మృత్యు ఘంటికలు

ABN , First Publish Date - 2021-04-21T04:58:04+05:30 IST

కరోనా కేసులు, మరణాలు జిల్లావాసులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. కరోనా భారిన పడి చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ప్రతీరోజూ జిల్లాలో ఏదోచోట కరోనా మరణాలు సంభవిస్తున్నా, వైద్య ఆరోగ్య శాఖ మాత్రం చాలా వాటిని ధ్రువీకరించడం లేదు. దీంతో కరోనా మరణాలపై స్పష్టత లేకపోతోంది. రెండురోజుల కిందట జిల్లాకు చెందిన డివిజన్‌స్థాయి పోలీసు అధికారి కరోనాతో విజయనగరంలో మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా జిల్లాలో మరో ముగ్గురు కరోనా భారిన పడి మృతిచెందారు.

మృత్యు ఘంటికలు

మూడు రోజుల వ్యవధిలో.. కరోనాతో తండ్రీ కొడుకుల మృతి
జంట పట్టణాల్లో విషాదం
పలాస, ఏప్రిల్‌ 20 :
కరోనా కేసులు, మరణాలు జిల్లావాసులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. కరోనా భారిన పడి చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ప్రతీరోజూ జిల్లాలో ఏదోచోట కరోనా మరణాలు సంభవిస్తున్నా, వైద్య ఆరోగ్య శాఖ మాత్రం చాలా వాటిని ధ్రువీకరించడం లేదు. దీంతో కరోనా మరణాలపై స్పష్టత లేకపోతోంది. రెండురోజుల కిందట జిల్లాకు చెందిన డివిజన్‌స్థాయి పోలీసు అధికారి కరోనాతో విజయనగరంలో మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా జిల్లాలో మరో ముగ్గురు కరోనా భారిన పడి మృతిచెందారు. పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలకు చెందిన తండ్రీ కొడుకులు మూడు రోజుల వ్యవధిలో కరోనాతో మృతి చెందారు. కాశీబుగ్గలోని ఓ హోల్‌సేల్‌ వ్యాపారి కుటుంబంలో ఇంజినీరింగ్‌ చదువుతున్న కుమారుడికి(23) ఇటీవల కరోనా సోకింది. దీంతో ఆ యువకుడిని శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్‌) లో చికిత్స అందజేస్తున్నారు. ఈ క్రమంలో ఆ వ్యాపారికి(60) కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయింది. ఆయనను కూడా శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోనే చేర్పించారు. తండ్రి మూడు రోజుల కిందట మృతిచెందగా, కుమారుడు సోమవారం రాత్రి ప్రాణాలు విడిచాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. కేవలం మూడు రోజుల వ్యవధిలో తండ్రీ కొడుకులు మృతిచెందిన ఘటన.. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఇలా జిల్లాలో రోజూ ఎక్కడో ఒక చోట కరోనా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇటీవల మరణాలను పరిశీలిస్తే మృతుల్లో ఎక్కువ మంది యువకులు, నడి వయ స్కులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగా, కరోనా తీవ్రత నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్త మయ్యారు. కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. జ్వరాలు వస్తే తప్పనిసరిగా కొవిడ్‌ పరీక్షలు చేసుకోవాలని అధికారులు ఆదేశించారు. మాస్కు లేకుండా మార్కెట్‌కు వస్తే రూ.100 నుంచి రూ.200 వరకూ అపరాధ రుసుం విధిస్తున్నారు.     

సచివాలయ ఉద్యోగిని..
పొందూరు: పొందూరు మండలం ఓ గ్రామ సచివాలయ ఉద్యోగిని కరోనా లక్షణాలతో మంగళవారం మృతి చెందినట్లు  ఎంపీడీవో మురళీకృష్ణ తెలిపారు. ‘శ్రీకాకుళంలో నివాసముంటున్న  ఆమె ఎడ్యుకేషన్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కొద్దిరోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతూ హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. మంగళవారం శ్వాస సంబంధ సమస్య తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. ఆమె భర్త కూడా కొద్దిరోజులుగా కరోనా పాజిటివ్‌తో హోంఐసోలేషన్‌లో ఉంటున్నారు’ అని ఎంపీడీవో తెలిపారు. ఉద్యోగిని మృతిపై ఎంపీడీవో మురళీకృష్ణతో పాటు మండల పంచాయతీ కార్యదర్శుల సంఘ అధ్యక్షుడు పి.జగదీష్‌, ప్రధాన కార్యదర్శి రాజీవ్‌, జి.రాము, పొందూరు పంచాయతీ ఈవో అనూరాధ,  సచివాలయ, మండల పరిషత్‌ ఉద్యోగులు  సంతాపం తెలిపారు.

Updated Date - 2021-04-21T04:58:04+05:30 IST