పైసలిస్తేనే పట్టా..!

ABN , First Publish Date - 2020-05-31T10:46:01+05:30 IST

జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్షా 68 వేల మంది ఇళ్లస్థలాలకు అర్హులుగా అధికారులు తేల్చేశారు. ఒకరిద్దరు వేరే కారణాలతో జాబితానుంచి పక్కన పెట్టినట్టే పెట్టి ఆ తదుపరి తిరిగి

పైసలిస్తేనే పట్టా..!

  • ఇంటి స్థలాల వ్యవహారంలో బ్రోకర్ల ఇష్టారాజ్యం
  • సైలెంటుగా దోపిడీకి ప్రయత్నం
  • కాదు..కూడదంటే జాబితాల్లో గల్లంతంటూ బెదిరింపులు
  • జిల్లా యంత్రాంగం దృష్టికి ఫిర్యాదులు
  • క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం..
  • జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు వార్నింగ్‌ 


అర్హులందరికీ ఇళ్ల పట్టాలిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. అధికారులు వందల ఎకరాల భూములు సేకరించి లబ్ధిదారుల జాబితా కూడా సిద్ధం చేశారు. ఇప్పుడే బ్రోకర్లు, కొందరు రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేశారు. కొన్నిచోట్ల బెదిరింపులకు దిగుతున్నారు. డబ్బు ఇస్తేనే ఇళ్ల స్థలం వస్తుందని లేకపోతే జాబితా నుంచి పేరు తొలగిస్తామని బెదిరిస్తున్నారు. దీనితో లబ్ధిదారుల్లో అలజడి మొదలైంది.


(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్షా 68 వేల మంది ఇళ్లస్థలాలకు అర్హులుగా అధికారులు తేల్చేశారు. ఒకరిద్దరు వేరే కారణాలతో జాబితానుంచి పక్కన పెట్టినట్టే పెట్టి ఆ తదుపరి తిరిగి జాబితాలోకి చేర్చారు. వలంటీర్లు నిబద్ధతతో పనిచేసిన చోట్ల జాబితాలు కూర్పు సజావుగా సాగింది. పేద వర్గాలు అందులోనూ ఇప్పటిదాకా ప్రభుత్వ పరమైన స్థలాలు ఏమీ తీసుకోనివారిని గుర్తించి దరఖాస్తులకు ప్రోత్సహించారు. ఇంతవరకూ బాగానే ఉంది. ఈలోపే కొందరు జాబితాల్లో మీరు యఽథావిధిగా కొన సాగాలంటే అంతో ఇంతో ముట్ట చెప్పాల్సిందేనంటూ కరోనా వ్యాప్తికి ముందే నమ్మకంగా తమకు అనుకూల ప్రాంతాల్లో ప్రచారం చేశారు. దీనికితోడు  అప్పటికే స్థానిక ఎన్నికల్లో పోటీచేయదలిచిన వారంతా తమకు అను కూలంగా వ్యవహరిస్తే ఇంటి పట్టా ఇచ్చేస్తామంటూ మరో తాయిలం విసిరారు.


కొంతమంది నిస్సహాయులు వీరి మాటలకు లోబడ్డారు. ఆదిశగానే కొందరు అధికార పక్ష అభ్యర్థులకు అనుకూలంగా మారారు. అప్పట్లో స్థానిక ఎన్నికల వేడి పెరుగుతున్నప్పుడు పట్టణ ప్రాంతాల్లోని ఇదే తరహా ప్రచారం కొనసాగించారు. అయితే ఇంటి పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన భూమి సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు దాదాపు వెయ్యి కోట్లకుపైగా విడుదల చేసింది. గ్రామానికి సమీపంలో ఉన్న భూమిని, అనువైన భూమిని మాత్రమే కొనుగోలు చేయాలని, దీంతోపాటు ఆ భూమిని నివాస పట్టాలకు వీలుగా చదును చేసి మరీ సిద్ధం చేయాలని షరతు పెట్టింది. దీనికి అనుగుణంగానే జిల్లా యంత్రాంగం అంతటా గాలింపు చేసి ప్రభుత్వ భూమిని ముందుగానే గుర్తించింది. ఎక్కడైతే కొనుగోలు చేయాల్సిందో అలాంటి చోట్ల రైతులను ఒప్పించి, ఇంకొన్ని చోట్ల భూమి యజమానులను ప్రాధేయపడి మరీ భూమి కొనుగోలు దాదాపు పూర్తి చేయగలిగారు.


