ముగిసిన డెడ్‌ లైన్‌

ABN , First Publish Date - 2021-01-18T05:49:58+05:30 IST

జిల్లాలో ప్రధానంగా సాగయ్యే పత్తి పంట సాగుకు..

ముగిసిన డెడ్‌ లైన్‌
జైనథ్‌ మండలంలో పంటచేలల్లోనే కనిపిస్తున్న పత్తి పంట

పత్తి పంట కాలం పొడగింపు వద్దంటున్న సర్కారు 

గులాబీ రంగు పురుగు ఉధృతిపై సర్వత్రా ఆందోళన

ఇప్పుడే తొలగిస్తే నష్ట పోతామంటున్న రైతులు

గడువు ముగిసినందున పూర్తి చేయాలంటున్న అధికారులు

పెరుగుతున్న ధరలతో అన్నదాతల్లో ఆశలు

ఈయేడు లక్షా 44వేల హెక్టార్లలో పత్తి సాగు


ఆదిలాబాద్‌(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రధానంగా సాగయ్యే పత్తి పంట సాగుకు ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్‌ ముగిసిపోయినా.. కొందరు రైతులు పంటను తొలగించడమే లేదు. పంట కాలాన్ని  పొడగించవద్దంటూ వ్యవసాయ శాఖ అధికారులు పదే పదే చెబుతున్నారు.  యేటా జిల్లాలో పెరిగిపోతున్న గులాబీ రంగు పురుగు ఉధృతికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడమే లేదు. ఇప్పటికే డిసెంబర్‌ 31 తర్వాత పత్తి పంటను పూర్తిగా తొలగించేలా రైతుల్లో అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో ఈ యేడు లక్షా 44వేల హెక్టార్లలో పత్తి పంట సాగైంది. అయితే పెరిగిన సాగు విస్తీర్ణంతో జిల్లావ్యాప్తంగా ఈసారి 32 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే 60శాతం పంట చేతికి రావడంతో 20 లక్షలకు పైగా క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మిగితా 40 శాతం పంట మరో నెల రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు. రైతులు వివిధ పత్తి రకాలను సాగు చేయడంతో పంట చేతికి వచ్చే కాల పరిమితిలో కూడా భారీ వ్యత్యాసమే కనిపిస్తుంది. కొన్ని రకాల పత్తి రకం నీటి వసతిని బట్టి ధీర్ఘకాలం పాటు దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయకుండా, అదే పంట కాలాన్ని పొడగించడంతో అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని పంటను తొలగించేందుకు రైతులు ఆసక్తిని చూపడం లేదు. దీంతో ప్రతియేటా తీవ్ర పరిణామాలు ఎదురవుతున్నాయని వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గులాబీ రంగు పురుగు ఉధృతికి పంట కాలాన్ని పొడగించడమే ప్రధాన కారణమంటున్నారు. డిసెంబరుతో పత్తి పంట సాగు సమయం ముగిసి పోవడంతో ఇతర ఆరుతడి పంటలను సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.


పక్షం రోజులుగా పెరుగుతున్న ధరలు

ఈయేడు ప్రారంభంలో అంతంత మాత్రంగానే పలికిన పత్తి పంట ధరలు గత పక్షం రోజులుగా పైపైకి రావడంతో అన్నదాతల్లో మరిన్ని ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో నీటి వసతి ఉన్న రైతులు నీటి తడులను అందిస్తూ పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరో రెండు, మూడు నెలల పాటు పంటను కాపాడితే, అదనంగా ఆదాయంతో పాటు దిగుబడులు పెరిగే అవకాశం ఉందంటున్నారు. గతేడు చివరల్లో క్వింటాలు పత్తి ధర రూ.6 వేల వరకు ధర పలుకడంతో రైతులు పంట కాలాన్ని పొడగించారు. దీంతో ఈయేడు గులాబీ రంగు పురుగు ఉధృతి పెరిగిపోయి దిగుబడులపై ప్రభావం చూపిందంటున్నారు. ఈసారి మద్దతుధర రూ.5825 కావడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గుల కారణంగా ఈసారి కూడా ధరలు కలిసి రావడంతో పంటను తొలగించేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతుండడంతో కొందరు రైతులు పంట కాలాన్ని పొడగించేందుకే ఆసక్తిని చూపుతున్నారు. 


వద్దంటున్న వ్యవసాయ శాఖ అధికారులు

గులాబీ రంగు పురుగు ఉధృతి పెరిగిపోవడంతో పత్తి పంట కాలాన్ని పొడగించవద్దని వ్యవసాయ శాఖ అధికారులు పదే పదే చెబుతున్నారు. ధీర్ఘకాలం పాటు పంటను ఉంచడంతో గులాబీ రంగు పురుగు జీవిత కాలం పెరిగి, రాబోయే పంటలపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. పంట చేతికి రాగానే పత్తి కర్రలను తొలగించి దగ్ధం చేస్తే పురుగు ఉధృతి పూర్తిగా తగ్గే అవకాశం ఉందంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు రైతులు కూలీల కొరత కారణంగా పంటను తీయలేక పోతున్నారు. అలాగే పంటను తొలగించేందుకు కూడా ఖర్చు భారం పెరిగి పోవడంతో నిర్లక్ష్యంగానే వదిలేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న కారణాలతో పత్తి కర్రను తొలగించక పోవడంతో గులాబీ రంగు పురుగు ఉధృతికి మరింత కారణమవుతుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.


డిసెంబరు 31తో ముగిసిన గడువు

పత్తి సాగు సమయం ముగిసి పోవడంతో పంటను తొలగించాలని అధికారులు పేర్కొంటున్నారు. గత నెల 31తో గడువు సమయం ముగిసిపోవడంతో వ్యవసాయ శాఖాధికారులు హడావిడి చేస్తున్నారు. జనవరి మొదటి వారం నుంచి గ్రామాల్లో పర్యటించి రైతుల్లో అవగాహన కల్పిస్తామని చెబుతున్నారు. ఆ తర్వాత కూడా రైతులు పంటను తొలగించకుంటే కొంత కఠినంగానే వ్యవహరిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఇప్పుడే పత్తి కర్రలను తొలగించేందుకు సరైన సమయం కాదని రైతులు వాధిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం విధించిన గడువు సమయం ముగిసి పోవడంతో అటు అధికారులు, ఇటు అన్నదాతల్లో ఆందోళన కనబడుతుంది. పురుగు ఉధృతికి అడ్డుకట్ట వేసే మార్గాలను చూపకుండా  పంటను తొలగించాలని చెప్పడం సరైన పద్ధతి కాదని రైతులు పేర్కొంటున్నారు. 


రైతులూ.. ధీర్ఘకాలం పొడగించవద్దు: ఆశాకుమారి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి, ఆదిలాబాద్‌

గులాబీ రంగు పురుగు ఉధృతికి అడ్డుకట్ట వేయాలంటే పంటను తొలగించడమే సరైన పరిష్కార మార్గం. పంట కాలాన్ని ధీర్ఘకాలం పొడగిస్తే సమస్యలు తలెత్తుతాయి. దీనిపై రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం. పెరిగి పోతున్న పురుగు ఉధృతితో రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పత్తి కాలాన్ని పొడగించకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకుంటే దిగుబడులు కలిసి వస్తాయి. వేసవి కాలం కూడా మొదలుకానుండడంతో  ఆరుతడి పంటలను వేసుకుంటే మంచిది. 

Updated Date - 2021-01-18T05:49:58+05:30 IST