భక్తులకు నరకం!

ABN , First Publish Date - 2021-10-11T06:06:14+05:30 IST

రాష్ట్ర హోం మంత్రి మేకపాటి సుచరిత రాకను పురస్కరించుకుని విధించిన ఆంక్షలతో భక్తులు రెండు గంటలకు పైగా నరకయాతన అనుభవించారు.

భక్తులకు నరకం!
కొండపైకి వాహనాలు రాకుండా అడ్డుకుంటున్న పోలీసులు

హోం మంత్రి రాకతో పోలీసుల హడావిడి 

రాజగోపురం దగ్గర ఆంక్షలు.. బస్సుల నిలుపుదల 

ఉభయదాతలు, ప్రొటోకాల్‌ వాహనాలకూ బ్రేక్‌

మూడు గంటలు ఆలస్యంగా వచ్చిన మంత్రి 

తీవ్ర ఇబ్బందులకు గురైన భక్తులు


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రాష్ట్ర హోం మంత్రి మేకపాటి సుచరిత రాకను పురస్కరించుకుని విధించిన ఆంక్షలతో భక్తులు రెండు గంటలకు పైగా నరకయాతన అనుభవించారు. హోం మంత్రి ఎన్ని గంటలకు వస్తారో నిర్దిష్టమైన సమాచారం లేకుండా, గంటల తరబడి ఆంక్షలు విధించటం వల్ల సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులనెదుర్కొన్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా విధించే ఆంక్షలను హోం మంత్రి వచ్చినపుడు కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. గత ఉత్సవాల్లో ఎప్పుడూ ఇటువంటి అత్యుత్సాహం కనిపించలేదు. 

హోం మంత్రి కాన్వాయ్‌ వస్తోందంటూ భక్తులు వచ్చే బస్సులను రాజగోపురం దగ్గర నిలుపుదల చేశారు. ఈ కారణంగా కుమ్మరిపాలెం సెంటర్‌ నుంచి వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. దీనిని నియంత్రించటానికి బస్సులను లోపలికి అనుమతించి, రాజగోపురం ఎగువన ఓ పక్కన పెట్టించారు. దాదాపు గంటపాటు ఈ బస్సులను నిలిపివేశారు. ఎండకు బస్సులో ఉన్న భక్తులు విలవిల్లాడిపోయారు. దాదాపు మూడు గంటలపాటు పోలీసులు చేసిన హడావిడిపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసు యంత్రాంగం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఈ హడావిడి చేసినట్టు తెలుస్తోంది. ఉభయదాతలు, వీవీఐపీ ప్రొటోకాల్‌ వాహనాలను రాజగోపురం మార్గం దగ్గరే నిలిపివేశారు. పోలీసు వాహనాలను మాత్రం లోపలికి అనుమతించారు. ఉదయం 10.30 గంటలకు వస్తారన్న హోం మంత్రి మధ్యాహ్నం 1.18 నిమిషాలకు వచ్చారు. ఆమె రాకకు సంబంధించి కచ్చితమైన సమాచారం తెలియకపోవటంతో ఆలయ ప్రాంగణంలో క్యూలను గంటల తరబడి నియంత్రించాల్సి వచ్చింది. ఆదివారం కావటంతో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో క్యూల్లో గత మూడు రోజుల కంటే ఎక్కువ రద్దీ కనిపించింది. దీనికి తోడు క్యూలను నియంత్రించటం వల్ల భక్తులతో క్యూలు కిక్కిరిసిపోయాయి.


భక్తుల ఆగ్రహం 

హోం మంత్రి మధ్యాహ్నం 1.18 గంటలకు రాగా, ఆమెను ఆలయ లాంఛనాలతో తీసుకువెళ్లి అమ్మవారి దర్శనం చేయించారు. వేద పండితుల ఆశీర్వచనం తర్వాత ఆమె మీడియా బ్లాక్‌కు వచ్చారు. ఆమె మాట్లాడుతున్న సమయంలోనే రూ.300 టికెట్‌ తీసుకున్న భక్తులు క్యూలో వెళుతూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రూ.300 చెల్లించి టికెట్లు తీసుకున్న భక్తులు ఎన్ని గంటలు ఇబ్బందులు పడాలంటూ బిగ్గరగా అరిచారు. అక్కడే ఉన్న పోలీసులు వారించినా, వారు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే హోం మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 



Updated Date - 2021-10-11T06:06:14+05:30 IST