రూ.7కోట్లకు పక్కా డీల్‌

ABN , First Publish Date - 2020-05-29T10:21:10+05:30 IST

కనిగిరిలో పేదల ఇళ్లస్థలాల పేరుతో భూగోల్‌మాల్‌ నడుస్తోంది. నగర పంచాయితీ పరిధిలో స్థలాల కోసం దా దాపు 2వేలమంది ..

రూ.7కోట్లకు పక్కా డీల్‌

ఆ ప్రజాప్రతినిధి రూటే సపరేటు.. రెవెన్యూ అధికారులు లంచం అడిగితే తాట తీస్తాడంట.. అంతగా కావాలంటే పనిచేసినందుకు తానే ఇస్తాడంట.. ఇందతా విని అబ్బో ఎంత నిజాయితో అని అందరూ అనుకున్నారు. తీరా చూస్తే రెవెన్యూలో అవినీతి ఆగడం దేవుడెరుగు.. వారి దారినే ప్రజాప్రతినిధి నడుస్తున్నాడు. అందుకు నిదర్శనమే కనిగిరిలో పేదల ఇళ్లస్థలాల పేరుతో జరుగుతున్న స్వాహాపర్వం. పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఎందుకూ పనికి రాని కొండదిబ్బల్లోని భూముల పేరుతో రూ.7కోట్లు కొట్టేసేందుకు వ్యవహారం నడిచింది. ఇప్పటికే ప్లాట్లు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ పక్కా డీల్‌లో ప్రజారోగ్యాన్ని కూడా పట్టించుకోలేదు. ఈ వ్యవహారం గురించి తెలిసిన వారంతా ప్రజాప్రతినిధే నీతిగా ఉండరూ.. రెవెన్యూ అధికారులు మాత్రం నిజాయితీగా ఉండాలంట... అని గుసగుసలాడుకుంటున్నారు.


కనిగిరి టౌన్‌, మే 28: కనిగిరిలో పేదల ఇళ్లస్థలాల పేరుతో భూగోల్‌మాల్‌ నడుస్తోంది. నగర పంచాయితీ పరిధిలో స్థలాల కోసం దా దాపు 2వేలమంది దరఖాస్తు చేసుకున్నారు.   అధికారులు సర్వే చేసి అర్హుల జాబితాను సిద్ధం చేశారు. అందుబాటులో ప్రభుత్వ భూమి లేకపోవడంతో ప్రైవేటు కోసం వెతికారు. ఇదే అదనుగా కొందరికి అవినీతికి ఆలోచనలు మొదలయ్యాయి. నగరంలో పేరున్న ఆర్థికవర్గం నుంచి కొంతమంది, ప్రజాప్రతినిధి సామాజికవర్గం నుంచి కొందరు గ్రూపుగా మారారు.


వారు గతంలో ఎకరా రూ.27వేలు పెట్టి కొన్న భూములను ప్రభుత్వానికి లక్షల్లో విలువ చూపించి కోట్లు దండుకునేలా సదరు ప్రజాప్రతినిధి వద్ద బేరం కుదుర్చుకున్నారు. దీంతో పాటు రాబోయే స్థానిక ఎన్నికల్లో నగరంలో ఎక్కువగా ఉన్న వ్యాపారవర్గానికి చెందిన వారి ఓటుబ్యాంకుని తమకు మళ్లించాలనే ఒప్పందంతో పాటు, తమ పార్టీలో చేరేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.కోట్లల్లో వాటాలు కుదుర్చుకున్నారు. వెనువెంటనే వారు అంగరంగ వైభవంగా వైసీసీలో చేరడం అయిపోయింది. 


