చదువుకోమని పదే పదే చెబుతున్న తల్లిపై ఆగ్రహం.. ఆ 16 ఏళ్ల బాలిక చేసిన దారుణమిది..!

ABN , First Publish Date - 2021-08-11T01:41:46+05:30 IST

కూతుర్ని డాక్టర్‌గా చూడాలనేది ఆ తల్లి కోరిక. అందుకే ఆమెను బాగా చదవాలంటూ పదే పదే చెప్పేది. కుమార్తె బంగారు భవిష్యత్తు కోసం కలలు కనడమే ఆమె పాలిట శాపంలా మారింది.

చదువుకోమని పదే పదే చెబుతున్న తల్లిపై ఆగ్రహం.. ఆ 16 ఏళ్ల బాలిక చేసిన దారుణమిది..!

ఇంటర్నెట్ డెస్క్: కూతుర్ని డాక్టర్‌గా చూడాలనేది ఆ తల్లి కోరిక. అందుకే ఆమెను బాగా చదవాలంటూ పదే పదే చెప్పేది. కుమార్తె బంగారు భవిష్యత్తు కోసం కలలు కనడమే ఆమె పాలిట శాపంలా మారింది. ఏ కూతురి కోసం కలలు కంటోందో ఆ కుమార్తే ఆమె పాలిట యమదూతలా మారింది. చదువుకోమని ఒత్తిడి తెస్తున్న తల్లి పీకపిసికి చంపేసింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నవీ ముంబైలో వెలుగు చూసింది. ఇక్కడి ఏరోలీ ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్లో నివసించే శిల్పా జాదవ్ అనే మహిళ ఇంటి తలుపులు తెరవడం లేదు. ఆమె కోసం ఇంటికి వచ్చిన సోదరుడు శైలేష్ పవార్‌కు ఇది అనుమానం కలిగించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.


సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సదరు అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. చుట్టుపక్కల వారి సాయంతో శిల్ప ఫ్లాట్ తలుపులు తీశారు. అక్కడ హాల్లో శిల్ప పెద్ద కుమార్తె(16), కుమారుడు (6) కూర్చొని ఉన్నారు. అయితే బెడ్రూం తలుపులు కూడా బిగించి ఉంది. ఆ తలుపులు బద్దలు కొడితే లోపల శిల్ప స్పృహలేకుండా నేలపై పడి ఉంది. ఆమె మెడ చుట్టూ కరాటే విద్యార్థులు నడుంకు కట్టుకునే బెల్టు బిగించి ఉంది. శిల్పను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.


9 రోజులపాటు దర్యాప్తు చేసినా ఎటువంటి ఆధారాలూ పోలీసులకు దొరకలేదు. ఆ తర్వాత పోలీసులు గట్టిగా అడగడంతో 16 ఏళ్ల బాలిక నిజం చెప్పింది. తనను చదువుకోవాలని తల్లి బాగా ఒత్తిడి చేసిందని అందుకే ఆమెను చంపేశానని షాకింగ్ నిజం బయటపెట్టింది. కరాటే బెల్టుతో తల్లి పీకపిసికి చంపినట్లు అంగీకరించింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2021-08-11T01:41:46+05:30 IST