భద్రాద్రి జిల్లాలో తొలి కరోనా మరణం

ABN , First Publish Date - 2020-07-03T10:31:32+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో గురువారం కరోనాతో ఓ విద్యార్థిని(22) మృతి చెందింది. 14వ నెంబర్‌ బస్తీకి చెందిన సదరు విద్యార్థిని ఓ

భద్రాద్రి జిల్లాలో తొలి కరోనా మరణం

స్థానికులు, కుటుంబసభ్యుల్లో ఆందోళన


ఇల్లెందు, జూలై 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో గురువారం కరోనాతో ఓ విద్యార్థిని(22) మృతి చెందింది. 14వ నెంబర్‌ బస్తీకి చెందిన సదరు విద్యార్థిని ఓ ప్రవేట్‌ కళశాలలో డీగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతూ హైదరబాద్‌, ఖమ్మం, వరంగల్‌ వైద్యశాలల్లో డయాలసిస్‌ చేయించుకుంతోంది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం తన ఆరోగ్య స్థితిపై అనుమానంతో ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లకు అక్కడ వైద్యులు నమూనాలు సేకరించి వరంగల్‌లో పరీక్షలు చేయించగా బుధవారం రాత్రి వచ్చిన ఫలితాల్లో కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దాంతో ఖమ్మం వైద్యాధికారులు ఈ సమాచారాన్ని ఇల్లెందు మునిసిపల్‌ కమిషనర్‌కు తెలియజేశారు. దాంతో  గురువారం ఉదయం మునిసిపల్‌ కమిషనర్‌తోపాటు ఇతర అధికారులు విద్యార్థిని ఇంటికి వెళ్లి అంబులెన్స్‌లో ఆమెను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమద్యంలోనే మృతి చెందింది.


స్థానికుల్లో ఆందోళన

కరోనాతో మృతి చెందిన విద్యార్థిని కిడ్నీ సమస్యతో బాధపడుతుండడంతో అందరూ ఆమె అనారోగ్యానికి కిడ్నీ సమస్యే కారణమనుకొని ఇటీవల చాలామంది సమీప బంధు మిత్రులు, పరిచయస్తులు ఆమెను పరామర్శించి వెళ్లారు. ఇప్పుడు వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా కరోనాతో మృతి చెదిన విద్యార్థిని మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సైతం భయపడ్డారు.


దాంతో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి ఖమ్మం పట్టణంలోని అమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌కు సమాచారం అందించి వారిని రప్పించి తహసీల్దార్‌ మస్తాన్‌రావు, సీఐ వేణుచందర్‌, మెడికల్‌ ఆఫీసర్‌ వరుణ్‌కుమార్‌ పర్యవేక్షణలో కొవిడ్‌ నిబంధనల ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించారు.    ఇల్లెందు పట్టణంలో కరోనాతో మృతి చెందిన యువతితో 15 మంది ప్రైమరీ కాంటాక్టులు, 35 మంది సెకండరీ కాంటాక్టులుగా గుర్తించినట్లు వైద్య అధికారి డాక్టర్‌ జీ. వరుణ్‌కుమార్‌ వెల్లడించారు. వారందరినీ హోం క్వారంటైన్‌ చేసి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-07-03T10:31:32+05:30 IST