పనికిరాని భూములకు ఎక్కువ వాల్యూషన్‌

కనిగిరి మండలం శంఖవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నెం 76,77, 78,79,80,81లోని దాదాపు 36 ఎకరాలకు ఎకరా రూ.15లక్షలు చొప్పున రూ.5.40కోట్లు, 82 సర్వే నెంబరులోని 9 ఎకరాలకు ఎకరా రూ.22 లక్షలు చొప్పున రూ.1.98 కోట్లకు, చదరపు గజాల్లో వాల్యూషన్‌ తయారు చేయించి దాదాపు రూ.7కోట్ల ప్రజాధనం దోచుకునేందుకు పక్కాగా పన్నాగం పన్నారు. అయితే 77లో 1.85 ఎకరాలు, 79లో 1.10 ఎకరాల్లో 2.95 ఎకరాల భూమి చుక్కల భూమిగా ఉంది. అయితే 78 సర్వే నెంబరులో మొత్తం 14.90ఎకరాలు ఉండగా అందులో 78-1లో 14.65 ఎకరాలు పట్టా భూమి కాగా కేవలం 0.25సెంట్లు మాత్రం ప్రభుత్వభూమిగా ఉంది. ఈ భూమిని కూడా ఇళ్ళస్థలాలకు కేటాయించారు. ఇలాంటి రెవెన్యూలీలలు వెనుక కథేంటో మరి. మళ్ళీ పేదల్ని ఉద్దరిస్తున్నట్లు ఇళ్ళస్థలాల పేరుతో కలరింగ్‌. ప్రజలతో పాటు ప్రభుత్వాన్ని నమ్మించేలా జిల్లాలో రెవెన్యూ విభాగం చూసే జిల్లా స్థాయి అధికారి, కనిగిరి రెవెన్యూ సిబ్బంది, అధికారులు వాటాలో చేతులు తడిపి కార్యం కానిచ్చేశారు. 


గ్రానైట్‌ క్వారీల దుమ్ముతో అనారోగ్యం

పేదలకు ఇవ్వబోయే ఇళ్ళస్థలాలను కనిగిరి పట్టణంలోని గార్లపేటరోడ్డులోని మోడల్‌ స్కూల్‌ దాటి పట్టణం నుంచి దా దాపు 7 కిలోమీటర్ల దూరంతో పాటు నింబోడుకొండ ప్రాం తం దిగువనే ఇళ్ళస్థలాలు ఏర్పాటు చేయబోతున్నారు. కొండగుట్టలు ఉండటంతో పాటు సమీపంలో గ్రానైట్‌ క్వారీలు ఉన్నాయి. దీంతో నిత్యం ఆ క్వారీల నుంచి దుమ్ము ఉవ్వెత్తున లేచి సమీపంలోని  ప్రాం తాల్లో చెట్లు, పుట్టలు తెల్లటి దుమ్ముతో నిండిపోయి ఉంటుంది.


 ఆ ప్రాంతానికి సమీపంలో పేదలకు ఇళ్ళ ప్లాట్టు కేటాయిస్తే వారి ఆరోగ్యాలతో, ప్రాణాలతో చెలగాటమాడటం అన్యాయం అని ఽప్రజలు అభిప్రాయం, ఆందోళన చెందుతున్నారు. ఇంతా చేసి ఇళ్లస్థలాల లబ్ధిదారులకు ఇచ్చేది ఒకటిన్నర సెంటు. అంటే ఇక్కడి పరిభాషలో 9 అంకణాల స్థలం. మరి రూ.7కోట్లు స్వాహా చేసి కొన్న 45ఎకరాల భూమి ఎలా వినియోగించనున్నారో.


పీఏగా చెప్పుకునే వ్యక్తి హడావుడి

కరోనా వైర్‌సతో లాక్‌డౌన్‌ విధించటంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ, ఇళ్లస్థలాల కేటాయింపు ప్రక్రియ ఆగిపోయిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో ప్రజాప్రతినిధి పీఏగా వ్యవహరించే వ్యక్తి ‘నా వాటా సంగతి ఏంటో తేల్చకపోతే సార్‌ దగ్గర ఏదో ఒక సాకుతో మెలిక పెట్టిస్తా, జిల్లాలో మీడియా వాళ్ళు నాకు తెలుసు వాళ్ళకు చెప్తా’ అని బెదిరింపులకు దిగాడని తెలిసింది. ఇది స్వాహా గ్రూపునకు తలనొప్పిగా మారినట్టు సమాచారం.


Updated Date - 2020-05-29T10:21:10+05:30 IST