మృతులు ఎక్కువ.. నమోదు తక్కువ

ABN , First Publish Date - 2021-06-11T07:43:40+05:30 IST

నిజంగా సంభవిస్తున్న కొవిడ్‌ మరణాలకూ పొంతనే ఉండడం లేదు.

మృతులు ఎక్కువ..  నమోదు తక్కువ
రుయా ఆసుపత్రిలో బంధువుల మరణ ధ్రువీకరణ పత్రాల కోసం బారులు తీరిన బాధితులు - మృతికి కారణం కాదు కదా కనీసం పూర్తి వివరాలు కూడా నమోదు చేయకుండా బాధితుల చేతికి ఇస్తున్న మరణ ధ్రువీకరణ పత్రం

ఆసుపత్రుల మార్చురీలు కొవిడ్‌ మృతదేహాలతో కిక్కిరిసిపోతూనే ఉన్నాయి. అంబులెన్స్‌లు శ్మశానాలకు పరుగులు తీస్తూనే ఉన్నాయి. చితులు ఆరకుండా రగులుతూనే ఉన్నాయి. అయినా సత్యాన్ని సమాధి చేసే ప్రయత్నం జరుగుతోంది. కొవిడ్‌ మరణాల అసలు లెక్కలు దాచిపెడుతున్నారు. అబద్ధాల అంకెలు గణాంకాల్లో నమోదవుతున్నాయి. ఇందుకు సాక్ష్యం ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర, మున్సిపల్‌, పంచాయతీ కార్యాలయాల దగ్గర మరణ  ధ్రువీకరణ పత్రాల కోసం పోగవుతున్న దరఖాస్తులే. 


కథనం-తిరుపతి సిటీ : జిల్లాలో కొవిడ్‌ మొదటి దశలో 2020 మార్చి నుంచి 2021 ఫిబ్రవరి 28 వరకు 91206 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 853 మంది మృతిచెందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కొవిడ్‌ రెండో దశలో ఈ ఏడాది మార్చి నుంచి మే నెలాఖరు వరకు 99883 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 643 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నమోదైంది.  ఒక్క మే నెలలోనే 313 మంది కొవిడ్‌తో మృతిచెందారని లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ లెక్కలకూ నిజంగా సంభవిస్తున్న కొవిడ్‌ మరణాలకూ పొంతనే ఉండడం లేదు. కొవిడ్‌ సోకి తీవ్ర అనారోగ్యంతో చనిపోయిన వారందరినీ కొవిడ్‌ మృతులుగా నమోదు చేయడం లేదు. సాధారణంగా కొవిడ్‌ వైరస్‌ శరీరంలో పదిరోజుల నుంచి పద్నాలుగు రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత పరీక్షిస్తే నెగటివ్‌ అనే వస్తుంది. అయితే అది శరీరంలో చేసే విధ్వంసం తీవ్రమైంది. ఊపిరితిత్తులు, గుండె, కాలేయం, కిడ్నీలను దెబ్బతీస్తుంది. దీంతో చాలామంది కొవిడ్‌ నెగటివ్‌ అయిన తర్వాత కూడా చనిపోతున్నారు. విచిత్రమైన విషయం ఏమిటంటే ఇటువంటి మరణాలను కొవిడ్‌ మరణాలుగా నమోదు చేయకపోవడం. లంగ్స్‌ దెబ్బతిని చనిపోయారనో, గుండెపోటుతో మరణించారనో, కిడ్నీలు పనిచేయలేదనో రాసేసి, సాధారణ మరణాల జాబితాలోకి వీటిని తోసేస్తున్నారు. కొవిడ్‌ మరణాల సంఖ్య తక్కువ చేసి చూపడానికి, కొవిడ్‌ మృతులకు పరిహారం చెల్లించకుండా దాటేయడానికి ఇటువంటి పనులు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు ఇలా నమోదు చేయాలనే రహస్య సూచనలుండడంతో కొవిడ్‌ వార్డుల్లోనే చనిపోయిన వారి డెత్‌ సర్టిఫికెట్‌లోనూ కొవిడ్‌ మరణాలుగా రాయడం లేదంటున్నారు. తమ వారి బాగు కోసం రోజుల తరబడి ఆసుపత్రుల వద్ద పడిగాపులు కాసిన వారి కుటుంబసభ్యులు, ఇప్పుడు డెత్‌ సర్టిఫికెట్ల కోసం ఆసుపత్రుల చుట్టూ రోజుల తరబడి తిరుగుతున్నారు. చివరికి డెత్‌ సర్టిఫికెట్‌ సంపాయించినా అందులో కాజ్‌ ఆఫ్‌ డెత్‌లో కొవిడ్‌ అని ఉండడం లేదు. ఇదేమని ప్రశ్నిస్తే, కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారని చికిత్స సమయంలోనే రెండు రోజుల కిందట నెగటివ్‌ వచ్చిందని చెబుతున్నారు.ఇక ఇంట్లోనే ఉండి  చికిత్స పొందుతూ మృతిచెందిన వారి వివరాలు  కొవిడ్‌ మరణాలుగా దాదాపుగా లెక్కల్లోకి ఎక్కడం లేదు. అలాగే ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించే వారి లెక్కలు కూడా పూర్తి స్థాయిలో బయటకు రావడంలేదు. అసలే ఆప్తుల్ని కోల్పోయిన దుఃఖంలో ఉన్నవారు  దీంతోమరింత మనోవేదనకు గురవుతున్నారు. 


