మృత్యుఘోష
ABN , First Publish Date - 2020-02-10T10:51:53+05:30 IST
నవ్వుతూ మెరిసిన ఆకాశాలలో నక్షత్రాలు రాలి పోతున్న చప్పుడు నిశ్శబ్దంగా విస్ఫోటించిన అగ్నిపర్వతమేదో నిప్పుల నదినొకటి మళ్ళిస్తున్న చప్పుడు రహదారుల శబ్దఘోషలలో దగ్ధమౌతున్న ఆక్రందనల చప్పుడు కనులగంతల వెనుక రోదిస్తున్న తెరవలేని న్యాయపు కనురెప్పల చప్పుడు...
నవ్వుతూ మెరిసిన ఆకాశాలలో
నక్షత్రాలు రాలి పోతున్న చప్పుడు
నిశ్శబ్దంగా విస్ఫోటించిన అగ్నిపర్వతమేదో
నిప్పుల నదినొకటి మళ్ళిస్తున్న చప్పుడు
రహదారుల శబ్దఘోషలలో దగ్ధమౌతున్న ఆక్రందనల చప్పుడు
కనులగంతల వెనుక రోదిస్తున్న తెరవలేని న్యాయపు కనురెప్పల చప్పుడు
కీలుబొమ్మలను తెరపై కదిలిస్తున్నపుడల్లా
గారడీవాడు మీసం దువ్వుతున్న చప్పుడు
సమూహాలుగా విడగొడుతున్నవాడి చూపులలో
మరణగీతికలై రాలిపడుతున్న అమాయకుల నీడల చప్పుడు
అడవిమీదుగా వీచిన గాలికి ఉలికిపడుతున్న తాటాకుగుండె కొస చేస్తున్న చప్పుడు
గడ్డిమొక్కలాటి పేద నాడి రోజుకోసారి ఆగి కొట్టుకుంటున్న చప్పుడు
ఇది అలముకుంటున్న చీకట్లలో మానవారణ్యపు
శ్వాస చప్పుడు
విజయ్ కోగంటి
88018 23244