బ్లాక్‌ ఫంగస్‌తో ఒకరి మృతి!

ABN , First Publish Date - 2021-05-14T08:03:39+05:30 IST

ఓవైపు కరోనా జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. కోలుకున్న వారిని బ్లాక్‌ ఫంగస్‌ ఇన్ఫెక్షన్‌ వెంటాడుతోంది. గత వారం బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలతో హైదరాబాద్‌లో నిర్మల్‌ జిల్లా వాసి ఒకరు మృతి చెందగా..

బ్లాక్‌ ఫంగస్‌తో ఒకరి మృతి!

రాష్ట్రంలో వారంలో ఇది రెండో ఘటన

ఇద్దరూ నిర్మల్‌ జిల్లాకు చెందినవారే..

ఆస్పత్రుల్లో పెరుగుతున్న బాధితులు

మరిన్ని కేసులు రావొచ్చంటున్న వైద్యులు!


హైదరాబాద్‌ సిటీ, నిర్మల్‌ మే 13 (ఆంధ్రజ్యోతి): ఓవైపు కరోనా జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. కోలుకున్న వారిని బ్లాక్‌ ఫంగస్‌ ఇన్ఫెక్షన్‌ వెంటాడుతోంది. గత వారం బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలతో హైదరాబాద్‌లో నిర్మల్‌ జిల్లా వాసి ఒకరు మృతి చెందగా.. తాజాగా ఇదే జిల్లా కుభీర్‌ మండలానికి చెందిన వ్యక్తి (45) జూబ్లీహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. మధుమేహ బాధితుడైన ఇతడికి.. ముక్కు, కళ్ల నుంచి ఇన్ఫెక్షన్‌ మెదడుకు వ్యాపించింది. పరిస్థితి విషమించి గురువారం చనిపోయాడు. మరోవైపు నెల క్రితం నిర్మల్‌ జిల్లా భైంసా మండల వ్యక్తి (65)లోనూ బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు కనిపించాయి. కరోనా నుంచి కోలుకున్న వారంలోపే ఇతడిలో మధుమేహ స్థాయిలు పెరిగాయి. కన్ను పూర్తిగా మూసుకుపోయింది. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ వారం క్రితం మరణించాడు. నిర్మల్‌ జిల్లాకే చెందిన మరో ముగ్గురు సైతం బ్లాక్‌ఫంగస్‌ బారినపడ్డారు. కాగా, రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో నెలలో 50కి పైగా ఇలాంటి కేసులు వచ్చాయి. పదహారు మందికి నయమైంది. 34 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వీరిలో తొమ్మిదిమందికి శస్త్రచికిత్స అవసరం ఉందని తెలిసింది. గచ్చిబౌలిలోని మరో కార్పొరేట్‌ ఆస్పత్రిలో పదిమంది, గాంధీలో ముగ్గురు బాధితులున్నట్లు సమాచారం. మున్ముందు హైదరాబాద్‌లో ఈ తరహా కేసులు రోజుకు 150 వరకు రావొచ్చని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. తాను రోజుకు 2 కేసులను అడ్మిట్‌ చేస్తున్నట్లు మాదాపూర్‌లోని కార్పొరేట్‌ ఆస్పత్రి వైద్యుడు తెలిపారు.

Updated Date - 2021-05-14T08:03:39+05:30 IST