‘దశ’ దేనికో,,

ABN , First Publish Date - 2021-11-28T06:22:24+05:30 IST

రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన సత్యదేవుడి దర్శనానికి ఏటా కోటి మంది భక్తులు వస్తుంటారు. వ్రతాలైతే సంవత్సరానికి ఆరు లక్షల వరకు జరుగుతున్నాయి.

‘దశ’ దేనికో,,

రాష్ట్రంలో అన్నవరం ప్రముఖ దేవస్థానం. తిరుపతి తర్వాత అత్యధిక భక్తులు వచ్చేది ఇక్కడికే. అయితే రద్దీకి తగ్గట్టుగా ఆలయంలో వసతుల్లేవు. దేవుడి దర్శనం దగ్గర నుంచి వ్రతాలు, డార్మెటరీల వరకు ఎన్నో సమస్యలు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాద్‌’ పథకానికి అన్నవరం ఎంపిక కావడంతో దేవస్థానానికి మంచిరోజులు వచ్చినట్టయింది. ఇప్పటికే రూ.70 కోట్లతో అధికారులు ఆలయ అభివృద్ధికి ప్రతిపాదనలు పంపారు. వీటిలో ఏ పనులకు కేంద్రం అనుమతిస్తుందనేది తెలియక సందిగ్దత నెలకొంది. వాస్తవానికి ఆలయ కష్టాలు తీరాలన్నా, భక్తులకు దర్శనభాగ్యం వేగంగా కలగాలన్నా అత్యవసరంగా మూడు కీలక పనులు పట్టాలెక్కాల్సి ఉంది. ఇవి కార్యరూపం దాల్చితే బాధలు తీరినట్టే. అయితే కేంద్రం వీటిని ప్రాధాన్యతగా తీసుకుంటుందా? లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది. 

అన్నవరం దేవస్థానంలో   ‘ప్రసాద్‌’ పథకం పనులు మొదలయ్యేదెన్నడో

 ప్రతిపాదించిన రూ.70 కోట్ల వర్కుల్లో కేంద్రం పచ్చజెండా వేటికనే దానిపై సందిగ్ధం

 వ్రతమండపాలు, అన్నప్రసాద భవనం,    డార్మెటరీల నిర్మాణం చేస్తేనే సమస్యలకు చెల్లు

 ప్రస్తుతం వ్రతాలు, దర్శనాలకు ఒకే దారి    కావడంతో రద్దీ సమయాల్లో భక్తులకు యాతన

స్వామివారిని దర్శించుకునేందుకు ఇప్పుడు    నాలుగు గంటలకుపైగా సమయం 

 అటు వేలాది మంది భక్తులకు అన్నప్రసాద       వితరణ భవనంలో 400 మందికే చోటు

భక్తుల తాకిడికి తగ్గట్టుగా డార్మెటరీలు లేక,   ఉన్నవి శిథిలావస్థకు చేరడంతో ఇబ్బందులు

