మృత్యు ‘దుర్గ్‌’

ABN , First Publish Date - 2021-04-04T06:31:50+05:30 IST

వారంలో 40 మంది మృతి. 6 వేల మందికి వైరస్‌! శ్మశానంలో అంత్యక్రియలకూ చోటు కరువు! మార్చురీల్లో పేరుకుపోతున్న

మృత్యు ‘దుర్గ్‌’

  • శ్మశానాల్లో అంత్యక్రియలకూ చోటు కరువు
  • వారంలో 40 మంది మృతి.. 6 వేల కేసులు
  • దేశంలో కొత్తగా 90 వేల పాజిటివ్‌లు; 714 మరణాలు


న్యూఢిల్లీ, దుర్గ్‌, ఏప్రిల్‌ 3: వారంలో 40 మంది మృతి. 6 వేల మందికి వైరస్‌! శ్మశానంలో అంత్యక్రియలకూ చోటు కరువు! మార్చురీల్లో పేరుకుపోతున్న మృతదేహాలు. ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రంలోని చిన్న పట్టణం దుర్గ్‌లో దయనీయ పరిస్థితి ఇది. మంగళవారం నుంచి వారం రోజుల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ ప్రకటించారు. శ్మశానాల్లో పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు చేస్తున్న దృశ్యాలు చూస్తుంటే.. గతేడాది కరోనా తొలినాళ్లలో దేశంలో నెలకొన్న పరిస్థితులు ఇప్పుడు దుర్గ్‌లో కనిపిస్తున్నాయి.


ఇక్కడి ఒక్క ప్రభుత్వ ఆస్పత్రి లోనే రోజుకు ఐదుగురు చనిపోతున్నారు. మార్చురీలో 8 ఫ్రీజర్లుంటే.. భద్రపర్చాల్సిన మృతదేహాలు 27 ఉండటం గమనార్హం. గత 14 రోజుల్లో ఛత్తీ్‌సగఢ్‌ యాక్టివ్‌ కేసులు 369 శాతం పెరిగాయి. మార్చి 20న 6,753 కేసులుంటే, ఇప్పుడు  29 వేలు అయ్యాయి.



దేశంలో కరోనా రెండో దశ పట్టపగ్గాల్లేకుండా విజృంభిస్తోంది. శుక్రవారం 89,129 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. 714 మంది మృతిచెందారు. మహారాష్ట్రలోనే దాదాపు 48 వేలు వచ్చాయి. ఛత్తీ్‌సగఢ్‌ (4,200), పంజాబ్‌ (3,000)కు తోడు కర్ణాటక (4,900), తమిళనాడు (3,200), ఢిల్లీ (3,500)ల్లోనూ కరోనా ఉధృతం అవుతోంది.  ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ శాతం కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది. మొత్తం 6.58 లక్షల యాక్టివ్‌ కేసుల్లో మహారాష్ట్ర, బెంగళూరు అర్బన్‌ (కర్ణాటక), ఢిల్లీ వాటానే 50 శాతం ఉందని పేర్కొంది. 8వ తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.



ఒడిసాలో రాత్రి కర్ఫ్యూ

దాదాపు 500 కేసులు రావడంతో ఒడిసా ప్రభుత్వం  పది జిల్లాల్లో సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయనుంది. ఈ నెల 15 వరకు అన్ని విద్యా సంస్థలను మూసివేయనున్నట్లు హిమాచల్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 10 నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగనున్న ముంబైలోని వాంఖడే స్టేడియానికి చెందిన పదిమంది సిబ్బంది, ఆరుగురు ఈవెంట్‌ మేనేజర్లకు పాజిటివ్‌గా తేలింది.  డీఎంకే ఎంపీ కనిమొళికి శనివారం కరోనా నిర్ధారణ అయింది.  నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూఖ్‌ అబ్దుల్లా (85)  శ్రీనగర్‌లోని ఆస్పత్రిలో చేరారు.


ఫోన్‌ మాట్లాడుతూ రెండుసార్లు టీకా

 ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఏఎన్‌ఎం ఫోన్‌లో మాట్లాడుతూ రెండుసార్లు వ్యాక్సిన్‌ వేసింది. కమ్లేష్‌ కుమారి (50) అనే మహిళ కాన్పూర్‌ జిల్లాలోని అక్బర్‌పూర్‌లో ఉన్న మర్హౌలీ పీహెచ్‌సీలో టీకాకు వెళ్లింది. ఫోన్‌ సంభాషణలో ఉన్న ఏఎన్‌ఎం అర్చన ఆమెకు రెండుసార్లు టీకా ఇచ్చింది. ఇలా ఎందుకు చేశావు అని అడిగినందుకు కుమారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఆమె కుటుంబ సభ్యులు పీహెచ్‌సీ ఎదుట ఆందోళన చేశారు. కాగా, కమ్లేష్‌ కుమారికి చేతి వాపు మినహా.. ఇతర తీవ్ర ఆరోగ్య ఇబ్బందులేమీ కలగలేదు. ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.


ఆరోగ్య కార్యకర్తలు రిజిస్టర్‌ చేసుకోవాలి

వ్యాక్సిన్‌ కోసం రిజిస్టర్‌ చేసుకునేందుకు ఆరోగ్య కార్యకర్తలకు మరింత సమయం ఇవ్వలేమని, వారు వెంటనే రిజిస్టర్‌ చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆలస్యం చేస్తే చేసేదేమీ లేదని, దేశంలో మరిన్ని వర్గాలను వ్యాక్సినేషన్‌ పరిధిలోకి తెస్తే ఒత్తిడి పెరుగుతుందని పేర్కొన్నది.


Updated Date - 2021-04-04T06:31:50+05:30 IST