మృత్యు తీగలు

ABN , First Publish Date - 2020-08-11T10:17:06+05:30 IST

విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. విద్యుత్‌ తీగల రూపంలో ప్రజలు, మూగజీవాల ఉసురు

మృత్యు తీగలు

ప్రజల ప్రాణాలతో ట్రాన్స్‌కో చెలగాటం

ఈయేడు 8 మంది మృతి

జిల్లాలో పెరుగుతున్న విద్యుత్‌ ప్రమాదాలు

గాల్లో కలుస్తున్న ప్రజలు, మూగజీవాల ప్రాణాలు

నష్టపరిహారం చెల్లింపుల్లోనూ జాప్యం

పట్టించుకోని విద్యుత్‌శాఖ అధికారులు


 మంచిర్యాల, ఆగస్టు 10: విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. విద్యుత్‌ తీగల రూపంలో ప్రజలు, మూగజీవాల ఉసురు తీస్తోంది. జిల్లాలో రోజు రోజుకూ విద్యుత్‌ ప్రమాదాల సంఖ్య పెరుగుతుండగా, నివారణ చర్యలు చేపట్టడంలో ఆ శాఖ అధికారులు  విఫలమవుతున్నారు. నిత్యం విద్యుత్‌ ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రమాదాలు జరిగినప్పుడు నష్టపరిహారం అందజేసి చేతులు దులుపుకోవడం తప్ప వాటి నివారణ కు చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. 


గాల్లో కలుస్తున్న ప్రాణాలు...

విద్యుత్‌ ప్రమాదాల వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు, మూగజీవాల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. 2019-20లో 89 మూగజీవాలు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోగా 17 మంది ప్రజలు మరణించారు. 2020-21లో ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటి వరకు 70 పశువులతోపాటు 8 మంది ప్రజల ప్రాణా లు గాల్లో కలిశాయి. జూన్‌లో హాజీపూర్‌ మండలం ముల్కల్లలో ఏ మల్లేష్‌ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. 9న లక్షెట్టిపేట మున్సిపల్‌ పరిధిలోని ఇటిక్యాలకు చెందిన మురిమడుగుల భూమయ్య, 25న లక్షెట్టిపేట మండలంలోని ఎల్లారంకు చెందిన ఎల్లయ్య విద్యుధాఘాతంతో మృతి చెందాడు. జూలై 4న జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీనగర్‌లో పారిశుధ్య పనులు చేస్తున్న మున్సిపల్‌ కార్మికురాలు రాచర్ల జమునపై విద్యుత్‌ వైర్లు పడి మృతువాత పడింది.


15న మందమర్రి మండలం సారంగపల్లిలో అభిలాష్‌ గౌడ్‌, 28న దండేపల్లి మండలం ధర్మారావుపేటకు చెందిన బొమ్మనేని పోచాగౌడ్‌ మృత్యువాత పడ్డాడు. ఆగస్టు 2న జైపూర్‌ మండలం వేలాలలో మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌గా పని చేస్తున్న  మీసాల సంతోష్‌, 8న బీమారం మండలం కొత్తగూడెం కాలనీలో పులి సుధాకర్‌ విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. అలాగే జూన్‌ రెండో  తేదీన జిల్లాలోని వేర్వేరు చోట్ల విద్యుదాఘాతానికి గురై ఒకే రోజు 30 పశువులు మృత్యువాత పడ్డాయి. విద్యుత్‌ వైర్లు తెగిపడి బీమారం మండలంలోని మద్దికల్‌ శివారులో 17 పశువులు మృతి చెందగా, లక్షెట్టిపేట మండలంలోని జెండా వెంకటాపూర్‌లో గేదె, చెన్నూర్‌ మండలంలోని కాచన్‌పల్లిలో 12 పశువులు మృత్యువాత పడ్డాయి. ఇంకా జిల్లాలోని వివిధ మండలాల్లో పెద్దమొత్తంలో పశువులు మృతి చెందాయి. 


