అంతా మాఇష్టం!

ABN , First Publish Date - 2021-10-17T06:12:11+05:30 IST

పై అధికారులు కాదంటున్నా.. ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియో ఇచ్చేందుకే జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌(డీసీసీబీ) పాలకవర్గం సిద్ధమవుతోంది.

అంతా మాఇష్టం!

డీసీసీబీలో నిబంధనలు బేఖాతరు!

ఎక్స్‌గ్రేషియో ఇచ్చేందుకే మొగ్గు

కమిషనర్‌ ఇవ్వొద్దంటున్నా ముందుకే..

పాలకవర్గ తీరుపై సర్వత్రా చర్చ


మాకు ప్రభుత్వంతో పనిలేదు.. ఐఏఎస్‌ అధికారుల ఆదేశాలను అమలు చేయం.. ఇక్కడ మేం ఏంచేస్తే అదే చట్టం... వ్యతిరేకించే వారిని తొలగిస్తాం.. అనే ధోరణితో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ పాలకవర్గం వ్యవహరిస్తోంది. స్వయానా సహకార శాఖ కమిషనర్‌ ఆదేశాలిచ్చినా వాటిని తోసిపుచ్చి ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియో ఇచ్చేందుకు సిద్ధమైంది. దీనిపై పలువురు సొసైటీ అధ్యక్షులు మరోసారి కమిషనర్‌కు ఫిర్యాదు చేయటానికి సిద్ధమయ్యారు.   

 

(గుంటూరు - ఆంధ్రజ్యోతి) 

పై అధికారులు కాదంటున్నా.. ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియో ఇచ్చేందుకే జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌(డీసీసీబీ) పాలకవర్గం సిద్ధమవుతోంది. కొందరు సొసైటీ అధ్యక్షులు వ్యతిరేకించి డీసెంట్‌ నోటీసు ఇచ్చినా.. సహకార శాఖ కమిషనర్‌ బాబు ఆదేశాలిచ్చినా వాటిని తోసిపుచ్చుతున్నారు. ఉద్యోగులు, అధికారులకు ఎక్స్‌గ్రేషియో ఇస్తున్నట్లు తాజాగా బ్యాంకు చైర్మన్‌ లాలుపురం రాము లిఖితపూర్వకంగా తెలిపారు. ఇది సర్వత్రా చర్యనీయాంశమైంది. 

గతనెలలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్‌) రాయపూడి అధ్యక్షుడు మల్లెల హరీంద్రనాథ్‌ చౌదరి, ఇప్పటం అధ్యక్షుడు బాజిగంగాధరరావు ఎక్స్‌గ్రేషియో అంశాన్ని వ్యతిరేకిస్తూ డీసెంట్‌ ఇచ్చారు. నామినేటెడ్‌ పాలకవర్గం.. ఉద్యోగులు, అధికారుల సిఫారసులకే ప్రాధాన్యం ఇస్తోందని, రైతుల ప్రయోజనాలు తిలోదకాలిస్తున్నారని కమిషనర్‌ బాబుకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో ఫిర్యాదిదారులపె లాలుపురం రాము నిప్పులు చెరిగారు. బ్యాంక్‌లో రుణాల రికవరీని బుక్‌అడ్జెస్ట్‌తో పెంచుతున్నారు. దానిని లాభాలుగా చూపించి  ఏటా రూ.2 కోట్ల వరకు ఎక్స్‌గ్రేషియో రూపంలో అధికారులు, ఉద్యోగులకు పంచుతున్నారు. దీనివెనుకు ఆంధ్రాప్యారిస్‌ అధికారి, ఉద్యోగసంఘ నేత కీలకపాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 


గతంలోనూ ఆరోపణలు..

 పదేళ్ల నుంచి ఎక్స్‌గ్రేషియో అంశంపై పెద్దయెత్తున ఆరోపణలు వస్తున్నాయి. నిఘాసంస్థలు, సహకారశాఖ ఉన్నతాధికారులు దీనిని తప్పుపడుతున్నారు. నల్లపాటి చంద్రశేఖరరావు, ముమ్మనేని వెంకటసుబ్బయ్య హయాంలోని పాలకవర్గాలు ఎక్స్‌గ్రేషియో ఇచ్చాయి.  బ్యాంక్‌లో 15 ఏళ్లలో సుమారు రూ.వందకోట్ల వరకు బ్యాంక్‌ సొమ్ము స్వాహా అయినట్లు వివిధ దర్యాప్తుల్లో తేలింది. దీనిపై పలు సంస్థల దర్యాప్తు సాగుతోంది. 

 

మరోసారి ఫిర్యాదు చేసేందుకు..

 బ్యాంక్‌లో గత, ఇప్పటి ప్రభుత్వాల హయాంలోనూ కొందరిని పాలకవర్గాలు అదుపు చేయలేకపోతున్నటు హరీంద్రనాథ్‌ చౌదరి ఆరోపిస్తున్నారు. కమిషనర్‌ బాబు ఆదేశాలను తోసిపుచ్చి  ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలనుకోవడంపై  మరోసారి ఫిర్యాదు చేయటానికి ఆయన సిద్ధమయ్యారు. ఇప్పటికే పలు అంశాల్లో ఆయన చేసిన ఫిర్యాదు మేరకు లోకాయుక్త దర్యాప్తు ప్రారంభించింది. లోకాయుక్త కార్యాలయం కోరిన సమాచారాన్ని డీసీసీబీ ప్రధాన కార్యాలయం నుంచి పంపినట్లు అధికారులు తెలిపారు.  

Updated Date - 2021-10-17T06:12:11+05:30 IST