మృత్యు మెరుపు

ABN , First Publish Date - 2021-05-17T05:38:30+05:30 IST

మెరుపు..! కొన్ని వేల కిలో వాట్ల శక్తి ఆకాశం నుంచి క్షణాల్లో భూమి పొరల్లోకి చేరే విద్యుదాఘాతం.

మృత్యు మెరుపు

  1. ఖరీఫ్‌ ఆరంభంలో పిడుగుల బెడద 
  2. ఏటా పదుల సంఖ్యలో మరణాలు
  3. రైతులు, కూలీలు, కాపరులే అధికం 
  4. అప్రమత్తంగా ఉండాలని నిపుణుల సూచన


ఆదోని, మే 16: మెరుపు..! కొన్ని వేల కిలో వాట్ల శక్తి ఆకాశం నుంచి క్షణాల్లో భూమి పొరల్లోకి చేరే విద్యుదాఘాతం. అదే పిడుగు. తొలకరి వర్షాల ఆరంభంలోనే పిడుగు ప్రమాదాలు అధికం. పొలాల్లో పనిచేస్తున్న రైతులు, కూలీలు, పశువులు, గొర్రెలు, మేకల కాపర్లు ఎక్కువగా పిడుగుపాటుకు గురై మృతి చెందుతున్నారు. ఈ నెల 10వ తేదీ ఒక్కరొజే జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు మృతిచెందారు. రోజూ ఏదో ఓ చోట పిడుగు పడుతోంది. పశువులు, మనుషులు తీవ్రంగా గాయపడటమో, ప్రాణాలు కోల్పోవడమో జరుగుతోంది. జాగ్రత్తలు పాటిస్తే పిడుగుల నుంచి రక్షణ పొందవచ్చని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు. 


ఈ మూడు నెలలు..

ఖరీఫ్‌ ఆరంభంలో పిడుగు ప్రమాదాలు అధికం. మే, జూన్‌, జూలై నెలల్లోనే పిడుగులు ఎక్కువగా పడుతుంటాయి. సాయంకాలం, రాత్రి వేళల్లో పిడుగు ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి, రైతులు, కూలీలు, గొర్రెల కాపరులు సాయంత్రం త్వరగా ఇళ్లకు చేరుకోవాలి. ఈ నెల 10వ తేదీన హొళగుంద మండలంలోని పెద్దహ్యాట గ్రామానికి చెందిన ఒకటే కుటుంబానికి చెందిన ముగ్గురు పిడుగుపాటుకు మృతి చెందారు. చిప్పగిరిలో ఒకరు, కౌతాళంలో ఒకరు ఇటీవల మరణించారు. 32 మేకలు, ఎద్దులు, గొర్రెలు పిడుగుపాటుకు మృతి చెందాయి. 


ఏం చేయాలి..?


ఆకాశం మేఘామృతమై చల్లని గాలులు వీస్తూ మెరుపులు, ఉరుములతో వర్షం ఆరంభం అవుతుంది. ఈ సూచనలు కనిపిస్తే తక్షణమే ఇంటికి చేరుకోవాలి. లేదా సమీప భవనాలల్లోకి చేరుకోవాలి. ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరుబయట ఉండరాదు.  ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కిందకు వెళ్లరాదు. 

పొలాల్లో పనిచేస్తున్న రైతులు, కూలీలు వర్షంతో పాటు మెరుపులు, ఉరుములు ఏర్పడితే భూమికి సమాంతరంగా బోర్ల పడుకోవాలి. నిటారుగ నిలవరాదు. 

ఎత్తైన కొండ ప్రాంతాలపైన పిడుగు పడే అవకాశాలు ఎక్కువ. వర్షం కురిసే సమయంలో కొండచాటుకు వెళ్లరాదు. 

విద్యుత్‌ స్తంభాలు, విద్యుత్‌ తీగలు ఉన్న ప్రాంతాల్లో నిలబడరాదు. 

ఇళ్లపైన, చెట్లపైన ఇనుము, రాగి లేదా తగరంతో బాణం ఆకారంలో తయారు చేసిన కడ్డీని ఏర్పాటు చేసి, దాన్ని వైరుకు అనుసంధానించి భూమిలో పాతిపెట్టాలి. ఎర్త్‌ వైర్‌ తరహాలో ఇలా పాతిపెట్టడం వల్ల పిడుగుపాటు సమయంలో విద్యుత్‌ నేరుగా ఆ వైరు నుంచి భూమిలోకి చేరుతుంది. మనుషులకు, పశువులకు ప్రమాదం ఉండదు. 

ఉరుములు, మెరుపుల వర్షం సమయంలో కాళ్లకు చెప్పులు వేసుకోవాలి. చెప్పులు పిడుగు ప్రమాదం నుంచి రక్షిస్తాయి. 

ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో సెల్‌ఫోన్‌ వాడరాదు. వర్షం వచ్చే సమయంలో పిడుగు వల్ల పెద్దపెద్ద ధ్వనులు, వెలుతురుతో పాటు విద్యుత్‌శక్తి కూడా విడుదల అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తద్వారా సెలఫోన్‌ పేలిపోయే ప్రమాదం ఉంటుందని, ప్రాణహాని కలుగుతుందని హెచ్చరిస్తున్నారు.


