గంగలో కలిసిపోయిన విశాఖ జిల్లా దేవదాయ శాఖ పరువు!

ABN , First Publish Date - 2021-08-06T05:42:18+05:30 IST

దేవదాయ శాఖ పరువు గంగలో కలిసిపోయింది...

గంగలో కలిసిపోయిన విశాఖ జిల్లా దేవదాయ శాఖ పరువు!

డీసీ... ఏసీ

దేవదాయ శాఖలో విభేదాలు

హుండీల సొమ్ము పక్కదారి పట్టిందనే ఆరోపణలపై అనకాపల్లి ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేసిన డిప్యూటీ కమిషనర్‌

హుండీల లెక్కింపు అనంతరం తాళాలు సకాలంలో అందజేయలేదని విశాఖపట్నం డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేసిన అసిస్టెంట్‌ కమిషనర్‌

ఈ నేపథ్యంలోనే డీసీపై ఊహించనివిధంగా ఏసీ దాడి


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): జిల్లా దేవదాయ శాఖ పరువు గంగలో కలిసిపోయింది. గురువారం ఉదయం డీసీ తన కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశంలో ఉండగా, ఏసీ శాంతి చాంబర్‌లోకి ప్రవేశించి, చేతితో తెచ్చిన ఇసుకను ఆయన ముఖంపై విసిరి దుర్భాషలు ఆడడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు డీసీ తెలపగా, తనను ఆయన మానసికంగా వేధిస్తున్నారని ఏసీ ఆరోపించారు. 


భక్తులకు, భగవంతునికి మధ్య అనుసంధానంగా వుండాల్సిన దేవదాయ శాఖ ఇటీవల కాలంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. పలు ఆలయాల్లో హుండీల లెక్కింపు సమయంలో నగదు పక్కదారి పట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించి, ముందుగా అనకాపల్లి ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరాజును సస్పెండ్‌ చేశారు. శ్రీనివాసరాజు కేవలం అనకాపల్లి డివిజన్‌కు ఇన్‌స్పెక్టర్‌ కాగా...అత్యున్నత స్థాయిలో విజయనగరం మాన్సాస్‌ ట్రస్ట్‌, సింహాచలం దేవస్థానం భూములపై ప్రత్యేక కమిటీ విచారణ ఏర్పాటుచేస్తున్న సమావేశాలకు హాజరు కావడంపై డిప్యూటీ కమిషనర్‌ పుష్పవర్దన్‌ ఆగ్రహం వ్యక్తంచేసి చార్జిమెమోలు ఇచ్చారు. ఏ అధికారంతో ఆ సమావేశాలకు వచ్చారో వివరణ ఇవ్వాలని డీసీ కోరారు. అయితే ఆయన అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి వర్గమని ఆ శాఖలో ప్రచారం ఉంది. రాజుపై సస్పెన్షన్‌ వేటు పడ్డాక ఆ శాఖలో గొడవలు మరింత ముదిరిపోయాయి. కొద్దిరోజులకే విశాఖపట్నం డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ను ఏసీ శాంతి సస్పెండ్‌ చేశారు. ఆలయ హుండీల లెక్కింపు కాగానే తాళాలు అప్పగించకుండా జాప్యం చేశారనే ఆరోపణలతో విధుల నుంచి తప్పించారు. ఆయన డీసీ పుష్పవర్దన్‌ వర్గానికి చెందిన మనిషని ప్రచారం జరిగింది. ఇలా సస్పెన్షన్లు, వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోవడానికి పైస్థాయిలో ప్రయత్నాలు చేయడంతో విభేదాలు అమరావతి వరకు వెళ్లాయి. వీటిని చక్కదిద్దాల్సిందిగా రాజమండ్రి ఆర్‌జేసీకి నాటి కమిషనర్‌ అర్జునరావు బాధ్యతలు అప్పగించారు. అయితే ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడడం కుదరలేదు. 


దాడి చేస్తారని ముందే ప్రచారం

డీసీ పుష్పవర్దన్‌ వారానికి మూడు రోజులే విశాఖపట్నంలో ఉంటున్నారు. సింహాచలం, మాన్సాస్‌ ట్రస్టు పనుల వల్ల గత నెల 14 నుంచి ఆయన విశాఖపట్నంలో కార్యాలయానికి రాలేదు. ఇన్‌స్పెక్టర్‌ రాజును సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో డీసీ విశాఖపట్నం వస్తే తగిన బుద్ధి చెబుతానని ఏసీ శాంతి శపథం చేశారని, ఈ రోజు ఆచరణలో చూపించారని ఆ శాఖ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ విషయం ఆయన వరకు వెళ్లడం వల్లనే ఇన్ని రోజులు విశాఖపట్నం రాకుండా వున్నారని సమాచారం.  


సొంత పనులకు ఉద్యోగులు

ఈ శాఖలో పలువురు అధికారులు ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను సొంత పనిమనుషులుగా ఉపయోగించుకుంటున్నారు. ఇంట్లో పిల్లలను ఆడించడానికి, వంట చేయడానికి, హోటళ్ల నుంచి టిఫిన్లు, భోజనాలు తేవడానికి, వాహనం నడపడానికి ఉద్యోగులను వాడుకుంటున్నారు. ఓ ఆలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తికి రూ.40 వేల జీతం. ఆయన్ను వాహనం డ్రైవర్‌గా తిప్పుకుంటున్నారు. ఎవరైనా అడిగితే...పరిపాలనా సౌలభ్యం కోసం ఉద్యోగులను ఉపయోగించుకునే అధికారం వుందని చెబుతున్నారు. ప్రభుత్వం వాహన సౌకర్యం కోసం నెలకు రూ.35 వేలు ఇస్తుంది. అందులోనే కారు అద్దె, డ్రైవర్‌ జీతం, పెట్రోల్‌/డీజిల్‌ అలవెన్స్‌ ఉంటాయి. ఇలాంటి వాహనానికి రూ.40 వేలు జీతం తీసుకునే ఉద్యోగిని డ్రైవర్‌గా వినియోగించుకుంటున్నారు. 


అధికారులు ఎక్కిడికి వెళ్లినా రాచమర్యాదలు

ఈ శాఖలో అధికారులు వారి పరిధిలోని ఆలయాలను, భూములను, హుండీల లెక్కింపును పరిశీలించడానికి వెళుతుంటారు. ఈ బృందంలో ముగ్గురు నుంచి నలుగురు ఉంటారు. వీరికి అక్కడ ఈఓలు రాచమర్యాదలు చేయాలి. లంబసింగి, అరకులోయ వంటి పర్యాటక ప్రాంతాలైతే...కాటేజీ బుక్‌ చేసి పెట్టాలి. తిరిగి బయలుదేరే ముందు దక్షిణలు సమర్పించుకోవాలి. ఇదో దుష్ట సంప్రదాయంగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యేక ఉత్సవాల సమయమైతే ఇంకాస్త దక్షిణ పెంచి ఇవ్వాలని, పురుష అధికారులైతే పట్టుపంచె, లాల్చీలు, మహిళా అధికారులైతే పట్టుచీరలు కూడా పెట్టి మర్యాదలు చేయాల్సి ఉంటుందంటున్నారు. అధికారుల పర్యటన అంటే...కనీసం రూ.25 వేలు ఖర్చు అవుతుందని ఈఓలు చెబుతున్నారు. ఇటీవల జగన్నాథ ఉత్సవాలు జరిగినప్పుడు కూడా ఇలాంటి మర్యాదలే చేశామని పలువురు సిబ్బంది తెలిపారు.

Updated Date - 2021-08-06T05:42:18+05:30 IST