దశలవారీ పోరాటం

ABN , First Publish Date - 2022-01-24T06:35:24+05:30 IST

ప్రభుత్వం ప్రకటించిన వేతన సవరణలో లోపాలను సవరించాలని డిమాండ్‌ చేస్తూ దశలవారీగా పోరాటాలు చేస్తామని పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రకటించారు.

దశలవారీ పోరాటం

భారీ ర్యాలీ రేపు

అన్ని ప్రాంతాల నుంచి ఉద్యోగులు తరలిరావాలి

26న అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రాలు

27 నుంచి 30 వరకు రిలే దీక్షలు

మూడో తేదీన ‘ఛలో విజయవాడ’ 

పీఆర్సీ సాధన సమితి నేతలు పిలుపు


విశాఖపట్నం, జనవరి 23 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వం ప్రకటించిన వేతన సవరణలో లోపాలను సవరించాలని డిమాండ్‌ చేస్తూ దశలవారీగా పోరాటాలు చేస్తామని పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రకటించారు. ఆదివారం ఎన్జీవో కార్యాలయంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు కె.ఈశ్వరరావు, ఇతర నేతలు మీడియాకు వెల్లడించారు. తొలుత ఈశ్వరరావు మాట్లాడుతూ, ఉద్యమంలో భాగంగా ఉద్యోగ, ఉపాధ్యాయులతో ఈనెల 25న కలెక్టరేట్‌ నుంచి భారీ ర్యాలీ నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి అన్ని ప్రాంతాల నుంచి ఉద్యోగులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 26న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రాలు ఇస్తామని, 27 నుంచి 30 వరకు రిలే దీక్షలు చేపడతామన్నారు. వచ్చే నెల మూడో తేదీన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమంలో జిల్లా నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులు వేలాదిగా పాల్గొనాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అఽధ్యక్షుడు ఎస్వీ రమణ మాట్లాడుతూ, ప్రతి పీఆర్సీలో జీతాలు పెరగడమే చూశామని, తొలిసారి జీతాలు తగ్గడం ప్రస్తుత పీఆర్సీతో చూస్తున్నామన్నారు.  పెండింగ్‌ డీఏలతో కలిపి జీతాలు పెరిగినట్టు చెప్పడం ముమ్మూటికీ మోసపూరిత చర్య అని అన్నారు. అశుతోష్‌మిశ్రా కమిటీ నివేదికను కాదని, ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో వేసిన అశాస్త్రీయ కమిటీ సూచనల మేరకు పీఆర్సీ అమలుచేయడం అన్యాయమన్నారు. ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ ఎంవీ.కృష్ణకుమార్‌ మాట్లాడుతూ, కొత్త పీఆర్సీతో ఉద్యోగుల జీతాలు పెరిగాయని అధికార పార్టీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. విలేకరుల సమావేశంలో జాక్టో ప్రతినిధి గోపీనాథ్‌, సీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అప్పలరాజు, ఇతర నేతలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T06:35:24+05:30 IST