దోపిడీ కేసును ఛేదించిన ఘట్‌కేసర్‌ పోలీసులు

ABN , First Publish Date - 2021-01-17T04:40:04+05:30 IST

దోపిడీ కేసును ఛేదించిన ఘట్‌కేసర్‌ పోలీసులు

దోపిడీ కేసును ఛేదించిన ఘట్‌కేసర్‌ పోలీసులు
కేసు వివరాలను వెల్లడిస్తున్న మల్కాజ్‌గిరి డీసీపీ రక్షితాకృష్ణమూర్తి

ఘట్‌కేసర్‌ రూరల్‌: ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఈనెల 10న ఆభరణాల దోపిడీకి పాల్పడిన కేసును ఘట్‌కేసర్‌ పోలీసులు ఛేదించారు. మల్కాజ్‌గిరి డీసీపీ రక్షితాకృష్ణమూర్తి శనివారం కేసు వివరాలను వెల్లడించారు. నగరంలోని గోల్నాక, శ్రీలంక కాలనీలో నివాసముండే గడ్డమీది ప్రేమలత(45) స్థానికంగా ఉంటూ కూలిపనులు చేసుకుంటుంది. సాయంత్రం సమయంలో అమె కల్లు దుకాణంలో కల్లు సేవిస్తుంటుంది. బోడుప్పల్‌కు చెందిన పస్తం హరికృష్ణ (25) మరో ఇద్దరు మహిళలతో కలిసి ప్రేమలత ఒంటిపై ఆభరణాలను కాజేయాలని, పని ఇప్పిస్తామని నమ్మబలికారు. దారిమధ్యలో మద్యం సేవించారు. మద్యం మత్తులో ఆమె ఒంటిపై ఉన్న 4 తులాల పుస్తెలతాడు, చెవుల మాటీలు, కమ్మలు లాక్కొని ఆమెను అక్కడే వదిలేసి పారిపోయారు. చెవికమ్మలు బలవంతంగా లాగడంతో ప్రేమలత చెవులకు గాయాలయ్యాయి. గ్రామస్థుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న క్రైమ్‌ సీఐ జంగయ్య విచారణ చేపట్టి సీసీ కెమెరాల సహాయంతో నిందితులను గుర్తించారు. ఈనెల 15న బోడుప్పల్‌లోని లక్ష్మీ వైన్స్‌ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పస్తం హరికృష్ణ భార్య పస్తం రేణుక  సహాయంతో షాద్‌నగర్‌లోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో కుదువ పెట్టి డబ్బులు తీసుకున్నారు. దోపిడీకి పాల్పడిన హరికృష్ణ, సముద్రాల రేణుక, పస్తం రేణుకను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు తులాల బంగా రు పుస్తెలతాడు, చెవుల కమ్మలు, మాటీలతో పాటు రూ.5వేల నగదు, మూడు సెల్‌ఫోన్లు, బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ వెల్లడించారు. ఐదు రోజుల్లోనే కేసును ఛేదించిన సీఐ చంద్రబాబును, క్రైం సీఐ జంగయ్య, క్రైం సిబ్బంది శంకర్‌, కిరణ్‌, దేవులా, రాజశేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌, మహిళ కానిస్టేబుల్‌ రమ్యను డీపీసీతో పాటు ఏసీపీ శ్యామ్‌ప్రసాద్‌ అభినందించారు.

Updated Date - 2021-01-17T04:40:04+05:30 IST