సొంతలాభం కొంత మానుకు.. సామెత నిజం చేస్తున్న రైతు!

ABN , First Publish Date - 2020-08-15T20:28:38+05:30 IST

సొంతలాభం కొంతమానుకు పొరుగువాడికి తోడుపడవోయ్ అన్నారు గురజాడ. కర్నాటకలోని ఓ రైతు అచ్చం ఈ సామెత నిజం చేస్తూ ఆదర్శంగా..

సొంతలాభం కొంత మానుకు.. సామెత నిజం చేస్తున్న రైతు!

బెంగళూరు: సొంతలాభం కొంతమానుకు పొరుగువాడికి తోడుపడవోయ్ అన్నారు గురజాడ. కర్నాటకలోని ఓ రైతు అచ్చం ఈ సామెత నిజం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పండిన పంటలో పక్షులు తినగా మిగిలింది మాత్రమే తాను తీసుకుంటూ తనదైన ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. దేవణగిరి సమీపంలోని షమనూర్ గ్రామంలో రైతు సంకోల్ చంద్రశేఖర్ చూపిస్తున్న ఔదార్యంపై ప్రకృతి ప్రేమికులు, మానవతావాదుల నుంచి విశేష ప్రశంసలు అందుతున్నాయి. ఆయన మొత్తం 3 ఎకరాల పొలంలో జొన్నలు పండిస్తున్నారు. ఇందులో చాలా వరకు పంటను పిచ్చుకలు, పావురాలు, చిలుకలు, కోకిలలు, కింగ్‌ఫిషర్ పక్షలు, వడ్రంగిపిట్టలు తినేస్తున్నాయి. అయితే దీనిపై చంద్రశేఖర్ మాట్లాడుతూ..


‘‘విత్తనాలు, ఎరువులు కొనడానికి, కూలీలకు దాదాపు 20 వేలు ఖర్చు అవుతుంది. మొత్తం 50 క్విటాళ్లు పండిస్తే రూ. 1.5 లక్షలు వస్తాయి. కానీ పక్షులన్నీ పెద్ద సంఖ్యలో ఆహారం కోసం ఇక్కడికి రావడం చూస్తే కలిగే ఆ ఆనందం, తృప్తి వెలకట్టలేనిది..’’ అని పేర్కొన్నారు. తాను రోజు రెండు సార్లు పక్షలను చూసేందుకు పొలానికి వెళ్తాననీ.. తన భార్యా పిల్లలను కూడా అక్కడికి తీసుకెళ్లి వాటిని చూపిస్తానని ఆయన తెలిపారు. దేవణగిరి సీఎంసీలో కౌన్సిలర్‌గా కొనసాగుతున్న చంద్రశేఖర్‌ దాతృత్వంలో కూడా ముందుంటారని స్థానికులు చెబుతారు. 2016లో ఈ ప్రాంతంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నప్పుడు ఆయన అనేక వార్డుల్లో స్వయంగా మంచినీటి సరఫరా చేశారు.

Updated Date - 2020-08-15T20:28:38+05:30 IST