పించిన జగన్‌ 
  • నడక మార్గంలో పైకప్పు, చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, గో మందిరం, 
  • గో తులాభారం మంటపాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్‌
  • తిరుమల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు దర్శనం 

తిరుమల/తిరుపతి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో గరుడవాహనంపై గోవిందుడు కటాక్షించారు. బ్రహ్మోత్సవాల్లో విశిష్టమైన గరుడ వాహనసేవ సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. ఉదయం మోహినీ అవతారంలో దర్శనమిచ్చిన వెంకన్న రాత్రి 7 గంటలకు గరుత్మంతుడిపై కొలువుదీరారు. ఈ సందర్భంగా శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్‌ పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు తిరుమల పద్మావతి అతిథిగృహం వద్ద సీఎంకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. జగన్‌  సంప్రదాయదుస్తులతో బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు సీఎం తలకు పరివట్టం చుట్టి శేషవస్త్రాన్ని మెడలో ధరింపచేశారు. ఆ తరువాత నూతన పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా శ్రీవారి ఆలయం చేరుకున్నారు. గర్భాలయంలో మూలమూర్తికి పట్టువస్ర్తాలను సమర్పించి దర్శనం చేసుకున్నారు. బలిపీఠానికి, ధ్వజస్తంభానికి మొక్కుకుని రంగనాయకుల మంటపం చేరుకోగా పండితులు జగన్‌కు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ చైర్మన్‌, ఈవో తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ ముద్రించిన 2022వ సంవత్సర క్యాలెండర్‌ను, డైరీలను జగన్‌ ఆవిష్కరించారు. అనంతరం కల్యాణోత్సవ మంటపానికి చేరుకుని గరుడవాహనంపై కొలువుదీరిన మలయప్పస్వామిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు దర్శనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం కర్ణాటక ముఖ్యమంత్రితో కలిసి సీఎం జగన్‌ మరోసారి శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 


గో మందిరం, గో తులాభారం ప్రారంభం 

తిరుపతిలో జగన్‌ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బర్డ్‌ ఆస్పత్రి ప్రాంగణంలో రూ.25 కోట్లతో టీటీడీ తాత్కాలిక భవనాల్లో ఏర్పాటు చేసిన పద్మావతి చిన్నపిల్లల గుండెజబ్బుల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. అక్కడ నుంచి అలిపిరి కూడలి చేరుకుని నడక మార్గంలో రిలయన్స్‌ సంస్థ రూ.25 కోట్లతో అభివృద్ధి చేసిన పైకప్పును ప్రారంభించారు. అక్కడే టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు, చెన్నై సమాచార కేంద్ర సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌ రూ.15 కోట్లతో నిర్మించిన గో మందిరం, గో తులాభారం మంటపాలను ప్రారంభించారు. 


అంబులెన్సుకు దారిచ్చిన సీఎం కాన్వాయ్‌  

రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతికి వెళుతున్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ ఓ అంబులెన్సుకు దారిచ్చింది. తిరుపతి బైపాస్‌ రోడ్డులో కాన్వాయ్‌ వెళ్తుండగా వెనకే అంబులెన్స్‌ వాహనం వచ్చింది. సైరన్‌ వినగానే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. మొత్తం కాన్వాయ్‌ను కుడిపక్కకు మళ్లించి అంబులెన్సుకు దారిచ్చారు. దీంతో కాన్వాయ్‌ దాటి అంబులెన్సు వేగంగా వెళ్లిపోయింది. 


 టీటీడీ చెన్నై సమాచార కేంద్ర సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌ సౌజన్యంతో తిరుపతిలో రూ.15 కోట్లతో నిర్మించిన గో మందిరం, గోతులాభార మంటపాల ప్రారంభోత్సవంలో గోమాతకు గ్రాసం తినిపిస్తున్న జగన్‌  

Updated Date - 2021-10-12T07:55:18+05:30 IST