Abn logo
Jun 26 2021 @ 08:29AM

డెబిట్‌ కార్డులతో 8.37 లక్షలు దారి మల్లింపు

  • ఇద్దరు నేరగాళ్ల అరెస్ట్‌
  • టీఎంలో మర్చిపోయిన 319 డెబిట్‌ కార్డుల సేకరణ
  • పేటీఎం స్కానింగ్‌ మెషిన్‌లతో సొంత ఖాతాలోకి బదిలీ


హైదరాబాద్‌ సిటీ : ఇద్దరూ వరుసకు బంధువులు. ఉద్యోగాలు పోవడంతో కొత్త తరహా మోసానికి తెరలేపారు. నకిలీ పత్రాలతో రెండు దుకాణాల పేరుతో పేటీఎం స్కిమ్మింగ్‌ మెషీన్‌లను తీసుకున్నారు. ఏటీఎం సెంటర్ల వద్ద మర్చిపోయిన వైఫై ఎనేబుల్‌ డెబిట్‌ కార్డులను సేకరించి పేటీఎం స్కానింగ్‌ యంత్రాల ద్వారా అందులో ఉన్న నగదును తమ ఖాతాలోకి మార్చుకుంటున్నారు. ఇలా మోసాలకు పాల్పడుతున్న వారిరువురిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కమిషనరేట్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ సజ్జనార్‌ కేసు వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా కూచిపూడికి చెందిన తల్లా శ్రీనివాసుల రెడ్డి (26), అదే ప్రాంతానికి చెందిన పిల్లి కొండారెడ్డి(25) ఇద్దరూ బంధువులు. శ్రీనివాస రెడ్డి ఇంజనీరింగ్‌ పూర్తిచేసి ఉద్యోగం కోసం 2015లో నగరానికి వచ్చాడు. ప్రైవేటు సంస్థలో ఉద్యోగంలో చేరాడు.

కొండారెడ్డి హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తిచేసి ఓ హోటల్‌ లో పనిచేస్తున్నాడు. ఇద్దరూ కలిసి షేక్‌పేటలో రూంలో ఉండేవారు. లాక్‌డౌన్‌ సమయానికి ఇద్దరూ ఉద్యోగాలు మానేశారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ వీళ్లిద్దరూ ఉద్యోగం లేకపోవడంతో మోసాలకు తెరలేపారు. శ్రీనివాసరెడ్డి వెంకటేశ్వర కిరణా జనరల్‌ స్టోర్‌ పేరుతో, కొండారెడ్డి శ్రీలక్ష్మి కిరాణ జనరల్‌ స్టోర్‌ పేరుతో పత్రాలను సృష్టించి కొటక్‌ మహీంద్రా, సిటీ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. వాటిని వినియోగించి రెండు పేటీఎం మెషీన్‌లు, ఒక భారత్‌పే మిషన్‌లను అధీకృత యూపీఐ సంస్థల నుంచి కొనుగోలు చేశారు. అనంతరం ద్విచక్రవాహనంపై కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మాదాపూర్‌, గచ్చిబౌలి, అమీర్‌పేట ప్రాంతాల్లో సంచరిస్తూ ఏటీఎం సెంటర్లలో మర్చిపోయిన వైఫై ఎనేబుల్డ్‌ కార్డులను సేకరించేవారు. పిన్‌ అవసరం లేకుండా కొంతమొత్తాన్ని షాపింగ్‌కు వినియోగించే అవకాశం ఉండడంతో దాన్ని అనువుగా మలుచుకొని పేటీఎం యంత్రం సాయంతో తమ ఖాతాలోకి డబ్బు మళ్లించుకునే వారు. 


ఖాతాదారుడు గుర్తించి కార్డును బ్లాక్‌ చేసేలోపు పలుదఫాలుగా రోజుకు కార్డును బట్టి రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు తమ ఖా తాలకు మళ్లించుకునే వారు. ఇలా వీరు మొత్తం 319 డెబిట్‌ కార్డులను సేకరిం చి వాటి నుంచి రూ.8.37 లక్షలు కాజేశారు. వీరిపై కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, రాయదుర్గం పోలీస్‌స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. కూకట్‌పల్లి ప్రధాన రహదారిపై అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిని అదుపులోకి తీసుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు విచారించగా ఈ మోసం వెలుగులోకి వచ్చింది. వీరిద్దరి నుంచి రూ.2.50 లక్షలతోపాటు, 2 పేటీఎం, 1 భారత్‌పే మెషిన్‌లు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా డెబిట్‌ కార్డు పోయినట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత బ్యాంకు అధికారులకు తెలిపి బ్లాక్‌ చేయించుకోవాలని సీపీ సజ్జనార్‌ సూచించారు. మంచి ప్రతిభ చూపి నిందితులను అరెస్ట్‌ చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు.

హైదరాబాద్మరిన్ని...