Abn logo
Sep 20 2021 @ 23:30PM

మరో పక్షం రోజులే!




ప్రొబేషనరీ పిరియడ్‌కు గడువు 

పూర్తికాని డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు

ఆందోళనలో వార్డు సచివాలయ ఉద్యోగులు

తాజాగా గ్రామ సచివాలయ ఉద్యోగుల పరీక్షకు నోటిఫికేషన్‌

(రాజాం)

‘ప్రొబేషనరీ సమయం పూర్తి కావడానికి మరో పక్షం రోజుల గడువే ఉంది. ఇంతవరకూ డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు పూర్తికాలేదు. అందులో ఉత్తీర్ణత సాధిస్తే కానీ ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ రాదు. అధికారులను అడుగుతుంటే ఉలుకూ పలుకూ లేదు’..అంటూ జిల్లాలోని 250 మంది వార్డు సచివాలయాల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల గ్రామ సచివాలయ ఉద్యోగుల డిపార్ట్‌మెంట్‌ పరీక్షకు ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీచేసిన ప్రభుత్వం.. వార్డు సచివాలయ ఉద్యోగుల విషయాన్ని ప్రస్తావించకపోవడంతో వారిలో భయం వెంటాడుతోంది. అసలు పరీక్ష నిర్వహిస్తారా? తమకు ఉద్యోగభద్రత ఉంటుందా? అన్న అనుమానాలు వారిని వెంటాడుతున్నాయి. దీనిపై అధికారులు మాత్రం ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు నిర్వహించామని చెబుతున్నారు. వారు సద్వినియోగం చేసుకోకపోతే ఎవరిది తప్పు అని తిరిగి ప్రశ్నిస్తున్నారు. దీంతో బాధితుల్లో ఆందోళన తీవ్రమవుతోంది. 

2019 అక్టోబరులో జిల్లా వ్యాప్తంగా 930 సచివాలయాలను ఏర్పాటుచేశారు. మొత్తం 8,056 మంది ఉద్యోగులను నియమించారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, రాజాం మునిసిపాల్టీలతో పాటు పాలకొండ నగర పంచాయతీ కార్యాలయంలో 95 వార్డు సచివాలయాలు కొనసాగుతున్నాయి. ఉద్యోగ నియామకాలు చేపట్టినప్పుడే రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌ ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం మూడు డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు నిర్వహిస్తామని.. ఆ ఉద్యోగికి నిర్దేశించిన పేపరులో ఉత్తీర్ణత సాధిస్తే ప్రొబేషనరీ డిక్లరేషన్‌ ఇస్తామని స్పష్టం చేశారు. ఈ లెక్కన గత ఏడాది మార్చి, నవంబరులో రెండుసార్లు డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు నిర్వహించాలి. కానీ సాంకేతిక, ఇతరత్రా కారణాలతో నిర్వహించలేదు. గత ఏడాది మార్చిలో నిర్వహించాల్సిన పరీక్షను ఈ ఏడాది మేలో, నవంబరులో నిర్వహించాల్సిన పరీక్షను ఆగస్టులో నిర్వహించారు. కానీ పరీక్షల నిర్వహణపై స్పష్టత లేకపోవడం, చాలామందికి సరైన అవగాహన లేక రాయలేకపోయారు. మరికొందరు విధి నిర్వహణలో బిజీగా ఉంటూ హాజరుకాలేకపోయారు. వార్డు సచివాలయాలకు సంబంధించి సుమారు 200 మందికిపైగా అర్హత సాధించలేదని తెలుస్తోంది. క్వాలిఫై కాని వారిలో గ్రామ సచివాలయ ఉద్యోగులు సైతం ఉన్నారు. ఇటువంటి వారి కోసం ఇటీవల డిపార్ట్‌మెంట్‌ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రస్తావన చేయలేదు. ఇదేమని అధికారులను అడుగుతుంటే మీరు పురపాలక శాఖ పరిధిలోకి వస్తారని చెబుతున్నారు. ఇప్పటికే రెండు పరీక్షలకు మీకు అవకాశమిచ్చామని గుర్తు చేస్తున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఒకసారి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో తాజాగా మరోసారి పరీక్షకు అవకాశం కల్పించామని చెబుతున్నారు. ప్రొబేషనరీ పిరియడ్‌కు పక్షం రోజుల గడువే ఉంది. ఈ నేపథ్యంలో తమకు ఒక్క అవకాశమివ్వాలని వార్డు సచివాలయ ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

ప్రభుత్వ ఆదేశాలు వస్తేనే...

వార్డు సచివాలయ ఉద్యోగుల డిపార్ట్‌మెంట్‌ పరీక్షల నిర్వహణపై ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. అక్టోబరు 2 లోపల వారికి ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ పూర్తిచేయాలి. తప్పనిసరిగా వారు నోటిఫికేషన్‌లో స్పష్టం చేసిన విధంగా పేపరు 8, 10 రాయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుకుంటాం.

-ఎంవీ నాగరాజు, ఇన్‌చార్జి కమిషనర్‌, రాజాం మునిసిపాల్టీ