నష్ట పరిహారం కోసం ఎదురుచూపులు

విద్యుత్‌ ప్రమాదాల్లో మృత్యువాత పడ్డ ప్రజలు, పశువులకు ఆ శాఖ తరుపున నష్ట పరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. విద్యుదాఘాతానికి గురై ప్రజలు మరణించిన పక్షంలో ట్రాన్స్‌కో తరపున రూ. 5 లక్షల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. అలాగే పశువులకు రూ. 40 వేలు, గొర్రె, మేకలకు రూ. 7వేల చొప్పున చెల్లించాలి. ప్రమాదాల్లో గాయాల పాలైన సందర్భంలో ప్రమాధ తీవ్రతను బట్టి నష్ట పరిహారం చెల్లిస్తారు. 2019-20కి సంబంధించి 89 పశువులకుగాను రూ. 41 లక్షల 34 వేలు పరిహారం చెల్లించగా 17 మంది ప్రజలకు రూ. 97 లక్షలు చెల్లించారు. అదే విధంగా 2020-21కి సంబంధించి మృతి చెందిన 67 పశువులకు రూ. 2 లక్షల 47 వేలు పరిహారం అందజేశారు. అయితే ఈ సంవత్సరం జిల్లాలో ఇప్పటి వరకు 8 మంది మృత్యువాత పడగా, ఒక్కరికి కూడా నష్ట పరిహారం అందలేదు.


అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు..

ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే విద్యుత్‌ ప్రమాధాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వంగిన స్తంభాలు, వైర్లను సరి చేయకపోవడం, పొలాలు, చేల వద్ద ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లకు కంచెలు ఏర్పాటు చేయకపోవడం  ప్రమాదాలకు కారణమవుతున్నాయి.  స్తంభాలకు సపోర్టుగా బిగించే తీగలకు సైతం కొన్ని సందర్భాల్లో విద్యుత్‌ సరఫరా కావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.  సమస్యలను ట్రాన్స్‌కో అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రాణ నష్టం అధికంగా జరుగుతోంది.  జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఒకప్పుడు వినియోగించిన విద్యుత్‌ లైన్లు ప్రస్తుతం వృథాగా ఉండగా, వాటికి తగిలి ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. 


పంట పొలాల విద్యుత్‌ మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలి..

దండేపల్లి: రైతులు నాణ్యమైన కంపెనీ మోటార్లు మాత్రమే పొలాల వద్ద వినియోగించుకోవాలి. ఒక ఫేస్‌ తీగ కాలితే మోటారుమొత్తానికి విద్యుత్‌ సరఫరా అవుతుంది. ఆ సమయంలో విద్యుత్‌ మోటార్లకు తగిలితే ప్రమాదం జరిగే అవకాశంఉంది.  

  • మోటారు నడకపోతే  చేతితో టెస్టర్‌ సహాయంతో పరీక్షించాలి.
  • మోటారు వర్షంలో తడవని చోట ఏర్పాటు చేసుకోవాలి. 
  • మోటార్‌కు, స్టార్టర్లుకు ఎర్తింగ్‌ వైర్లు తప్పని సరిగా ఉంచుకోవాలి.  
  • తడి చేతులతో విద్యుత్‌ సరఫరా  అయ్యే వస్తువులను ముట్టుకోకూడదు. 
  • స్తంభాలు నేలపై పడినా విద్యుత్‌ వైర్లు తెగుతున్నట్లుగా కన్పిస్తే  అధికారుల దృష్టికి తీసుకరావాలి. 
  • పంటపొలాల వద్ద ఉన్న పంపు దగ్గర పొడిగా ఉన్న ప్రదేశంలో స్టార్టర్లులను ఏర్పాటు చేసుకోవాలి.
  • స్టార్టర్ల వద్ద ఫీజ్‌ వైర్లు సక్రమంగా ఉండే విధంగా లూజ్‌ వైర్లు లేకుండా ఉంచుకోవాలి.  
  • స్టార్టర్ల బాక్స్‌లోకి వర్షం నీరు పోకుండా  జాగ్రత్త పడాలి.
  • రైతులే  ట్రాన్స్‌పార్మర్ల వద్ద  చిన్న చిన్న మరమ్మతులు చేస్తుంటారు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

డాక్యుమెంట్లు అందకనే ఆలస్యం..ట్రాన్స్‌కో ఎస్‌ఈ రమేష్‌బాబు

విద్యుత్‌ ప్రమాదాల్లో ప్రజలు మృత్యువాత పడిన సందర్భంలో వారి డాక్యుమెంట్లను కుటుంబ సభ్యులు సరిమైన సమయంలో అందించకపోవడంతోనే నష్ట పరిహారం చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ఇప్పటి వరకు కేవలం ముగ్గురి డాక్యుమెంట్లు అందగా వారికి పరిహారం చెల్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. మిగతా వారివి కూడా త్వరలో అందజేస్తాం. 

Updated Date - 2020-08-11T10:17:06+05:30 IST