గడువు 5 రోజులు.. నమోదు 48శాతమే

ABN , First Publish Date - 2021-05-26T06:26:33+05:30 IST

కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం జీవన్‌ జ్యోతి యోజన(పీఎంజేజేవై), పీఎం సురక్ష బీమా యోజన(పీఎంఎస్‌బీవై)లను కలిపి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ బీమా పేరుతో అమలు చేస్తోంది. బియ్యం కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులే. కానీ జిల్లాలో అర్హుల నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. సర్వే చేయడంలో 69 శాతం.. లబ్ధిదారుల దరఖాస్తులు ఆయా బ్యాంకుల్లో అందించడంలో 48 శాతంతో జిల్లా రాష్ట్రంలో తొమ్మిదో స్థానంలో ఉంది. జూన్‌ 1 నుంచి ఏడాది పాటు అమలులో ఉండే ఈ బీమా పథకానికి ఈ నెలాఖరుతో ప్రీమియం చెల్లింపు గడువు ముగుస్తుండడంతో సాధారణ, ప్రమాద మృతుల కుటుంబాలు పరిహారానికి దూరమయ్యే అవకాశం ఉంది.

గడువు 5 రోజులు.. నమోదు 48శాతమే

  వైఎస్సార్‌ బీమా పథకం నమోదు తీరు

చిత్తూరు, మే 25 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం జీవన్‌ జ్యోతి యోజన(పీఎంజేజేవై), పీఎం సురక్ష బీమా యోజన(పీఎంఎస్‌బీవై)లను కలిపి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ బీమా పేరుతో అమలు చేస్తోంది. బియ్యం కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులే. కానీ జిల్లాలో అర్హుల నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. సర్వే చేయడంలో 69 శాతం.. లబ్ధిదారుల దరఖాస్తులు ఆయా బ్యాంకుల్లో అందించడంలో 48 శాతంతో జిల్లా రాష్ట్రంలో తొమ్మిదో స్థానంలో ఉంది. జూన్‌ 1 నుంచి ఏడాది పాటు అమలులో ఉండే ఈ బీమా పథకానికి ఈ నెలాఖరుతో ప్రీమియం చెల్లింపు గడువు ముగుస్తుండడంతో సాధారణ, ప్రమాద మృతుల కుటుంబాలు పరిహారానికి దూరమయ్యే అవకాశం ఉంది. 


  జిల్లాలో బియ్యం కార్డులు: 11,54,156

  బీమా పథకం కోసం సర్వే చేసినవి: 7,99,423 (69%)

  బ్యాంకుల్లో అందజేసిన దరఖాస్తులు: 5,46,530 (48%)


  నత్తనడకన నమోదు ప్రక్రియ

వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి బీమా పథకానికి అర్హులను గుర్తించాలి. ఆ వివరాలను సచివాలయంలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఆ తర్వాత మరో డాక్యుమెంట్‌ తీసుకెళ్లి లబ్ధిదారుడితో సంతకాలు పెట్టించుకుని బ్యాంకులో అందించాలి. జిల్లాలో 11,54,156 బియ్యం కార్డులుండగా.. వీటిలో వలంటీర్లు 7,99,423 కార్డుదారులను సర్వే చేశారు. పలు నిబంధనల ప్రకారం 1,44,801 కార్డులు అర్హత సాధించలేదు. వీటిలో 5,07,597 దరఖాస్తులు గతంలోనే అప్‌లోడ్‌ చేయగా.. ఈసారి రెన్యువల్‌ అయ్యాయి. కొత్తగా సచివాలయాల్లో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ల లాగిన్‌ ద్వారా 3,18,635 దరఖాస్తులు నమోదయ్యాయి. వీటిలో 38,933 (12ు) మాత్రమే బ్యాంకులకు అందించారు. అంటే కొత్తవి, రెన్యువల్‌ కలిపి 5,46,530 దరఖాస్తులు బ్యాంకులకు అందాయి. వీటిని బ్యాంకుల్లో నమోదు చేసిన తర్వాత ప్రీమియం సొమ్ము బీమా కంపెనీలకు ప్రభుత్వం చెల్లిస్తుంది.


  బీమా పథకానికి అర్హులు.. కలిగే లబ్ధి

పీఎంజేజేవై పథకానికి 18-50 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు. ఏడాదికి రూ.330 చెల్లిస్తే ఎలాంటి మరణం అయినా రూ.2 లక్షల పరిహారం కుటుంబానికి అందుతుంది. పీఎంఎస్‌బీవై పథకానికి 18-70 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు కాగా, ఏడాదికి రూ.12 చెల్లించాలి. ఇందులో ప్రమాద మరణానికి మాత్రమే రూ.5 లక్షల పరిహారం కుటుంబానికి అందుతుంది. గతంలో చంద్రన్న బీమా పేరుతో అమలయ్యే ఈ పథకం.. ఇప్పుడు వైఎస్సార్‌ బీమాగా ఉంది. కాగా, అర్హులైన వారు తమ అకౌంట్‌ ఉండే బ్యాంకుకు వెళ్లి సొంతంగా ప్రీమియం చెల్లించి పీఎంజేజేవై, పీఎంఎస్‌బీవై పథకాలకు నమోదు చేసుకోవచ్చు. 

 కొవిడ్‌, బ్యాంకు పనివేళల కుదింపుతో ఆలస్యం 

వైఎస్సార్‌ బీమా పథకం నమోదులో వెనుకంజలో ఉండడం వాస్తవమే. కొవిడ్‌ కారణంగా సర్వే ఆలస్యమైంది. బ్యాంకు పనివేళలు కుదించడంతో దరఖాస్తులు బ్యాంకుల్లో పెండింగ్‌ పడిపోయాయి. సచివాయాల్లోనూ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ల వద్ద మరికొన్ని పెండింగ్‌ ఉన్నాయి. ఫలితంగా బీమా పథకానికి అర్హులను నమోదు చేయడంలో ఆలస్యమైంది. నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించాం.   - జేసీ రాజశేఖర్‌

Updated Date - 2021-05-26T06:26:33+05:30 IST