నిత్యానందకరీ.. సిరీ..!

ABN , First Publish Date - 2021-10-12T06:40:07+05:30 IST

నిత్యానందకరీ.. మాతాన్నపూర్ణేశ్వరీ!.. అంటూ ఉదయం అమ్మవారిని కొలిచిన భక్తులు.. మధ్యాహ్నం నుంచి అష్టలక్ష్మీరూపంలో కొలువుదీరిన అమ్మ దివ్యమంగళ రూపాన్ని తిలకించి తరించారు.

నిత్యానందకరీ.. సిరీ..!
అన్నపూర్ణ, మహాలక్ష్మీదేవి అలంకారాల్లో అమ్మవారు

అన్నపూర్ణ, మహాలక్ష్మీదేవి అలంకారాల్లో దుర్గమ్మ దర్శనం

భారీగా వచ్చిన భక్తజనం

నేడు పట్టువస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి

ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికారులు 


నిత్యానందకరీ.. మాతాన్నపూర్ణేశ్వరీ!.. అంటూ ఉదయం అమ్మవారిని కొలిచిన భక్తులు.. మధ్యాహ్నం నుంచి అష్టలక్ష్మీరూపంలో కొలువుదీరిన అమ్మ దివ్యమంగళ రూపాన్ని తిలకించి తరించారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదో రోజున అమ్మవారు రెండు అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. నిత్యానందకరిగా, వరదాభయహస్త రూపిణిగా కొలువైన దుర్గమ్మను విశేష నామాలతో భక్తులు పూజించారు. మంగళవారం అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నది. ఆనవాయితీ ప్రకారం ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఇంద్రకీలాద్రిపై వైభవంగా కొనసాగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదో రోజైన సోమవారం దుర్గమ్మ రెండు అవతారాల్లో భక్తులకు దర్శనమిచ్చింది. ఆశ్వయుజ శుద్ధ పంచమి, షష్ఠి తిథులు రెండూ ఒకేరోజు రావడంతో ఆలయ వేదపండితులు అమ్మవారికి రెండు అలంకారాలు చేశారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. బంగారు పాత్రలోని అన్నాన్ని.. వజ్రాలు పొదిగిన గరిటెతో ఈశ్వరుడికి భిక్షగా సమర్పిస్తున్న అమ్మవారి రూపాన్ని భక్తులు గుండెనిండా నింపుకున్నారు. అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే అన్నపానాదులకు లోటు ఉండదని విశ్వసించే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. 

మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మహాలక్ష్మీదేవిగా అనుగ్రహమిచ్చిన అమ్మవారిని భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. అష్టలక్ష్మీరూపంలో అమ్మ దివ్యమంగళ రూపాన్ని తిలకించి తరించారు. మధ్యాహ్నం అమ్మవారి అలంకారాన్ని మార్చడం కోసం 12 నుంచి 2 గంటల వరకు దర్శనాలను నిలిపివేశారు. అప్పటికే వచ్చేసిన భక్తులు ఆ రెండు గంటలూ క్యూలైన్లలోనే పడిగాపులు కాస్తూ ఇబ్బందులు పడ్డారు. ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు మహామండపం ఆరో అంతస్థులో నిర్వహించిన విశేష కుంకుమార్చన, హోమశాలలో ఉదయం ఎనిమిది గంటల నుంచి నిర్వహించిన శతచండీహోమం, శ్రీచక్ర నవావర్ణార్చన తదితర ఆర్జిత పూజల్లో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకు అమ్మవారికి మహానివేదన, పంచహారతుల సేవ ముగిసిన అనంతరం ప్రదోష కాలంలో గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగిస్తూ నిర్వహించిన పల్లకీ సేవ వైభవంగా సాగింది. సాయంత్రం మహామండపం ఆరో అంతస్థులో నిర్వహించిన వేద విద్వత్సభలో వేదపండితులను సత్కరించారు. 


నేడు మూలా నక్షత్రం.. సరస్వతీ దేవిగా దుర్గమ్మ 

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు కీలక దశకు చేరుకున్నాయి. మంగళవారం అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం. అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో దర్శనమివ్వనున్నారు. భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చే అవకాశమున్నందున సోమవారం అర్ధరాత్రి రెండు గంటల నుంచి దర్శనాలకు అవకాశం కల్పించారు. ఆనవాయితీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఇంద్రకీలాద్రికి చేరుకుని, అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు. 

Updated Date - 2021-10-12T06:40:07+05:30 IST