కేసులు పెరిగినా..మరణాలు తక్కువే!

ABN , First Publish Date - 2021-04-11T06:56:35+05:30 IST

తెలంగాణలో కూడా... కిందటి సంవత్సరంతో పోలిస్తే ఈసారి రోజువారీ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మన రాష్ట్రంలో గత ఏడాది మార్చి 2న మొదటి కేసు నమోదవగా.. 2020 ఆగస్టు 22న 2,474 కేసులు నిర్ధారణ అయ్యాయి.

కేసులు పెరిగినా..మరణాలు తక్కువే!

కేసులు పెరిగితే మరణాల సంఖ్య పెరిగే ముప్పు

6 రాష్ట్రాల్లో ఇప్పటికే ఆ ధోరణి

రాష్ట్రంలో మరణాలు గత ఏడాది స్థాయిలోనే..


సెంట్రల్‌ డెస్క్‌ :

తెలంగాణలో కూడా... కిందటి సంవత్సరంతో పోలిస్తే ఈసారి రోజువారీ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మన రాష్ట్రంలో గత ఏడాది మార్చి 2న మొదటి కేసు నమోదవగా.. 2020 ఆగస్టు 22న 2,474 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆ రోజు మరణాల సంఖ్య 7. అంటే నిరుడు రోజువారీ కేసుల సంఖ్య 2 వేలు దాటడానికి 173 రోజులు పట్టింది. అంటే దాదాపుగా ఆరు నెలలు. ఇక గత ఏడాది ఆగస్టు 28న రాష్ట్రంలో అత్యధికంగా 3,018 కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చి.. ఫిబ్రవరి 15న రాష్ట్రం మొత్తమ్మీదా కలిపి అత్యల్పంగా 99 కేసులే నమోదయ్యాయి. 23వ తేదీ నాటికి సున్నామరణాలు నమోదయ్యాయి. కానీ.. ఆ తర్వాత వైరస్‌ మళ్లీ వేగం పుంజుకుని కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. సరిగ్గా 51 రోజుల్లో కేసులు 2 వేల మార్కును దాటేశాయి. మరణాల సంఖ్య మాత్రం దాదాపు గత ఏడాది స్థాయిలోనే ఉండడం గమనార్హం. 


దేశంలో కరోనా కేసుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. నిరుడు కేసుల సంఖ్య పతాకస్థాయికి చేరడానికి కొన్ని నెలలు పడితే... ఈసారి అందుకు కొన్ని వారాలే పట్టింది. కానీ జాతీయస్థాయిలో మరణాల సంఖ్య మాత్రం కిందటేడాదితో పోలిస్తే ఇప్పుడు దాదాపు సగమే ఉండడం ఊరట కలిగించే విషయం. మన రాష్ట్రంలో మాత్రం కేసులు, మరణాల సంఖ్య కిందటి సంవత్సరం పతాకస్థాయితో దాదాపు సమానంగానే ఉండడం గమనార్హం. గణాంకాలు చూస్తే.. 2020లో మనదేశంలో మొట్టమొదటి కరోనా కేసు కేరళలో జనవరి 27న నమోదైంది. లాక్‌డౌన్‌ ఆంక్షల వల్ల, భయంతో ప్రజలే బయటకు రాకపోవడం వల్లనో.. కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతూ సెప్టెంబరు 26 నాటికి పతాకస్థాయికి చేరుకుంది. ఆరోజు అత్యధికంగా 97,860 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నుంచి కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఫిబ్రవరి 1న దేశవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య కేవలం 8,587.


గత ఏడాది జూన్‌ 1 తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదుకావడం అదే. ఇక మరణాల సంఖ్య చూస్తే.. కేసులు పతాకస్థాయిలో ఉన్న సెప్టెంబరు 26న మరణాల సంఖ్య 1140. దానికి ఒక్కరోజు ముందు అంటే సెప్టెంబరు 25న 1283 మంది మరణించారు. 2020లో రోజువారీ మరణాల సంఖ్య అదే అత్యధికం. ఆ తర్వాత నుంచి మరణాల సంఖ్య, కేసుల సంఖ్యకు అనుగుణంగానే తగ్గుతూ వచ్చింది. ఇక ఈ ఏడాది మార్చి నుంచి మళ్లీ కేసులు పెరగడం మొదలైంది. కిందటేడాది పతాకస్థాయి 97,860కి దగ్గరగా ఈ ఏడాది ఏప్రిల్‌ 4న 1,03,793 కేసులు నమోదయ్యాయి. ఆ రోజు మరణాల సంఖ్య 1140 కాగా.. ఏప్రిల్‌ నాలుగున మరణాల సంఖ్య 477. ఇక.. ఏప్రిల్‌ 7న ఉదయం 8 గంటల నుంచి ఏప్రిల్‌ 8న ఉదయం 8 గంటల వరకూ దేశంలో నమోదైన కేసుల సంఖ్య ఏకంగా 1.26 లక్షలు! మరణాలు 685. అంటే.. గత ఏడాదితో పోలిస్తే జాతీయస్థాయలో మరణాల సంఖ్య బాగా తగ్గిందని రుజువు చేసే గణాంకాలివి.


ఊరటే కానీ..

కేసులు భారీగా పెరుగుతున్నా మరణాల సంఖ్య తక్కువగా  ఉండడానికి మూడు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి.. నిరుటితో పోలిస్తే కొవిడ్‌ చికిత్స విషయంలో వైద్యనిపుణులకు ఇప్పుడు పూర్తి స్పష్టత ఉంది. సమర్థమైన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. వ్యాక్సిన్లు కూడా వచ్చేశాయి. ఇక రెండో కారణం.. టెస్టింగ్‌ పెరగడం. మూడోది.. ఇన్ఫెక్షన్ల తీవ్రత తక్కువగా ఉండడం. ఇలా కారణాలేవైనాగానీ మరణాల రేటు మనదేశంలో చాలా తక్కువగా ఉంటోంది. ప్రతి పదిలక్షల జనాభాకు నమోదవుతున్న కరోనా మరణాల సంఖ్య బట్టి..  భారతదేశం ప్రపంచంలోనే 14వ స్థానంలో ఉంది. ప్రతి పదిలక్షల మందికిగాను 1868 కరోనా మరణాలతో యూకే ఈ విషయంలో మొదటిస్థానంలో ఉండగా.. 1665 మరణాలతో అమెరికా రెండో స్థానంలో ఉంది. ఈవిషయంలో ప్రపంచ సగటు 365 కాగా.. భారత్‌లో ప్రతి మిలియన్‌ జనాభాకూ సగటున 120 మందే మరణిస్తున్నారు. ఇలా తక్కువగా ఉండడం ఊరటే. కానీ.. కొత్త కేసుల నమోదు ఇదేస్థాయిలో కొనసాగితే మరణాల రేటు కూడా పెరిగిపోతుంది. కేసులు ఎంత వేగంగా రెట్టింపు అవుతుంటే.. అంతే వేగంతో రెట్టింపు మరణాలు నమోదయ్యే ముప్పు ఉంది. ఇప్పటికే ఛత్తీ్‌సగఢ్‌, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఆ ధోరణి కనిపించడం ఆందోళనకరం.  

Updated Date - 2021-04-11T06:56:35+05:30 IST