జగజ్జననీ...పాహిమాం

ABN , First Publish Date - 2020-10-25T11:15:17+05:30 IST

అమ్మలగన్న అమ్మగా నీరాజనాలందుకొంటూ అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రజలు జరుపుకునే పండుగలలో విజయదశమికి ఓ ప్రత్యేక స్థానం ఉంది.

జగజ్జననీ...పాహిమాం

నేడు విజయదశమి


కడప (మారుతీనగర్‌ ), అక్టోబరు 24 : అమ్మలగన్న అమ్మగా నీరాజనాలందుకొంటూ అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రజలు జరుపుకునే పండుగలలో విజయదశమికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా ఆనందోత్సాహాలతో పండుగనను  జరుపుకుంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారిని పలు రూపాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి దశమి రోజున పూజలు చేయడం ఆనవాయితీ. అమ్మవారి ఆలయాలలో ఆ తల్లిని వివిధ రూపాలలో తొమ్మిదిరోజులలో ఒక్కోరోజు ఒక్కో అలంకారంతో పూజించి దశమిరోజున విజయదుర్గాదేవిగా ప్రత్యేకపూజలతో పూజించి తరిస్తారు. విజయదశమి రోజున అమ్మవారి కృపకు పాత్రులు కావాలనే కోరికతో ఆలయాలను దర్శించడం, నూతన దుస్తులు ధరించి రుచికరమైన వంటకాలతో కుటుంబంతో పాటు ఆనందంగా గడుపుతారు.  దసరా ఉత్సవాలు ఆదివారం చివరి రోజు కావడంతో భక్తులు ఆలయాలకు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. శనివారం 8వ రోజు అమ్మవారి అలంకారాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అమ్మవారిశాలలో గాయత్రీదేవిగా దర్శనమివ్వగా, శివాలయంలో మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చారు. కడప అమ్మవారిశాలలో త్రిపురసుందరీదేవి అలంకారం, విజయదుర్గాదేవి ఆలయంలో మహాగౌరి అలంకారం, అలాగే జిల్లాలోని వివిధ ఆలయాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. 

Updated Date - 2020-10-25T11:15:17+05:30 IST