నెలవారీ టీకా వేసుకున్న శిశువు మృతి

ABN , First Publish Date - 2021-10-08T05:12:03+05:30 IST

రెండోనెల టీకా వేసిన తరువాత అస్వస్థతకు గురై ఓ శిశువు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం లొద్దిగూడెం గ్రామంలో గురువారం జరిగింది.

నెలవారీ టీకా వేసుకున్న శిశువు మృతి

టీకా వికటించడమే కారణమని తల్లిదండ్రుల ఆరోపణ

భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలంలో ఘటన

ఆళ్లపల్లి, అక్టోబర్‌ 7: రెండోనెల టీకా వేసిన తరువాత అస్వస్థతకు గురై ఓ శిశువు మృతి చెందిన  ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం లొద్దిగూడెం గ్రామంలో గురువారం జరిగింది. ఆళ్లపల్లి మండలంలోని నడిమిగూడెం పంచాయతీలోని లొద్దిగూడెం గ్రామానికి చెందిన పాయం నాగేశ్వరావు, శిరోమణి, దంపతులకు ఆగస్టులో బాబుకు జన్మనిచ్చారు. ఈ క్రమంలో రెండో నెల(ఆరువారాలు) టీకాకోసం ఈనెల 6న(బుధవారం)మర్కోడు సబ్‌సెంటర్‌లోని ఏఎన్‌ఎం ద్వారా శిశువుకి టీకా వేయించారు. తరువాత స్వగ్రామం లొద్దిగూడెం వెళుతుండగా బాబు ఉగ్గపట్టి ఏడుస్తూ శరీరం చల్లబడటంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆళ్లపల్లి పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి 108లో కొత్తగూడెం ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ వైదులు సెలవుల్లో ఉన్నారని స్థానిక సిబ్బంది తెలపడంతో తల్లితండ్రులు శిశువును బతికించుకునేందుకు మూడు ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లగా వారు తమవల్లకాదని, ఖమ్మం లేదా భద్రాచలం తీసుకెళ్లాలని సూచించడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. అర్ధరాత్రి అక్కడ వైద్యులు పరీక్షించి శిశువు మృతి చెందాడని తెలిపారు. అయితే శిశవు మృతికి టీకానే కారణమని  తల్లితండ్రులు పాయం నాగేశ్వరావు, శిరోమణి, గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఆళ్లపల్లి పీహెచ్‌సీ సెకండ్‌ మెడికల్‌ అధికారి సాగర్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ఈ విషయంపై పూర్తి సమాచారం సేకరించిన తరువాత తెలియజే స్తామని తెలిపారు.  

Updated Date - 2021-10-08T05:12:03+05:30 IST