మా అత్తగారికి బాయ్‌ఫ్రెండ్ కావలెను.. ఓ కోడలి వింత ప్రకటన!

ABN , First Publish Date - 2021-07-21T21:35:32+05:30 IST

పెళ్లి ప్రకటనలను మనం తరచుగా దిన పత్రికల్లో చూస్తుంటాం.

మా అత్తగారికి బాయ్‌ఫ్రెండ్ కావలెను.. ఓ కోడలి వింత ప్రకటన!

పెళ్లి ప్రకటనలను మనం తరచుగా దిన పత్రికల్లో చూస్తుంటాం. అయితే ఓ మహిళ ఏకంగా `బాయ్‌ఫ్రెండ్ కావాలి` అంటూ ప్రకటన ఇచ్చింది. అయితే ఆ బాయ్‌ఫ్రెండ్ తన కోసం కాదట.. తన అత్తగారి కోసమట. అంతేకాదు తన అత్తగారి పక్కన బాయ్‌ఫ్రెండ్‌గా నిలబడే వ్యక్తికి ఉండాల్సిన అర్హతలను కూడా ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఈ ప్రకటన నెట్టింట వైరల్‌గా మారింది. 


న్యూయార్క్‌లోని హడ్సన్ వ్యాలీకి చెందిన ఓ మహిళ తన అత్తగారి కోసం ఈ ప్రకటన ఇచ్చింది. తన అత్తగారికి బాయ్‌ఫ్రెండ్ కాబోయే వ్యక్తి వయసు 40 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉండాలని, అతనికి డ్యాన్స్ వచ్చుండాలని, అలాగే చక్కగా మాట్లాడే నేర్పు ఉండాలని పేర్కొంది. కేవలం రెండ్రోజులకు మాత్రమే బాయ్‌ఫ్రెండ్‌గా ఉంటే సరిపోతుందని ఆ ప్రకటనలో పేర్కొంది. ఆ రెండ్రోజులకు 960 డాలర్లు (సుమారు 70 వేల రూపాయలు) చెల్లిస్తామని తెలిపింది. 


ఇంతకీ ఆ మహిళ అత్తగారికి ఇప్పుడు బాయ్‌ఫ్రెండ్ అవసరం ఏమొచ్చిందంటే.. సదరు మహిళ కుటుంబం త్వరలో ఓ స్నేహితురాలి వివాహానికి హాజరుకాబోతోందట. అక్కడ తన అత్తగారు ఒంటరిగా బోర్‌ ఫీల్‌ కాకూడదనే ఉద్దేశంతో ఆమెకు ఓ బాయ్‌ఫ్రెండ్‌ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసినట్టు కోడలు తెలిపింది. కాగా, ఈ ప్రకటనకు స్పందన కూడా బాగానే ఉందట. రెండ్రోజులకు వెయ్యి డాలర్లు వస్తుండడంతో పలువురు దరఖాస్తు చేసుకుంటున్నారట.

Updated Date - 2021-07-21T21:35:32+05:30 IST