Abn logo
Apr 3 2021 @ 12:18PM

నాలుగు పెద్దాసుపత్రుల నిర్లక్ష్యం... అంబులెన్స్‌లో పసివాడు కన్నుమూత!

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్లక్ష్యం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే మజ్నూ కా టీలా ప్రాంతానికి చెందిన దంపతుల ఏడాదిన్నర కుమారుడు నాల్గవ అంతస్థు నుంచి జారి కింద పడిపోయాడు. వెంటనే ఆ దంపతులు గాయపడిన ఆ బాలుడిని సివిల్ లైన్‌లోని ట్రామా సెంటర్‌కు తీసుకువెళ్లారు. అక్కడి వైద్యబృందం ఆ బాలునికి 10 నిముషాల పాటు వైద్యం అందించి, తమ దగ్గర వెంటిలేటర్ లేదంటూ ఎయిమ్స్‌కు తీసుకు వెళ్లాలని సూచించారు. 

ఆ తల్లిదండ్రులు తమ చిన్నారిని అంబులెన్స్‌లో సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అక్కడి వైద్యులు తమ ఆసుపత్రిలో బెడ్స్ ఖాళీ లేవని, వెంటనే ఎయిమ్స్‌కు తీసుకు వెళ్లాలని సూచించారు. అక్కడా బెడ్లు ఖాళీగా లేకపోవడంతో ఆ చిన్నారిని ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు బాలుడిని పరీక్షించి, వేరే ఆసుపత్రికి రిఫర్ చేశారు. దీంతో తల్లిదండ్రులు ఆ బాలుడిని ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ కూడా ఐసీయూ బెడ్లు అందుబాటులో లేవు. ఈ విధంగా ఈ దంపతులు తమ కుమారునికి చికిత్స అందించేందుకు ఆరు గంటల పాటు వివిధ ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అయినా ఎక్కడా బాలునికి వైద్యం అందలేదు. చివరికి ఆ బాలుడు అంబులెన్స్‌లోనే కన్నుమూశాడు. దీంతో ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అవధులు లేకుండా పోయాయి. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement