Abn logo
Jul 8 2020 @ 00:00AM

అమ్మకు జన్మనిచ్చింది!

ఒక్కగానొక్క దిక్కయిన తన తల్లి ప్రాణాంతకమైన అనారోగ్యంతో ఉందని తెలిసి ఆమె తల్లడిల్లిపోయింది. అమ్మను బతికించుకోవాలన్న ఆమె తపన ఎందరినో కదిలించింది. 18 లక్షల కోసం  ఆమె అభ్యర్థిస్తే ఒక్క రోజులో ఏకంగా 89 లక్షలు వచ్చి పడ్డాయి. రక్తం పంచిన తల్లికి తన కాలేయాన్ని పంచి, అమ్మకు పునర్జన్మనిచ్చింది... కేరళ  అమ్మాయి వర్ష.


‘‘నా జీవితంలో ఎన్నటికీ మరచిపోలేని రోజది. మా అమ్మను పరీక్షించిన వైద్యులు చెప్పిన మాట విని నాకు కాళ్ళూ చేతులూ ఆడలేదు. అంతా శూన్యంగా అనిపించింది. నాకు ఉన్న లోకంలో ఉన్న ఒకే ఒక్క అండ మా అమ్మ. ఆమె నాకిక దక్కదా? అనే ఆందోళనతో, ఆవేదనతో నా గుండె బరువెక్కిపోయింది’’ అని ఆ దుర్భరమైన జ్ఞాపకాన్ని వర్ష గుర్తు చేసుకుంది.

ఇరవై రెండేళ్ళ వర్షది కేరళలోని కన్నూరు జిల్లా కక్కతోడు. తోబుట్టువులు, దగ్గరి బంధువులు లేని ఆమెకు తల్లి రాధే సర్వస్వం. తండ్రి చాలా ఏళ్ళ క్రితమే వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నలభై ఆరేళ్ళ రాధ ఒక ఐస్‌క్రీమ్‌ దుకాణంలో పని చేస్తూ ఉంటారు. వర్ష డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతోంది. చదువయ్యాక ఏదైనా ఉద్యోగంలో చేరి, తల్లిని బాగా చూసుకోవాలన్నది ఆమె లక్ష్యం.

అయితే మూడు నెలల కిందట ఊహించని సమస్య వారికి ఎదురైంది. రాధకు సుస్తీ చేయడంతో కన్నూరులోని పరియరామ్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి వెళ్ళారు. ఆమెకు హెపటైటిస్‌-ఎ ఉందని వైద్యులు నిర్ధారించారు. చికిత్స తీసుకున్నా ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. ఆమె కాలేయం పనితీరు క్షీణిస్తూ వచ్చింది. దీంతో కొచ్చిలోని అమృత ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)కు రిఫర్‌ చేశారు. ఎయిమ్స్‌లో ఇరవై రోజులకు పైగా రాధ చికిత్స చేయించుకున్నా ఫలితం కనిపించలేదు. కాలేయం సరిగ్గా పని చెయ్యకపోవడంతో రాధకు కామెర్లు వచ్చాయనీ, ఆమెకు అత్యవసరంగా సర్జరీ చేయాలనీ, అదీ మూడు రోజుల్లో జరగాలనీ, లేకపోతే రాధ బతకడం కష్టమనీ ఎయిమ్స్‌ నిపుణులు జూన్‌ 22న తేల్చేశారు. వర్ష మీద పిడుగుపడ్డట్టయింది.పధ్నాలుగు గంటల్లోనే...

ఆ సమయంలో ఆ తల్లీకూతుళ్ళ దగ్గర పదివేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. తెలిసినవారిని అడిగి వర్ష మరో లక్ష రూపాయలు పోగు చేసింది. కానీ శస్త్రచికిత్సకు దాదాపు ఇరవై లక్షలు అవసరం! ఈ ప్రపంచంలో తనకంటూ ఉన్న ఏకైక వ్యక్తిని పోగొట్టుకోవాల్సి వస్తోందని వర్ష కన్నీరుమున్నీరయింది.  ఈ సమయంలో రాధను పలకరించడానికి వచ్చిన ఆమె బంధువు బీనాకు సమస్య అర్థమైంది. ఆమె, ఆమెకు పరిచయస్తులైన త్రిచ్సూర్‌కు చెందిన ఛారిటీ వర్కర్లు సజ్జన్‌, ఫిరోజ్‌లు క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా డబ్బు సమకూర్చాలన్న ఆలోచన చేశారు.  వర్షను కలుసుకొని, ఆమె అభ్యర్థనను రికార్డ్‌ చేసి, జూన్‌ 24వ తేదీ తెల్లవారుజామున మూడు గంటలకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. రాధ ఆపరేషన్‌కు అవసరమైన మొత్తం సమకూరితే చాలని వారనుకున్నారు. కానీ అనూహ్యంగా మొదటి పధ్నాలుగు గంటల్లోనే వర్ష తల్లి ఖాతాలో యాభై లక్షలు జమ అయ్యాయి. ఇక ఎవరూ డబ్బు పంపవద్దని సజ్జన్‌ దాతలకు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి మొత్తాలూ స్వీకరించ వద్దని బ్యాంకును కోరారు. అయినా ఆ ఖాతాను బ్యాంక్‌ ఖాతాను మూసివేసే సమయానికి రాధ ఖాతాలో 89 లక్షల వరకూ జమ అయ్యాయి. 


శస్త్రచికిత్సకు సమయం తక్కువగా ఉండడంతో దాతల కోసం వెతకకుండా తన కాలేయంలో కొంత భాగాన్ని తల్లికి ఇవ్వడానికి వర్ష ముందుకు వచ్చింది. దీంతో ఆపరేషన్‌కు అన్ని ఆటంకాలూ తొలగిపోయాయి. జూన్‌ 25న ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ పదకొండు గంటల సేపు రాధకు శస్త్ర చికిత్స నిర్వహించారు. సర్జరీ విజయవంతమయిందనీ, తల్లీ కూతురు కోలుకుంటున్నారనీ వైద్యులు ప్రకటించారు.


వర్షకు సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయినవాళ్ళను ఎలాగైనా కాపాడుకోవాలన్న వర్ష తపనే ఆమె తల్లిని బతికించిందంటూ ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి. శస్త్రచికిత్సకు ముందు సోషల్‌ మీడియా లైవ్‌లోకి వచ్చిన వర్ష కళ్ళల్లో నీరు తెరల్లా కదిలింది. తమకు సాయపడిన ప్రతి ఒక్కరికీ సోషల్‌ మీడియాలో ఆమె ధన్యవాదాలు చెప్పింది. ‘‘చదువు పూర్తిచేసి, ఉద్యోగంలో చేరి, మా అమ్మను బాగా చూసుకుంటా. ఎంతోమంది మాకు సాయం చేసినట్టే ఆవసరంలో ఉన్నవారిని ఆదుకోవడానికి ప్రయత్నిస్తా’’అంటోంది వర్ష. మానవత్వం అంటే అదే కదా!


Advertisement
Advertisement
Advertisement