కొవిడ్‌ వార్డులోనే చచ్చిపోయాడు. అయినా కొవిడ్‌తో అని రాయలేదు

మా అబ్బాయి మణికంఠ గత నెలలో కొవిడ్‌ బారిన పడ్డాడు. తంబళ్ళపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించాం. వెంటనే రుయా  ఆస్పత్రికి తీసుకువెళ్లాలని చెప్పారు. వారం రోజులు రుయా కొవిడ్‌ వార్డులో ఉన్నాడు. మే 30న ఆసుత్రిలోనే మృతిచెందాడు. మరణ ధ్రువీకరణ పత్రం కోసం పది రోజులు రుయా ఆస్పత్రి చుట్టూ తిరిగాను. ఈ నెల 9న  ఇచ్చారు. అయితే కొవిడ్‌తో చనిపోయినట్లు దాంట్లో రాయలేదు. ఎందుకు రాయలేదని అడిగితే, అలా ఇవ్వడం కుదరదని చెప్పారు. 18 ఏళ్ల నా బిడ్డని కొవిడ్‌ పొట్టన పెట్టుకుంది. అయినా ఎందుకు దాచిపెడుతున్నారో అర్ధం కావడం లేదు.


చావు సర్టిఫికెట్‌కు కూడా ఎమ్మెల్యే సిఫార్సు కావాలంట

మా నాన్న సుబ్రహ్మణ్యం కొవిడ్‌ బారిన పడటంతో ఏప్రిల్‌ 29న రుయాలో చేర్పించాం. నెల రోజులు చికిత్స చేసినా కోలుకోలేదు.  మే 27న ఆసుపత్రిలోనే మృతిచెందారు. అప్పటి నుంచి మా నాన్న మరణ ధ్రువీకరణపత్రం కోసం తిరుగుతూనే ఉన్నా. మరణానికి కారణం రాయకుండా కావాలంటే సర్టిఫికెట్‌ ఇప్పిస్తామని కొందరు చెబుతున్నారు. ఒకవేళ  కొవిడ్‌తో మృతిచెందినట్లు కావాలంటే  ఎమ్మెల్యే సిఫార్సు ఉండాలని  సలహా ఇచ్చారు. 

Updated Date - 2021-06-11T07:43:40+05:30 IST