Abn logo
Sep 25 2020 @ 03:48AM

ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్‌ డీన్‌ జోన్స్‌ హఠాన్మరణం

Kaakateeya

ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్‌, ప్రముఖ వ్యాఖ్యాత డీన్‌ జోన్స్‌ గుండెపోటుతో గురువారం ముంబైలోని ఓ హోటల్‌లో మరణించారు. 59 ఏళ్ల జోన్స్‌ ఐపీఎల్‌ వ్యాఖ్యానం కోసం బయోబబుల్‌లో ఉన్నారు.


ముంబై: ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్‌, ప్రముఖ వ్యాఖ్యాత డీన్‌ జోన్స్‌ గుండెపోటుతో గురువారం ఇక్కడి ఓ హోటల్‌లో మరణించాడు. 59ఏళ్ల జోన్స్‌ ఐపీఎల్‌ వ్యాఖ్యానంకోసం ముంబైలోని హోటల్‌లో బయోబబుల్‌లో ఉన్నాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. జోన్స్‌ ఆస్ట్రేలియాకు 52 టెస్ట్‌లు, 164 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. అయితే వన్డేల్లో డీన్‌ అద్భుత బ్యాటింగ్‌ విన్యాసాలు 80-90వ దశకంలో క్రికెట్‌ ఫ్యాన్స్‌కు అపురూపం. వన్డేల్లో 44.61 సగటుతో 6068 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, 44 హాఫ్‌ సెంచరీలున్నాయి. 1987లో వరల్డ్‌ కప్‌ గెలిచిన ఆసీస్‌ జట్టులో జోన్స్‌ సభ్యు డు. టెస్ట్‌ల్లో 46.55 సగటుతో 3631 పరగులు సాధించాడు. ఇందులో 11 శతకాలు, 14 అర్ధ శతకాలున్నాయి.

అంతా క్షణాల్లో..: గురువారం ఉదయం జోన్స్‌, సహచర వాఖ్యాత బ్రెట్‌ లీ హోటల్‌ లాబీలో నిలుచుని ఉన్నారు. ఈ సమయంలో డీన్‌ హఠాత్తుగా కుప్పకూలాడు. అతడికి గుండె నొప్పి వచ్చిందని గమనించిన బ్రెట్‌ లీ..అంతలోనే తేరుకొని జోన్స్‌కు ‘సీపీఆర్‌’ (కార్డియో పల్మనరీ రిససైటేషన్‌’) అంటే..గుండెపై గట్టిగా అదమడం ద్వారా కాపాడే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. అనంతరం జోన్స్‌ను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అతడు అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ‘డీన్‌ మెర్విన్‌ జోన్స్‌ మృతి చెందాడన్న వార్తను ప్రకటించేందుకు విచారిస్తున్నాం. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో జోన్స్‌ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం. జోన్స్‌ భౌతికకాయాన్ని స్వదేశం పంపేందుకు ఆస్ట్రేలియా హైకమిషన్‌తో సంప్రదిస్తున్నాం’ అని స్టార్‌ స్పోర్ట్స్‌ తెలిపింది. కాగా జోన్స్‌ మృతికి క్రికెట్‌ లోకం తీవ్ర సంతాపం ప్రకటించింది.


గుండె పగిలింది 

డీన్‌ జోన్స్‌ మరణవార్తతో గుండె పగిలింది. అంత గొప్ప వ్యక్తిని దేవుడు తొందరగా తీసుకుపోయాడు. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.             -సచిన్‌ 

షాక్‌కు లోనయ్యా  

డీన్‌ మృతి వార్తతో షాక్‌ తిన్నా. ఈ కష్ట సమయంలో అతడి కుటుంబానికి అండగా నిలవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా. - విరాట్‌కోహ్లీ

నమ్మలేకున్నా

ఈ వార్తను నమ్మలేకున్నా. ఎంతో విచారకరం. డీనో నిన్ను మిస్సవుతున్నాం. -డేవిడ్‌ వార్నర్‌

నీ స్మృతులను మరువలేం

జోన్స్‌ హఠాన్మరణ వార్త విని షాక్‌లో ఉన్నా. నీ స్మృతులను మరువలేం. గొప్ప వ్యక్తి. క్రికెట్‌ అంటే ఎనలేని అనురక్తి.              - ఆరోన్‌ ఫించ్‌

ఎంతో విచారకరం

జోన్స్‌ హఠాన్మరణంతో షాక్‌కు లోనయ్యాం. ఎంతో విచారకరమైన వార్త ఇది.  నిత్యం చలాకీగా ఉండే జోన్స్‌ను నిజంగా మిస్సవుతున్నాం. జోన్స్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.      -ఐపీఎల్‌ పాలక మండలి


Advertisement
Advertisement
Advertisement