Abn logo
Sep 25 2021 @ 01:24AM

చకచకా..

కెనాల్‌ రోడ్డులో క్యూలైన్ల ఏర్పాట్లు

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవ ఏర్పాట్లు

కొండంతా విద్యుత్‌ అలంకరణ 


ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు ముస్తాబవుతోంది. కరోనా వ్యాప్తి కాస్త తగ్గిన నేపథ్యంలో ఈ ఏడాది దసరా ఉత్సవాలను గతం కంటే వైభవంగా నిర్వహించాలని సమన్వయ కమిటీ సమావేశం నిర్ణయించడంతో దుర్గగుడి అధికారులు ఉత్సవ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. పది రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో పనుల్లో వేగం పెంచారు. తొమ్మిది రోజులపాటు కొనసాగే దసరా వేడుకల్లో అమ్మవారి ప్రధాన ఆలయంతోపాటు కొండపైన, దిగువన, పరిసర ప్రాంతాలన్నీ ఉత్సవ కాంతులను వెదజల్లేలా విద్యుత్‌ అలంకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. నగరం నలువైపులా జాతీయ రహదారుల్లో దసరా ఉత్సవాలకు ఆహ్వానం పలుకుతూ స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు.


ఆంధ్రజ్యోతి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపైన, కింద దసరా ఉత్సవ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ భక్తులు క్రమపద్ధతిలో అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా కెనాల్‌ రోడ్డులోని వినాయకుని గుడి వద్ద నుంచి రథం సెంటర్‌, దుర్గాఘాట్‌, దుర్గగుడి టోల్‌గేట్‌, ఘాట్‌రోడ్డు మీదుగా ఓం టర్నింగ్‌ వరకు మూడు వరసల క్యూలైన్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. కుమ్మరిపాలెం వైపు హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ నుంచి క్యూలైన్లు నిర్మిస్తున్నారు. కొండపైన ఓం టర్నింగ్‌ దగ్గర నుంచి అదనంగా మరో ఉచిత దర్శనం క్యూలైను, వీఐపీ క్యూలైను.. మొత్తం ఐదు క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు శివాలయం మెట్ల మార్గం ద్వారా కిందకు దిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు కొబ్బరికాయలు కొట్టేందుకు మహామండపం వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. 


పటిష్ట భద్రతా ఏర్పాట్లు

దసరా ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకూ తావు లేకుండా ఆలయ పరిసరాల్లో అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌తో అనుసంధానిస్తారు. ఉత్సవాల్లో భక్తులు తప్పిపోయినా.. ఎలాంటి సమాచారాన్నైనా అందజేసేందుకు వీలుగా కొండపైన, దిగువన, పరిసర ప్రాంతాల్లో పబ్లిక్‌ అడ్రసింగ్‌కు మైకులు ఏర్పాటు చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఎక్కడికక్కడ సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా భవానీ భక్తులు ఇరుముడులు సమర్పించేందుకు దేవస్థానం తరపున ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదు. గత ఉత్సవాల్లో కొండ చరియలు విరిగిపడిన నేపథ్యంలో ఈ ఏడాది అటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కొండ రక్షణ పనులు చేపట్టారు.


13 ప్రసాదం కౌంటర్లు

భక్తులకు అమ్మవారి ప్రసాదాలను విక్రయించేందుకు కనకదుర్గ నగర్‌లో 12, కొండపైన ఒకటి మొత్తం 13 ప్రసాదం కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు విక్రయించేందుకు పది లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ప్రతి ఏటా అందించే ఉచిత అన్న ప్రసాదానికి బదులు సాంబారు అన్నం, పెరుగన్నం ప్యాకెట్లను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు సీతమ్మవారి పాదాల వద్ద జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 300 షవర్లు ఏర్పాటు చేస్తున్నారు. దుర్గాఘాట్‌లో తెప్పోత్సవం నిర్వహించనున్నందున స్నానాలకు అనుమతించడం లేదు.


ఆహ్వాన పత్రికలు పంపిణీ 

దసరా ఉత్సవాలకు వీఐపీలను ఆహ్వానిస్తూ ఆలయ అధికారులు ఆహ్వాన పత్రికలను పంపిణీ చేస్తున్నారు. దేవస్థానం పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబ, ప్రధాన అర్చకుడు లింగంభొట్ల దుర్గాప్రసాద్‌లు శుక్రవారం రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రముఖులందరికీ ఆహ్వాన పత్రికలను అందజేసే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.