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన సత్యదేవుడి దర్శనానికి ఏటా కోటి మంది భక్తులు వస్తుంటారు. వ్రతాలైతే సంవత్సరానికి ఆరు లక్షల వరకు జరుగుతున్నాయి. క్రమేపీ ఇతర రాష్ట్రాల నుంచీ భక్తులు పెరుగుతున్నారు. ఈనేపథ్యంలో ప్రస్తుతం ఆలయంలో వసతులు ఏమాత్రం సరిపోవడం లేదు. సాధారణ రోజుల్లో మౌలిక వసతులు ఓ మోస్తరుగా సరిపోతున్నా రద్దీ రోజుల్లో భక్తులు నరకయాతన అనుభవిస్తున్నారు. దర్శనాలకు అత్యధిక సమయం తీసుకోవడం, డార్మెటరీలు డిమాండ్‌కు తగ్గట్టు లేకపోవడంతో వచ్చినవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి దర్శనానికి నాలుగు గంటలకుపైగా సమయం పడుతోంది. డార్మెటరీలు చాలక కొండ కింద పెద్దఎత్తున డబ్బులు వెచ్చించి వసతి పొందాల్సి వస్తోంది. పోనీ భక్తుల సమస్యలు తీర్చడానికి దేవస్థానం ప్రయత్నించినా నిధుల లేమి, అనుమతుల జాప్యంతో ఇవేవీ ముందు కు వెళ్లడం లేదు. అయితే దేవస్థానం సమస్యలు గట్టెక్కేలా ఇటీవల ఆలయం కేంద్ర ప్రభుత్వ ప్రసాద్‌ పథకానికి ఎంపికైంది. దీంతో రూ.70 కోట్ల వరకు కేంద్రం నుంచి విడతలవారీగా మంజూరు కానున్నాయి. కానీ రూ.70 కోట్లతో ఆలయంలో ఏమేం పనులు చేయాలనేదానిపై మాస్టర్‌ ప్లాన్‌ కింద ప్రతిపాదనలు ఆలయ అధికారులు పంపించారు. ఈనేపథ్యంలో కేంద్రం ఇప్పుడు ఏయే పనులకు పచ్చజెండా ఊపుతుందనేది సస్పెన్స్‌గా మారింది. తొలి విడత ఏయే పనులు ప్రాధాన్యంగా తీసుకుంటుందనే అధికారులకూ సమాచారం లేదు. అయితే తొలుత అత్యవసరమైన మూడు పనులకు శ్రీకారం చుడితేనే దేవస్థానం సమస్యలకు ఫుల్‌స్టాప్‌ పడుతుంది. ముఖ్యంగా వ్రతాలకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. ఏటా ఆలయంలో ఆరు లక్షల వ్రతాలు జరుగుతుంటాయి. ఇందులో ప్రధానంగా 70 శాతం రూ.300 వ్రతాలే. ఆ తర్వాత రూ.800, రూ.1500 దర్శనాలు కూడా జరుగుతాయి. అయితే సాధారణ భక్తు లు సత్యదేవుడి దర్శనానికి వెళ్లాలంటే ఈ వ్రతాల పక్కనుంచే వెళ్లాలి. అటు వ్రతాలు పూర్తిచేసుకున్న వేలాది జంటలు కూడా ఇదే క్యూలైన్‌లో కలుస్తున్నారు. దీనివల్ల ఒక్కసారిగా వేలాది మందితో రద్దీ పెరిగిపోతోంది. దీంతో వివాహాలు, కార్తీకమాసం, ఇతర ముఖ్యమైన రోజుల్లో దర్శనానికి నాలుగు గంటలకుపైగానే పడుతోంది. దీంతో భక్తులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ.300 వ్రతమండపాలను టీటీడీ సత్రం ప్రదేశంలో మూడంతస్తుల్లో నిర్మించి అక్కడి నుంచి ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి ఏర్పాటుచేసి నేరుగా ప్రధానాలయానికి క్యూలైన్‌ నిర్మించాలి. తద్వారా 70 శాతం మంది భక్తులు బయటమార్గం నుంచే స్వామిదర్శనం చేసుకోవచ్చు. రద్దీ రోజుల్లోనూ అర గంటలోనే అంతా దర్శనం చేసుకునే వీలు కలుగుతుంది. ప్రసాద్‌ పథకం కింద దీన్ని తొలుత చేపట్టాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇటు ఆలయంలో నిత్యాన్నదాన భవనం చాలినంత లేక ఇబ్బందిగా మారింది. ప్రస్తుత భవనంలో ఒకే సమయంలో నాలుగు వందల మందికి మించి కూర్చునే వీలులేదు. దీంతో ఆలస్యం అవుతుందనే కారణంతో వేలాది మంది భక్తులు అన్నప్రసాదం తీసుకోకుండా వెనుదిరుగుతున్నారు. దీంతో రత్న, సత్యగిరికి సమీపంలోని ఖాళీ ప్రదేశంలో మూడంతస్తుల్లో వెయ్యి మంది ఒకేసారి కూర్చుని అన్న ప్రసాదం స్వీకరించే హాలు నిర్మించాల్సి ఉంది. భక్తులను వేధిస్తున్న మరో సమస్య వసతి. ఇప్పటికే శివసదన్‌ కాటేజీ 138 గదులతో త్వరలో ప్రారంభం కానుంది. దీంతో గదులు పెరుగుతాయనుకునేలోపు పాత సెంటినరీ, సత్యదేవ అతిథిగృహం కాటేజీలు శిథిలావస్థకు చేరడంతో అవి తొలగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త డార్మెటరీలు నిర్మించి స్నానపుగదులు, మరుగుదొడ్లు, విశ్రాంతి మండపాలను నిర్మించాలి. వీటికి ఈ పథకంలో ఎన్నాళ్లకు చోటు కల్పిస్తారో చూడాలి.


Updated Date - 2021-11-28T06:22:24+05:30 IST