  సుమారు లక్షా 68 వేల మందికి ఇంటి పట్టాలు సమకూర్చాలంటే నాలుగు వేల ఎకరాలు అవసరం అవుతాయని, అందుకు తగ్గట్టుగానే కలెక్టర్‌ ముత్యాలరాజు పెద్ద ఎత్తున యంత్రాంగాన్ని కదిపారు. తహసీల్దార్లను పరుగులు పెట్టించారు. పట్టాలకు అవసరమైన నాలుగు వేల ఎకరాలకు గాను 18 వందల ఎకరాలకు మాత్రం కొనుగోలు చేయక తప్పలేదు. దీంట్లోనే అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్ష తెలుగుదేశం ఆరోపణలకు దిగింది. అసెంబ్లీలో టీడీపీ ఉపనేత నిమ్మల రామానాయుడు దీనిపై బహిరంగంగానే విమర్శలకు దిగారు. రాత పూర్వకంగా అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే లబ్ధిదారుల నుంచి కొందరు సైలెంటుగా కలెక్షన్‌ చేసిన విషయం చాలా చోట్ల భారీగానే విన్పించింది. ఎమ్మెల్యేలు, మంత్రులకు తెలియకుండానే పార్టీ నేతలు క క్కుర్తి పడేందకు ప్రయత్నించారు. ఆఖరికి ఇరగవరం మండలంలో ఇళ్ల పట్టాలకు అనుగుణంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదులు రావడంతో కొవ్వూరు ఆర్డీవో లక్ష్మారెడ్డి విచారణకు దిగారు. ఫిర్యాదులు వచ్చిన ప్రతిసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు కావాలని పనిగట్టుకుని చేస్తున్న ప్రచారంగా అధికార పక్షనేతలు కొత్త రంగు పూసేందుకు ప్రయత్నించారు.


అయితే ఈ మధ్య కాలంలో దాదాపు లే అవుట్లకు సిద్ధం కావడం, లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చేందుకు తేదీలు దగ్గరపడుతున్న తరుణంలోనే ఇలాంటి ఆరోపణలు మరింతగా పెరిగాయి. అన్నిటికంటే మించి కొందరు బ్రోకర్లు ఇష్టానుసారం ప్రజల డబ్బు కాజేసేందుకు చేయని ప్రయత్నాలు అంటూ ఏమీ లేవు. అసలింతకీ వీరు ప్రజల నుంచి ఏ స్థాయిలో దోచుకుందీ కూడా బయటకు పొక్కకుండా ముందునుంచి జాగ్రత్త పడుతూనే వచ్చారు. అయితే ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా ఒకరిద్దరు ప్రయత్నించడాన్ని ప్రభుత్వమే సీరియస్‌గా తీసుకుంది.ఇక ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించరాదని నిర్ణయించారు. వీలైతే  క్రిమినల్‌ కేసులు పెట్టేందుకు తక్షణ చర్యలకు దిగాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. 


అక్రమాలకు పాల్పడితే కేసులే : కలెక్టర్‌ వార్నింగ్‌ 

ఇళ్లపట్టాల వ్యవహారంలో అవకతవకలు, అక్రమాలకు పాల్పడితే  క్రిమి నల్‌ కేసులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్‌ ముత్యాలరాజు ప్రకటిం చారు. దీనికి అనుగుణంగానే ప్రత్యేక టోల్‌ ఫ్రీనెంబర్‌ 18002331077 సమా చారం అందించవచ్చునని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేవలం నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి వ్యవహరిస్తుంటే దీనికి విరుద్ధంగా లబ్ధిదారులను మోసగించడం, వంచించడం వంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని కలెక్టర్‌ హెచ్చ రించారు. డబ్బు ఇవ్వలేకపోతే జాబితాల నుంచి తప్పించి వేస్తామని కొందరు బెదిరిస్తున్న తీరు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి వ్యక్తులను ఉపేక్షించేది లేదని చెప్పారు. 


దువ్వలో లబ్ధిదారుల ఆందోళన 

తణుకు రూరల్‌, మే 30 : తణుకు మండలం దువ్వలో ఇటీవల ఇళ్ల స్థలాల పంపిణీ కోసం 20 ఎక రాల భూమిని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి మెరక చేసే పనులు కూడా పూర్తి కావస్తున్నాయి. ఇళ్ల స్థలాలు కావాల్సిన లబ్ధిదారులు రూ.30 వేలు చెల్లిస్తేనే స్ధలం వస్తుందని గ్రామంలోని అధికార పార్టీ ముఖ్య నాయకుడు తెలపడంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. గ్రామంలో 745 మందిని అర్హులుగా గుర్తించారు. ఇప్పటికే అనేక మంది లబ్ధిదారుల నుంచి నగదు వసూలు చేసినట్టు సమాచారం.  

Updated Date - 2020-05-31T10:46:01+05:30 IST