డీసీసీబీ విస్తరణ

ABN , First Publish Date - 2020-12-05T06:09:16+05:30 IST

ప్రతి మండల కేంద్రంలో సహకార బ్యాంకు శాఖ నెలకొల్పాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) యోచిస్తోంది. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో రైతులకు మరింత చేరువ కావాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.

డీసీసీబీ విస్తరణ
అనకాపల్లిలో డీసీసీబీ బ్రాంచి

మండలానికొక సహకార బ్యాంకు శాఖ

తొలి దశలో తొమ్మిది

రిజర్వు బ్యాంకుకు ప్రతిపాదనలు

నగరీకరణతో సొసైటీలకు వ్యాపారం నిల్‌


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ప్రతి మండల కేంద్రంలో సహకార బ్యాంకు శాఖ నెలకొల్పాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) యోచిస్తోంది. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో రైతులకు మరింత చేరువ కావాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. గతంతో పోల్చితే రైతులు వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు చేస్తున్నారు. అటువంటి రైతులకు రుణాలు అందించడం ద్వారా వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. 


డీసీసీబీకి ప్రస్తుతం జిల్లాలోని గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో 17, నగర పరిధిలో 13...మొత్తం 30 బ్రాంచీలు ఉన్నాయి. 14 మండలాల్లో బ్రాంచీలు లేవు. ఈ నేపథ్యంలో మైదాన ప్రాంతంలో పద్మనాభం, పరవాడ, రాంబిల్లి, ఎస్‌.రాయవరం, నక్కపల్లి, బుచ్చెయ్యపేట, రోలుగుంట, మాకవరపాలెం, ఏజెన్సీలో చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు, పెదబయలు, ముంచంగిపుట్టు, అరకులోయల్లో కొత్తగా బ్రాంచీల ఏర్పాటు కోసం రిజర్వు బ్యాంకుకు ప్రతిపాదనలు పంపించారు. రిజర్వు బ్యాంకు నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా మైదానంలో ఎనిమిది, ఏజెన్సీలోని చింతపల్లిలో శాఖలు నెలకొల్పనున్నారు. ప్రస్తుతం డీసీసీబీ రుణాలు, డిపాజిట్లతో కలిపి రూ.1700 కోట్ల వ్యాపారం చేస్తోంది. అయితే 2020-21 సంవత్సరాంతానికి రూ.2000 కోట్ల వ్యాపార లక్ష్యంగా నిర్ణయించడంతో కొత్త బ్రాంచీలు ఏర్పాటుచేయాలని ప్రతిపాదించింది. జిల్లాలో అత్యధికంగా అనకాపల్లి బ్రాంచీ రూ.270 కోట్ల వ్యాపారంతో మొదటి స్థానంలో ఉంది. నగరంలో కొన్ని బ్రాంచీలు రూ.100 కోట్లకు అటుఇటుగా వ్యాపారం చేస్తున్నాయి. డిపాజిట్ల సేకరణలో అనకాపల్లి, రుణాల మంజూరులో చోడవరం శాఖలు ముందంజలో ఉన్నాయి. నగరంలో వ్యాపారం తక్కువగా వున్న శాఖలను వాణిజ్య కార్యకలాపాలు ఎక్కువగా వుండే ప్రాంతాలకు మార్చాలని ప్రతిపాదనలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటుచేసే బ్రాంచీలలో ఉద్యోగాల భర్తీ ఐబీపీఎస్‌ పరీక్ష ద్వారా చేపట్టనున్నారు. సహకార బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలకు రాజకీయ సిఫారసులు ఎక్కువగా వున్న నేపథ్యంలో రిజర్వు బ్యాంకు ఆదేశాలతో ఐబీపీఎస్‌ ద్వారా తీసుకుంటున్నారు. 


నగరీకరణతో రెండు సొసైటీల్లో వ్యాపారం నిల్‌

జిల్లాలో మొత్తం 96 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయు. వీటిలో 39 సొసైటీలు లాభాల్లో వుండగా, మిగిలినవి నష్టాల్లో నడుస్తున్నాయి. మైదాన ప్రాంతంలో పలు సొసైటీలు వ్యాపారంలో ముందంజలో ఉన్నాయి. ఒకప్పుడు మంచి వ్యాపారం చేసిన కొత్తపాలెం (గోపాలపట్నం), మధురవాడ సొసైటీల్లో ప్రస్తుతం వ్యాపారమే లేదు. నగరీకరణతో వ్యవసాయ భూముల్లో కాలనీలు అభివృద్ద్ధి చెందాయి. ఈ నేపథ్యంలో కొత్తపాలెం, మధురవాడ సొసైటీల్లో సభ్యులుగా రైతులు లేకపోవడంతో వ్యాపార కార్యకలాపాలు చాలాకాలంగా నిలిచిపోయాయి. తగరపువలస సొసైటీలో కొద్దిమంది సభ్యులున్నా చెప్పుకోదగ్గ వ్యాపారం జరగడం లేదు. భవిష్యత్తులో లంకెలపాలెం, పెందుర్తి, మరికొన్ని సొసైటీల పరిస్థితి ఇదే మాదిరిగా వుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విచిత్రమేమి టంటే రైతులు లేని కొత్తపాలెం, మధురవాడ సొసైటీల్లో సిబ్బంది మాత్రం ఇంకా కొనసాగుతున్నారు.

Updated Date - 2020-12-05T06:09:16+05:30 IST