మూడోరోజు రుయా మృతుల జాబితా

ABN , First Publish Date - 2021-05-14T08:07:09+05:30 IST

తిరుపతి రుయా ఆస్పత్రిలో 10న ఆక్సిజన్‌ సరఫరా ఆగిన ఘటనలో మృతిచెందిన వారి జాబితాను ఎట్టకేలకు మూడోరోజు కలెక్టర్‌ హరినారాయణ్‌ విడుదల చేశారు. ఘటన జరిగిన రోజు ఆయన

మూడోరోజు రుయా మృతుల జాబితా

11 మంది పేర్లతో విడుదల చేసిన కలెక్టర్‌ 

తిరుపతి, మే 13(ఆంధ్రజ్యోతి): తిరుపతి రుయా ఆస్పత్రిలో 10న ఆక్సిజన్‌ సరఫరా ఆగిన ఘటనలో మృతిచెందిన వారి జాబితాను ఎట్టకేలకు మూడోరోజు కలెక్టర్‌ హరినారాయణ్‌ విడుదల చేశారు. ఘటన జరిగిన రోజు ఆయన ప్రకటించిన ప్రకారం 11మంది మృతుల పేర్లు, చిరునామాతో జాబితాను గురువారం బహిర్గతం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియాను కొన్ని కుటుంబాలకు చెక్కుల రూపంలో గురువారమే పంపిణీ చేశారు. రుయాలో జరిగిన ఆ దుర్ఘటనలో ఎంతమంది చనిపోయారనే అంశంపై ఇంకా వివాదం నడుస్తూనే ఉంది. ఆక్సిజన్‌ సరఫరా ఆగిపోవడంతో 23మంది చనిపోయారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ జాబితా విడుదల చేయగా మొత్తం 29మంది చనిపోయారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మరో జాబితా ప్రకటించారు. దీనికితోడు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఆ రోజు 56మంది చనిపోయారని, అయితే ఆక్సిజన్‌ సరఫరా ఆగిన సమయంలో 11మంది చనిపోయారని వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. రుయా వర్గాలు మృతుల కుటుంబాలకు అందజేసిన డెత్‌ డిక్లరేషన్‌ పత్రాల్లో పలువురికి ఆక్సిజన్‌ సరఫరా ఆగిపోయిన సమయమే పేర్కొని ఉంది. వారి పేర్లు కలెక్టర్‌ ప్రకటించిన జాబితాలో లేకపోవడం, మృతుల సంఖ్యను తక్కువ చేసి చూపడం వివాదాన్ని రేకెత్తిస్తోంది. బీజేపీ నేతలు మృతుల సంఖ్య తగ్గించి చూపుతున్నట్టు కొన్ని ఆధారాలతో ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశారు. తమ పార్టీకి చెందిన నాయకుడొకరు ఆ ప్రమాదంలో చనిపోయినట్టు ఆధారాలు కూడా జత చేశారు. 


Updated Date - 2021-05-14T08:07:09+05:30 IST