ఒక్క పిడుగులో..


ఒక్క పిడుగులో ఆరు నెలలు పాటు ఒక పట్టణ అవసరాలకు సరిపడేంత విద్యుత్‌ శక్తి ఉంటుందని పరిశోధనలు చెబుతున్నారు. విరుద్ద ఆవేశాలు ఉన్న మేఘాల మధ్య రాపిడి జరిగినప్పుడు మెరుపులు, ఉరుములు ఏర్పడుతాయి. ఆ సమయంలో మేఘాల్లో రాపిడితో జనించే ఉష్ణం 50 వేల డిగ్రీల ఫారిన్‌ హీట్‌ వరకు ఉంటుందని అంచనా. ఈ వేడి అణువులన్నీ కలిసి ఒక నాళం మాదిరి ఏర్పడి, భూమి మీద ఉన్న పాజిటివ్‌ ఎనర్జీతో కలిస్తే పిడుగు ఏర్పడుతుంది. ఒక మిల్లీ సెకెన్‌ కాలంలో మెరుపులతో కూడిన పిడుగు 20 ఆంపియర్ల విద్యుత్‌ ప్రవాహాన్ని ఏర్పరుస్తుంది. మేఘాలు ఢీకొన్నప్పుడు జనించే విద్యుత్‌ తరంగాలు సన్నని మార్గంలో భూమిమీదకు చేరేందుకు వాహకాలను వెతుకుతుంటాయి. ఎత్తైన చెట్లు, ఇనుప స్తంభాలు, ధ్వజస్తంభాలు, ఎత్తైన భవనాలు కూడా వాహకాలుగా మారే అవకాశం ఉంది. 


చెట్లు నరికేయడం వల్లే.. 


వాతావరణంలో వెంట వెంటనే జరిగే మార్పుల తోనే పిడుగు పడుతుంటాయి. అడవుల శాతం తగ్గిపోవడం, ఉన్న చెట్లను ఇష్టారాజ్యంగా నరికేయ డంతో వాతావరణం వేడెక్కిపోతుంది. భూమిపై పడిన వర్షం ఆవిరైపోయి మేఘాల్లోకి చేరుతుంది. మళ్లీ మేఘామృతమై వర్షాలు కురుస్తాయి. ఇదే సమయంలోనే పిడుగులు ఎక్కువగా పడుతుంటాయి. క్యుములోనింబర్‌ మేఘాలు ఇందు కు సహకరిస్తుంటాయి. 


ప్రథమ చికిత్స

పిడుగుపాటుతో అస్వస్థతకు గురైన వారికి వెంటనే గాలి, వెలుతురు తగిలే విశాల ప్రాంతానికి చేర్చాలి. తడి దుస్తులను తొలగించి పొడి దుస్తులు వేయాలి. వారిని పడుకోబెట్టి రెండు కాళ్లు పైకి ఎత్తి ఉంచాలి. తలను ఒకవైపు తిప్పి పెట్టాలి. ఆ సమయంలో నోటి ద్వారా నీరుగాని, ఆహారంగానీ అందించరాదు. ఆ వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందించాలి.


అప్రమత్తంగా ఉండాలి..

మెరుపు, ఉరుము వచ్చే సమయంలో చెవులు గట్టిగా మూసుకోవాలి. తద్వారా పిడుగు శబ్దంతో వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం ఉండదు. ఉరుములు, మెరుపుల సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేకపోతే నేలమీదకు పూర్తిగా కిందకు వంగాలి. పాదాల మడమల ముందు ఒకదానికి ఒకటి తాకేలా ఉండాలి. అలా చేయడం వల్ల పిడుగు పడే సమయంలో నేలపై పడి దాని విద్యుత్‌ శక్తి ఒక పాదం నుంచి శరీరంలోకి ప్రవేశించినా వెంటనే అది రెండే పాదం నుంచి తిరిగి భూమిలోకి ప్రవేశిస్తుంది. శరీరంలో విద్యుత్‌ ప్రవహించే అవకాశాలు తగ్గుతాయి. 

నివాస గృహాలపై సాధ్యమైనంత ఎత్తులో విద్యుత్‌ తీగలు ఉండేలా చూడాలి. మేఘాలు దట్టంగా కమ్ముకునప్పుడు పిడుగు పడుతుందన్న ఆలోచన రావాలి. కళ్లు మూసుకోవడం వల్ల కాంతి ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. భూమిపై ఉన్న ఎలాంటి లోహాలనూ తాకకూడదు.


తక్షణం ఆసుపత్రికి చేర్చాలి


పిడుగుపాటుకు గురైన వ్యక్తికి గుండె సంబంధిత సమస్యలు ఏర్పడుతాయి. అస్వస్థతకు గురైనవారిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాలి. సకాలంలో వైద్యం చేయలేకపోతే ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. వర్షం, ఉరుములు, మెరుపుల సమయాల్లో ఎన్ని పనులు ఉన్నా బయటకు వెళ్లకూడదు. 

- డాక్టర్‌ లింగన్న, సూపరింటెండెంట్‌, ఏరియా ఆసుపత్రి, ఆదోని

Updated Date - 2021-05-17T05:38:30+05:30 IST